Read more!

ఇంద్రుడిని మేష వృషణుడు అంటారెందుకు??

 

ఇంద్రుడిని మేష వృషణుడు అంటారెందుకు??


చాలామందికి గౌతమ మహర్షి గురించి, అహల్య శాపం గురించి కేవలం వాక్యాలలో తెలుసు. ఇంకా ఇంద్రుడిని మేష వృషణుడు అని అంటారని చాలామందికి తెలియదు. అహల్య శాపం వెనుక, ఇంద్రుడిని మేష వృషణుడు అని పిలవడం వెనుక కారణం ఉంది. 

గౌతమ దర్శనం కోసం ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవారు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు. అహల్య బ్రహ్మదేవుడి మానస పుత్రిక, అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన, ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో, గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు. 

అహల్యకి వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడని తెలుసు, కాని ఆమె గౌతముడికి భార్య కాకముందు ఆమెకి ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది. అందువలన ఇంద్రుడితో సంగమించింది. ఆ తరువాత  అహల్య ఇంద్రుడితో ఇలా చెప్పింది " నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను, కృతార్థురాలిని అయ్యాను, నువ్వు ఇక్కడినుండి తొందరగా వెళ్ళిపో. నిన్ను నువ్వు గౌతముడి నుండి రక్షించుకో" అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనందంపొందాను, ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటకి రాగానే  దేవతలని, దానవులని నిగ్రహించగలిగే, శాసించగలిగే అపారమైన తపఃశక్తి ఉన్న గౌతమ మహర్షి బయటకి వస్తున్న ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడి ముఖం మాడిపోయింది. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు నా రూపం ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండడానికి కారణం నువ్వు పురుషుడవన్న అహంకారం, కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు నేల జారి పడిపోవుగాక" అని ఇంద్రుడిని శపించాడు.

అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు "నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తూ పడుండు, ఆహరం తీసుకోకు, గాలిని భక్షించు. నీ మీద బూడిద కప్పబడుతుంది. కావున నువ్వు ఎవరికీ కనబడవు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు. ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే నీకు శాపవిమోచనం కలుగుతుంది. నీకు శాపవిమోచనం కలగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇంతలో ఇంద్రుడు దేవలోకములో దేవతలకి జరిగినదంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చెయ్యలేదు, గౌతమ మహర్షి తపఃశక్తి పెరిగిపోతుంది, ఆయనని నేను ఏమి చెయ్యలేను, అందుకనే అపచారం అహల్య పట్ల చేశాను. ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను, అహల్యని శపించడం వలన కొంత తపఃశక్తిని కోల్పోయారు. మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలని పోగొట్టుకున్నాను. కావున మీరే నాకు అండాలని తీసుకొని వచ్చి పెట్టాలి అన్నాడు. అప్పుడు వారు గొర్రె వృషణములను తీసుకొని వచ్చి ఇంద్రుడికి పెట్టారు. అలా పోగొట్టుకున్న పుంసత్వాన్ని ఇంద్రుడు పొందాడు. అప్పుడు ఆయనని మేష వృషణుడు అని పిలిచారు.

◆వెంకటేష్ పువ్వాడ.