విద్యార్ధుల పట్ల వివక్ష సమర్ధనీయమేనా?
posted on Jul 1, 2014 @ 9:35PM
తెలంగాణా ప్రభుత్వం కేవలం తెలంగాణా విద్యార్దులకే ఫీజు రీయింబర్సమెంటు ఇవ్వాలని నిర్ణయించుకొంది. తమ ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గించుకోనేందుకే ఆవిధంగా చేయవలసి వస్తోందని చెప్పి ఉండి ఉంటే ఆ నిర్ణయాన్ని ఎవరూ తప్పు పట్టి ఉండేవారు కారేమో. కానీ, ఆంధ్ర విద్యార్ధులకు ఫీజు రీయింబర్సమెంటు చేయవలసిన అవసరం తమకు లేదని నిష్కర్షగా చెప్పడంతో విమర్శలు ఎదుర్కోక తప్పడంలేదు. భావిభారత పౌరులయిన విద్యార్ధులలో స్వయంగా ప్రభుత్వమే ఇటువంటి విద్వేషపూరిత ఆలోచనలు ప్రేరేపించడం ఏవిధంగా సమర్ధనీయం? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నేడు ఆంధ్రా లేదా తెలంగాణాలో చదువుకొన్న విద్యార్ధులు రేపు ఈ రెండు రాష్ట్రాలకే కాక యావత్ దేశానికి కూడా పేరు ప్రతిష్టలు తేవచ్చును. దేశాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించవచ్చును. అనంతపురం జిల్లా నుండి హైదరాబాదుకు తరలివచ్చి స్థిరపడిన కుటుంబంలో జన్మించిన సత్య నాదెళ్ళ హైదరాబాదు పుట్టి పెరిగారు. అక్కడే చదువుకొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు సి.ఈ.ఓ.గా సమున్నత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలకు ఆయనే ఆశాదీపంగా కనిపిస్తున్నారు. అందువల్ల స్థానికత సాకుతో విద్యార్ధుల పట్ల వివక్ష తగదు.
ఇప్పటికే స్థానికత కారణంగా విద్యార్ధులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం 1956కు ముందు నుండి ఉన్న వారు మాత్రమే స్థానికులని, వారు మాత్రమే తెలంగాణా ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు పొందేందుకు అర్హులని చెప్పడం చాలా దారుణం.
రాష్ట్రవిభజన జరుగుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. అందుకే గత రెండు మూడు దశాబ్దాలలో చాలా మంది ఆంధ్రా ప్రాంతాల నుండి హైదరాబాద్ కు తరలి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అటువంటి వారందరి సమిష్టి కృషి కారణంగానే నేడు హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకోగలిగింది. అయితే ఈ విషయాన్ని తెలంగాణా ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు గాక. అది వేరే విషయం. కానీ అనేక ఏళ్లుగా హైదరాబాద్ లోనే స్థిరపడిన వారి పిల్లలు అక్కడే పుట్టి పెరిగి చదువుకొంటున్నప్పటికీ వారు తెలంగాణా వారు కాదని చెప్పడం సమంజసం కాదు. వారే కాక ఆంధ్ర నుండి ఉన్నత విద్యలభ్యసించేందుకు అనేకమంది విద్యార్ధులు హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు వచ్చినవారున్నారు. వారందరికీ తెలంగాణా ప్రభుత్వమే ఫీజు రీయింబర్సమెంటు చేయవలసిన అవసరం లేదు. ఆంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుపుకొని విద్యార్ధులందరికీ ఫీజు రీయింబర్సమెంటు చేసేందుకు ప్రయత్నించాలి తప్ప ఇటువంటి వివక్ష చూపడాన్ని ఎవరూ హర్షించరు. ఆంధ్రప్రభుత్వం కూడా ఈవిషయంలో వెంటనే చొరవ తీసుకొని తెలంగాణా ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి విద్యార్దులెవరూ కూడా నష్టపోకుండా చూడాలి.
దేశానికి వెన్నెముక వంటి విద్యార్ధులలో జాతీయ భావం పెంపొందేలా ప్రభుత్వాలు చర్యలు చెప్పట్టాలి తప్ప వారిలో విద్యార్ధి స్థాయి నుండే విద్వేషభావనలు పెంపొందించే ప్రయత్నాలు చేయడం ఘర్షణీయం.