వినాయకుడి పొట్ట చుట్టూ పాము ఉండటం గమనించారా.. దీని వెనుక రహస్య కథ ఇదే..!
వినాయకుడి పొట్ట చుట్టూ పాము ఉండటం గమనించారా.. దీని వెనుక రహస్య కథ ఇదే..!
వినాయకచవితి సందర్భంలో వినాయక ప్రతిమలు కొంటూ ఉంటారు. అలాగే వినాయక చిత్రపటాలు కూడా ప్రతి ఇంట్లో ఉంటాయి. వీటిలో వినాయకుడికి పొట్టకు, చేతులకు, యజ్ఞోపవీతం స్థానంలో పాము ఉంటుంది. నిజానికి ఇది పాము అనడం కంటే ఆదిశేషుడు అనడం సరైనది. అసలు వినాయకుడి శరీరం మీద ఆదిశేషుడు ఉండటం ఏంటి అనే సందేహం చాలామందికి వస్తుంది. ఇది అర్థం కావాలి అంటే పురాణాలలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోవాలి. ఇది పరమేశ్వరుడికి సంబంధించిన సంఘటన. దీని గురించి తెలుసుకుంటే..
పరమేశ్వరుడు కైలాసంలో కొలువు తీరి ఉన్నప్పుడు మహర్షులు, ఋషులు , దేవతలు అందరూ వచ్చి పరమేశ్వరుడిని స్తుతిస్తూ ఆయనను నమస్కారం చేసుకుంటున్నారట. అయితే అప్పుడు ఆదిశేషుడు మాత్రం పరమేశ్వరుడి తలపైన సర్పరూపంలో ఉన్నాడు. దేవతలు అందరూ శివుడికి నమస్కరిస్తూ ఉంటే తాను మాత్రం పరమేశ్వరుడి తలపైన ఉన్నాను అనే ఆలోచనతో ఆదిశేషుడికి అహంకారం పెరిగింది. అందరూ శివుడి పాదాల దగ్గర ఉన్నారు, పరమేశ్వరుడికి నమస్కారాలు పెరుడుతున్నారు. కానీ నేను మాత్రం పరమేశ్వరుడి తలపైన ఉన్నాను. ఇది నా స్థాయి, నేను అందరికంటే గొప్ప అని మనసులో అనుకున్నాడు.
ఆదిశేషుడు మనసులో అనుకున్నా సరే.. పరమేశ్వరుడికి తెలిసిపోయింది. వెంటనే పరమేశ్వరుడు ఉగ్రుడు అయ్యాడు. ఆదిశేషుడిని తీసి కిందకు విసిరి కొట్టాడట. అలా కొట్టినప్పుడు ఆదిశేషుడి తలలో ప్రతి తల 10 ముక్కలు అయ్యాయట. వెంటనే ఆదిశేషుడు బాధపడి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లి తన తప్పు మన్నించమని వేడుకున్నాడట. ఆదిశేషుడు ఎంత వేడుకున్నా సరే.. పరమేశ్వరుడు ఆదిశేషుడికి స్థానం ఇవ్వలేదట. తనకు పట్టిన గతిని తలచుకుంటూ బాధపడుతూ వెళుతూ ఉంటే నారదుడు ఆదిశేషుడి దగ్గరకు వెళ్లి ఏమైందని అడిగాడట. నారదుడు అడగగానే ఆదిశేషుడు బాధతో జరిగిందందా ఏకరువు పెట్టాడట. అప్పుడు నారదుడు ఆదిశేషుడితో.. పర్లేదులే జరిగింది జరిగిపోయింది. తండ్రి ఆగ్రహించాడని ఊరికే ఉంటావా? ఆయన కొడుకు ఉన్నాడు కదా.. ఆయనను ఆశ్రయించు. వినాయకుడిని ఆశ్రయిస్తే ఆయనే తన తండ్రికి చెప్పి తిరిగి నీ స్థానం నీకు ఇప్పిస్తాడు అని సలహా ఇచ్చాడట. అంతేకాకుండా గణపతి షడక్షర మంత్రాన్ని కూడా ఆదిశేషుడికి ఉపదేశించాడట.
ఆదిశేషుడు గణపతి షడక్షర మంత్రాన్ని సుమారు వెయ్యి సంవత్సరాల పాటూ తీవ్రంగా జపం చేస్తూనే ఉన్నాడట. వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యాక గణేశుడు ఆదిశేషుడి ముందు ప్రత్యక్షం అయ్యి.. బాధపడకు నాయనా.. నీకు మా నాన్న గారి తలమీద ఉండే అవకాశాన్ని నేను ఇప్పిస్తాను అని చెప్పాడట. వినాయకుడు బాధ్యత తీసుకుని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లి పరమేశ్వరుడికి నచ్చజెప్పి తిరిగి ఆదిశేషుడికి పరమేశ్వరుడి తలమీద స్థానం ఇప్పించాడు. దీంతో ఆదిశేషుడు పరమానందం చెందాడట. వెంటనే గణపతితో స్వామి నువ్వు కూడా నన్ను ధరించు అని అడిగాడట. అప్పుడు వినాయకుడు నేను నిన్ను ధరించడానికి సమయం వస్తుందిలే అప్పటి వరకు వేచి ఉండు అని చెప్పాడట.
వినాయకుడు కడుపు నిండా కుడుములు, పిండి వంటలు తిని భుక్తాయాసంలో వస్తుంటే కింద పడిపోవడం, పొట్ట పగిలి కుడుములు బయటకు రావడం ఇవన్నీ వినాయకచవితి కథలో తెలుసుకునే ఉంటారు. ఇదంతా జరిగినప్పుడు బ్రహ్మ ఆదిశేషుడిని పిలిచి నువ్వు వినాయకుడి పొట్టకు చుట్టుకుని ఉండు, భుజానికి యజ్ఞోపవీతంలా ఉండు, ఇలా ఉండటం వల్ల వినాయకుడి పొట్టకు ఇంకొకసారి ఇలాంటి సమస్య రాదు అని అన్నాడట. అప్పటి నుండి ఆదిశేషుడు వినాయకుడి శరీరం మీద ఒక ఆభరణంలాగా మారిపోయాడు.
పూజించగానే వరాలు ఇచ్చే దైవమే కాదు.. మొదట సమస్యలు తీర్చి ఆ తరువాత ఇష్టకామ్యార్థాలు తీర్చేవాడు వినాయకుడు. అందుకే ప్రతి రోజూ వినాయకుడిని తప్పక ఆరాధించాలి. మరీ ముఖ్యంగా ప్రతి బుధవారం వినాయకుడి పూజకు, ఆరాధనకు ఎంతో శ్రేష్టం. కొడుకును మెప్పిస్తే తండ్రిని కూడా మెప్పించవచ్చు. వినాయకుడిని ఆరాధిస్తే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కూడా లభిస్తుంది.
*రూపశ్రీ.