జైసపా దుఖాణ్ బంద్
posted on Jul 2, 2014 @ 7:28PM
సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగి, రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన అధిష్టానాన్ని ముప్ప తిప్పలు పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ప్రజలకు మొహం చూపించలేని దుస్థితిలో ఉన్నారు. ఆది నుండి అందరితో కయ్యమే తప్ప నెయ్యం ఎరుగని ఆయనను నేడు పలుకరించేవారే లేరు. రాష్ట్ర విభజన అంశం మొదలుకొని కాంగ్రెస్ ను వీడి జైసపా స్థాపన, నామినేషన్ వేయకపోవడం వరకు వరుసగా అన్ని తప్పులే చేసుకొంటూ ముందుకు సాగిన ఆయన చివరికి పార్టీ పెట్టిన మూడు నాలుగు నెలలోనే మూసేసుకోవలసి వచ్చింది.
ఎటువంటి రాజకీయానుభవము లేని అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమాద్మీ పార్టీని పెట్టి ఏడాది పాటు దిగ్విజయంగా నడిపించి జాతీయ పార్టీలయినా కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించి డిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగలిగారు. ఎటువంటి రాజకీయ అనుభవము లేని చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని దాదాపు ఏడాదిపైనే నడిపించి కాంగ్రెస్ సముద్రంలో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి కూడా పుచ్చుకొన్నారు. ఎటువంటి రాజకీయానుభవం లేని జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసులు ఎదుర్కొంటూ జైల్లో ఉంటూనే పార్టీని నడిపించడమే,అనేక ఓడిడుకులను ఎదుర్కొంటూనే గత ఐదేళ్ళుగా పార్టీని ఏకత్రాటిపై నిలబెట్టగలిగారు. ఎన్నికలలో పోటీ చేసి ఏకంగా అరవై ఏడు యం.యల్యే., తొమ్మిది యంపీ సీట్లు కూడా గెలుచుకోగలిగారు. ఎటువంటి రాజకీయ అనుభవము లేని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ, పరిస్థితులను చూసి తెదేపా-బీజేపీలకు మద్దతు తెలిపి మంచి పేరు సంపాదించుకోగలిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులతో ‘శభాష్’ అనిపించుకొని వారితో సత్సబందాలు పెంపొందించుకోగలిగారు.
కానీ కిరణ్ కుమార్ రెడ్డికి సుదీర్గ రాజకీయానుభవం, ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయలపై మంచిపట్టు, చివరి నిమిషం వరకు చేతిలో అధికారం అన్నీ ఉండి కూడా అల్లుడి నోట్లో శని అన్నట్లు పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక, పార్టీని నడిపించలేక పరువు తీసుకొన్నారు. రెండు రోజుల క్రితం మాదాపూర్ లో జైసపా కార్యాలయం కోసం అద్దెకు తీసుకొన్న భవనం కూడా ఖాళీ చేసేసారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే ఆయన రాజకీయ జీవితంలో మరొక తప్పుకు సిద్దమవుతున్నారనుకోవలసిందే. ఒక అనుభవజ్ఞుడయిన రాజకీయనాయకుడు ఇంత తక్కువ సమయంలో వరుస పెట్టి ఇన్ని తప్పులు చేయడం సాధ్యమేనా? అంటే 'అవునుసాధ్యమే'నని కిరణ్ కుమార్ రెడ్డి నిరూపించి చూపారు.