తిరుమల కొండపై కూడా రాజకీయాలు మాట్లాడటం అవసరమా?
సాధారణంగా ప్రజలు కేవలం దైవదర్శనం కోసమే అనేక వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలకు వెళుతుంటారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం దైవదర్శనంతో బాటు అలవాటులో పొరపాటుగా అక్కడ కూడా రాజకీయాలు చేస్తుంటారు. మీడియావాళ్ళను చూడగానే తామొక పరమ పవిత్రమయిన పుణ్యక్షేత్రంలో ఉన్నామనే సంగతి కూడా మరిచిపోయి తమ రాజకీయ ప్రత్యర్ధులపై చెలరేగిపోతుంటారు. ఆధ్యాత్మిక అంశాలతో ఎటువంటి సంబంధమూ లేని మాటలు, ప్రకటనలు, వ్యాక్యాలు, విమర్శలు చేస్తుంటారు. కేవలం గోవింద నామస్వరం ప్రతిధ్వనించాల్సిన పవిత్రమయిన తిరుమల కొండపై రాజకీయ నేతలు ఈవిధంగా రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేయడం చాలా అవివేకం, అసంబద్దం, అపచారం కూడా. అసలు వారు దైవదర్శనానికి ఎందుకు వచ్చారో గ్రహించినట్లయితే ఆవిధంగా మాట్లాడరు.
తిరుమల వచ్చే ప్రతీ రాజకీయ నాయకుడు, దైవదర్శనం వల్ల కలిగిన పుణ్యాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడేసి అక్కడే తుడిచిపెట్టుకొని కొండదిగి వస్తుంటారు. రాజకీయ నాయకులు, సినీ తారలు తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటమే కాదు వారి రాక వల్ల సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కూడా అంతులేదు. ఒక్క రాజకీయ నేత దైవ దర్శనానికి వచ్చినట్లయితే, యావత్ టీటీడీ అధికారులు, చివరికి గుళ్ళో పూజారులు సైతం సామాన్య భక్తులను, దేవుడిని కూడా గాలికొదిలి పెట్టి సదరు నేతలు, తారల సేవకు అంకితమయిపోతారు. జనాలు నవ్వితే నవ్వి పోదురు గాక... ఈసడించుకొంటే ఈసడించుకొందురు గాక మాకేల సిగ్గు ఎగ్గు... అన్నట్లు వ్యవహరిస్తారు నేతలు, టీటీడీ అధికారులు.
మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే తిరుమల దేవుని దర్శనానికి వచ్చే స్వామీజీలు, పీటాదిపతులు, బాబాలు కూడా తమకు రాచమర్యాదలు జరగాలని కోరుకోవడం, అలకలు పూనడం, మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం. సర్వసంఘ పరిత్యాగులమని చెప్పుకొనే వారు భౌతిక వాంఛలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించకపోగా వారు కూడా రాజకీయ నాయకులలాగే వ్యవహరిస్తుంటారు. దైవ సన్నిధిలో అందరూ సమానమే అనే భావన వారిలో ఏ కోశాన్న కనబడదు. నిజం చెప్పాలంటే ఆ దేవునికంటే తామే మిన్న అన్నట్లు, తాము ఆ దేవుని కొలవడానికి రావడం ఆ దేవుని అదృష్టం అన్నట్లు ఉంటుంది వారి వ్యవహార శైలి. వారు కూడా తమకు వీవీఐపీ ట్రీట్ మెంటు, సకల సౌకర్యాలు కల్పించాలని లేకపోతే అక్కడే ధర్నాలు కూడా చేస్తుంటారు.
బహుశః ఇటువంటి దురలవాట్లు మరే ఇతర మతస్తుల పుణ్యక్షేత్రాలలో కనబడదు. కేవలం హిందూ పుణ్య క్షేత్రాలలో అదీ సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ వచ్చే తిరుమలలోనే ఎక్కువగా కనబడుతుంది. తిరుమల కొండపై ఈవిధంగా నేతలు, సినీ తారలు మీడియాతో మాట్లాడటం, రాజకీయ విమర్శలు చేయడం చాల సహజ విషయమన్నట్లు ప్రజలు, ప్రభుత్వాలు, మీడియా చివరికి టీటీడీ కూడా భావించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిన్న తిరుమల శ్రీవారి దర్శినం కోసం వచ్చిన ఆనం వివేకానంద రెడ్డి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఆ పనేదో ఆయన కొండ క్రిందకు దిగివచ్చి చేసి ఉండి ఉంటే ఎవరికీ అభ్యంతరమూ ఉండేది కాదు. ఇది ఆయనొక్కరికే కాదు, తిరుమల కొండపై అడుగుపెట్టే ప్రతీ రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది. పరమ పవిత్రమయిన దైవ కార్యంలో నిమగ్నమవ్వాల్సిన టీటీడీ బోర్డులో అనేక నేరాలు, సారా వ్యాపారాలు, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిన రాజకీయ నాయకులకు పదవులు కట్టబెట్టడమే ఈ అనర్దాలన్నిటికీ మూలకారణం. తిరుమల పవిత్రత, ఆచార వ్యవహారాల గురించి ఏమాత్రం అవగాహన లేని నేతలు, ఆధ్యాత్మికత, మానవసేవ, దైవార్చన, నియమ నిష్టల పట్ల ఏమాత్రం ఆసక్తిలేని వారికి ఇటువంటి బాధ్యతలు అప్పగిస్తునంత కాలం ఈ పరిస్థితుల్లో మార్పు ఉండదు.
ఇప్పటికయినా ప్రభుత్వం తిరుమల పవిత్రతను, గొప్పదనాన్ని కాపాడేవిధంగా చర్యలు తీసుకొని, అందుకు అర్హులయిన వారి చేతుల్లోనే టీటీడీని పెట్టాలి. కొండపై జరుగుతున్న ఈ అపచారాలను అరికట్టే ప్రయత్నాలు చేయాలి. తిరుమలలో తొలి ప్రాధాన్యత ఆ ఏడుకొండల వాడికే తప్ప నేతలు, స్వామీజీలకు కాదు. ఆ తరువాత ప్రాధాన్యం ఎంతో వ్యవ ప్రయాసలకోర్చి ఎంతో భక్తితో వస్తున్న సామన్యభక్తులకే తప్ప నేతలకు పీటాధిపతులకు కాదనే సంగతి టీటీడీ కూడా గ్రహిస్తే బాగుంటుంది.