ప్రాచీన ఆదర్శం పనికిరానిది ఎందుకయ్యింది?

 

ప్రాచీన ఆదర్శం పనికిరానిది ఎందుకయ్యింది?

ఓ గ్రామంలోని ప్రజలు రోజంతా ఉపవాసం ఉన్నారు. రాత్రంతా భజన చేస్తూ గడిపారు. తెల్లారి నదికి అవతల ఉన్న మందిరానికి బయలుదేరారు. భగవంతుని దర్శనం తరువాత వారు ఉపవాసం వదిలేస్తారు. నది దాటే ముందు ఆ నది ఒడ్డున ఓ సాధువు కనిపించాడు. సాధువుకు నమస్కారం చేసి ఆయనకు పళ్లు సమర్పించారు. వారి ముందే సాధువు ఆ పళ్ళను ఆరగించాడు. వారిని ఆశీర్వదించాడు - ఇంతలో ఆకాశం మేఘావృతమైంది. గాలులు వీచసాగాయి, చినుకులు పడటం మొదలైంది. ఉపవాసమున్న వారంతా ఆందోళన చెందసాగారు. నది దాటి వెళ్ళి భగవంతుడిని అర్చించందే వారు ఉపవాసదీక్ష వదిలేందుకు వీలు లేదు. క్షణక్షణానికీ గాలులు తీవ్రతరం అవటంతో వారి ఆందోళన పెరగసాగింది. ఏదో ఓ రకంగా నదిని దాటించమని పడవవాడిని బతిమలాడసాగారు.

 "మీ పూజలో ఏదో లోపం ఉండి ఉంటుంది. అందుకే ఇలా వర్షం వస్తోంది. వెళ్ళి సాధువును కూడా మీతో రమ్మనండి. ఆయన వస్తేనే పడవను నడుపుతాను" అన్నాడు పడవవాడు.

ఆ భక్తులకు కోపం వచ్చింది. "నిన్న పొద్దుటి నుంచీ ఏమీ తినకుండా ఉన్నది తాము. తమ ముందే తాము ఇచ్చిన పండ్లు అన్నీ ఆరగించాడు సాధువు. అతడిని తమ కన్నా గొప్ప అంటున్నాడు ఈ పడవవాడు" అనుకున్నారు. 

కానీ చేసేదేమీ లేక సాధువును రమ్మన్నారు. ఆయన పడవలో కాలు పెట్టటంతోటే వాతావరణం మారిపోయింది. వర్షం ఆగిపోయి గాలి తగ్గిపోయింది. నది దాటి దర్శనం చేసుకుని తిరిగివస్తూ వారు ఇదే విషయాన్ని పడవవాడిని అడిగారు. 

"మీరు ఉపవాసం భగవద్ధ్యానంతో చేయటం లేదు. సమయమైపోగానే తినేందుకు ఎదురుచూస్తూ చేశారు. అంటే మీరు చేసింది. ఉపవాసం కాదు, తినటం కోసం ఎదురుచూస్తూ గడిపారు. అదే సాధువు ఉపవాసం ఉన్నట్టు నటించడు. తనకు అర్పించింది అవసరమైనంతే తింటాడు. మిగతాది పంచి పెడతాడు. ఆయన దృష్టి భగవంతుడి మీద తప్ప తిండి మీద లేదు" అని వివరించాడు. పడవ నడిపే వ్యక్తి.

ఉత్తమ ఆదర్శానికీ, ఉత్తుత్తి ఆదర్శానికీ మధ్య ఉండే తేడాను ఈ కథ స్పష్టం చేస్తుంది. అందుకే వ్యక్తికి ఉత్తమ ఆదర్శాన్ని బాల్యం నుంచే పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే మనం బాల్యం నుంచీ ఉత్తమ వ్యక్తుల జీవితాల గురించి పిల్లలకు కథలు చెప్తాం. ఉత్తమ ఆదర్శాన్ని వారి ముందు ఉంచుతాం. అయితే, ఆధునిక అభ్యుదయ భావాల తుఫాను ఈ పరిస్థితిని మార్చింది. 

పిల్లలకు బాల్యం నుండీ అందే ఆదర్శాల స్వరూపం మారింది. ప్రాచీన సాహిత్యంలోని కథలకు వర్గవర్ణాల రంగులు పులిమారు. కథలలో ప్రతీకాత్మకంగా అందించిన ఆదర్శాన్ని అర్ధం చేసుకోలేక, పాత అన్న ప్రతీదాన్నీ విమర్శించి పక్కకు నెట్టేయటం ప్రారంభించారు. కొందరైతే పాతవాటిలో వారిని వారు సమర్థించుకోవడం, చాదస్తాలు, మూఢ నమ్మకాలు తప్ప ఇంకేమీ ఉండదు వాటిలో అంటూ  భారతీయ ధర్మాన్ని, సంస్కృతిని, పద్ధతులను చులకన చేయటమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇటువంటి వారికి సమాజం వత్తాసు పలుకుతుంది. సహాయసహకారాలు సంపూర్ణంగా అందిస్తుంది. తమ ఇంటికి తామే స్వయంగా నిప్పు అంటించుకొనేవారిని శత్రువు వారిస్తాడా?

దాంతో మనకు ప్రాచీనమన్నదంతా పనికి రానిదైపోయింది. ఉత్తమ ఆదర్శాలు విలువ లేనివయ్యాయి. అందుకే నేటి కాలంలో యువకులకు, పిల్లలకు చాలా శాతం మందికి ఆదర్శాలు కానీ, విలువలు కానీ లేకుండా పోయాయి.

                                       ◆నిశ్శబ్ద.