Read more!

జ్ఞాని అయినట్టు ఎలా తెలుస్తుంది??

 

జ్ఞాని అయినట్టు ఎలా తెలుస్తుంది??

బహూనాం జన్మనామనే జ్ఞానవాన్మాం ప్రపద్యతే౹ వాసుదేవస్సర్వమితి స మహాత్మా సుదుర్లభః||

జ్ఞాని కావాలంటే ఒక జన్మ సరిపోదు. ఎన్నో జన్మల తరువాత కానీ జ్ఞాని కాలేడు. అటువంటి జ్ఞానికి ఈ ప్రపంచం అంతా వాసుదేవ మయం అవుతుంది. అటువంటి వాళ్లు ఉండటం చాలా దుర్లభం, అరుదుగా ఉంటారు.

మనం ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తి ఉంటాము. ఆ జన్మల పుణ్య ఫలితంగా మానవ జన్మ వచ్చింది. కాని ఎవరూ మరలా జన్మ లేకుండా ముక్తి కొరకు ప్రయత్నం చేయడం లేదు. మరోజన్మకోసం ఆరాటపడుతున్నారు. ఈ మానవులలో అతి కొద్ది మంది మాత్రమే ముక్తి కోరకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కోజన్మలో కొద్ది కొద్దిగా పుణ్యం సంపాదించుకుంటూ, పోగుచేసుకుంటూ, జ్ఞానం సంపాదించుకొని, ఈ వాసనలను పోగొట్టుకుంటూ తుదకు పరమాత్మకు తనకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటున్నారు. అప్పుడు సర్వం పరమాత్మ మయంగా కనిపిస్తుంది. కాబట్టి ఆత్మ జ్ఞానం రావడానికి ఎన్నోజన్మలు ఎత్తాలి. ఆయాజన్మలలో కొద్ది కొద్దిగా జ్ఞానం సంపాదించుకోవాలి. పురుష ప్రయత్నం (మగవాళ్ళు ప్రయత్నం చేయడం  కాదు, మనుషులు తమ ప్రయత్నం తాము చేయాలి అని అర్థం) చేయాలి సాధన చేయాలి. అప్పుడే ముక్తి వస్తుంది. అటువంటి వాళ్లు ఎక్కడో ఒక్కరు ఉంటారు. కాబట్టి అందరూ ప్రయత్నం చేయాలి. లక్షలో ఒకడికి వచ్చే లాటరీ టిక్కట్టు కొనంగా లేనిది, ముక్తికి ఎందుకు ప్రయత్నించకూడదు. ఆ ముక్తి మనకే వస్తుంది అని ఎందుకు అనుకోకూడదు.

ఇక్కడ ఒక చిన్న సందేహము వస్తుంది. అబ్బో ఎన్నో జన్మల తరువాత వచ్చే ముక్తి కోసరం ఇప్పటి నుండే ఎందుకు తాపత్రయపడటం దండగ అని చేతులు ముడుచుకొని కూచోకూడదు. ఎందుకంటే, ఎప్పుడో 21 ఏళ్ల తరువాత వచ్చే ఇంజనీరింగ్ డిగ్రీకి ఇప్పటి నుండే చదవడం ఎందుకు అని ఊరికే కూర్చోవడంలేదుగా! 5వ ఏటనుండి అఆలతో చదువు మొదలు పెడుతున్నాము కదా! ఇదీ అలాగే అనుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని జన్మలు గడిచిపోయాయో! ఏమో! ఇదే ఆఖరుజన్మేమో ఎవరు చూచారు. కాబట్టి ఇప్పుడే ప్రయత్నం మొదలెట్టాలి. సరే! ప్రయత్నం చేసాము. మరి మనకు జ్ఞానం వచ్చిందా లేదా అని ఎలా తెలిసేది అనే సందేహము. దానికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు భగవానుడు. అటువంటి జ్ఞానికి వాసుదేవస్సర్వమితి అంటే సర్వము వాసుదేవ మయంగా కనపడుతుంది. 

వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడు, కృష్ణుడు అని చాలామంది చెబుతారు. అది నిజమే. ఇక్కడ వాసుదేవుడు అంటే "వాసనాత్ వాసుదేవస్య వాసితం జగత్రయం, సకల భూత నివాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే" అంటే ఈ మూడు లోకములు అంతా నిండి ఉన్నవాడు, మూడులోకములలో నివసించేవాడు, సకల భూతములలో ఆత్మస్వరూపంగా ఉన్నవాడు అని అర్థం. ఈ భావన మనకు కలిగినపుడు మనం జ్ఞానులము అయినట్టు లెక్క. కాబట్టి రాగద్వేషములను, భేదభావములను వదిలిపెట్టి అందరిలో పరమాత్మను ఆత్మస్వరూపుడుగా చూడగలిగితే మనం కూడా క్వాలిఫై అయినట్టే, అది ఈ జన్మలోనే కావచ్చు.

 కాబట్టి అందరం పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుదాము. మొదట్లో భక్తుడు. దేవుడు గుడిలోనే ఉన్నాడు అని అనుకుంటాడు. తరువాత దేవుడు అంతటా ఉన్నాడనుకుంటాడు. తరువాత దేవుడు అందరిలో ఉన్నాడనుకుంటాడు. తరువాత దేవుడు తనలోనూ, అందరిలోనూ ఉన్నాడనుకుంటాడు. ఆఖరున నేనే బ్రహ్మను అని అనుకుంటాడు. అంతా బ్రహ్మమే అనే స్థితికి వస్తాడు. ఆ స్థితి మనకు ఇప్పుడే కలగవచ్చు. ఈ జన్మలోనే కలుగవచ్చు. మనకు ఎన్నోజన్మల తరువాత ఈ జ్ఞానం ఇప్పుడు ఈ జన్మలో కలుగుతుందేమో! అటువంటి వారిని మహాత్ముడు, జ్ఞాని అని అన్నాడు పరమాత్మ. ఈ స్థితికి రావడం చాలా కష్టము, దుర్లభము అయినా మనందరం ఈ జన్మలోనే మహాత్ములు, జ్ఞానులు కావడానికి ప్రయత్నం చేద్దాము.

◆వెంకటేష్ పువ్వాడ.