Read more!

కృష్ణుడి అండ ఉన్నా పాండవులు కష్టాలు పడ్డారెందుకు!

 

కృష్ణుడి అండ ఉన్నా పాండవులు కష్టాలు పడ్డారెందుకు!


మహాభారతం చదివిన, తెలుసుకున్న అందరికీ పాండవులు మంచివారు అయినా అడవుల పాలయ్యారనీ, కష్టాలు పడ్డారని తెలుసు. అంతేనా..  ధర్మసంస్థాపనకై జన్మించిన ఆ శ్రీకృష్ణుడి అండదండలు ఆ పాండవులకు ఉన్నాయని తెలుసు. కానీ స్వయానా శ్రీకృష్ణుడి అభయం ఉన్న ఆ పాండవులు అన్నీ కష్టాలు ఎందుకు పడ్డారు?? అన్నేళ్లు అడవుల పాలయ్యారు ఎందుకు?? వంటి ప్రశ్నలు తెలెత్తుతాయి. ఈ సందేహాన్ని నివృత్తి చేసే విషేషణలోకి వెళితే..

ధర్మమే చివరికి గెలుస్తుందని మన వేద పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ధీరులైనవారు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకంజ వేయరు. జీవితంలో సుఖం కన్నా దుఃఖమే మనకు ఎక్కువ పాఠాలు నేర్పుతుంది. అందుకే కష్టాలు పడిన వారు ధైర్యంగాను, నిబ్బరంగాను. తెలివిగాను ప్రవర్తిస్తాడు. భగవంతుడు అందరికీ చెందిన వాడు. భగవంతుడి దృష్టిలో ఏ ఒక్కరూ వేరు కాదు.  అయినా అందరూ ఆయనలో లేరు. మనిషి సుఖంగా ఎలా జీవించాలి  అనే విషయమైనా.. ధర్మంగా ఉండేవాడు అయినా  వ్యసనాలకు లోనైతే ఆ దేవుడి అండ  ఉన్న  ఉన్నా కష్టాలు పడవలసిందేనని తెలుపుతుంది పాండవుల కథ. 

ధర్మరాజు అంతటి వాడు కూడా జూదం వల్ల సర్వం కోల్పోయి, అడవులకు వెళ్ళవలసి వచ్చింది. ఇక మనమెంత! ఈ విషయం తెలుసుకుని వ్యసనాలను వదిలిపెట్టాలి. వ్యసనాలతో సంపదలూ, సర్వం కోల్పోతున్నా వివేకజ్ఞానం లేక కష్టాలు పడతారు చాలా మంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. పాండవులు అడవుల పాలైనా, వారు ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. పైపెచ్చు అయిదు మంది విభేదాలు లేకుండా ఓకే మాట, ఓకే బాటగా జీవించారు. వారు ధర్మపరులు కనుక, చివరకు దైవ సహాయంతో అధర్మంపై గెలిచి, సుఖ సంతోషాలను పొందారు. కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నామన్నదే ముఖ్యం.

కష్టాలు కోతుల లాంటివి. వాటికి భయపడితే మనం సర్వనాశనమవుతాం. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి.. భారత, రామాయణాలు చదివిన ఎందరో విద్యావేత్తలు వాటిలో ఉన్న నీతిని,  విలువలను గ్రహించి వాటి నుండి మంచి గుణపాఠాన్ని  నేర్చుకుని, వారి జీవితపు నడకలో ఆచరించారు. అలాంటి వారే భారతదేశంలో గొప్ప వారిలా ఎదిగారు. 

 ఆత్మ విశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని, పాండవుల లాగ విజయం సాధించాలి. వేద, పురాణ, ఇతిహాసాల సారాంశాన్ని మన జీవితానికి అన్వయించుకొని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి. లేకపోతే నష్టపోయేది మనమే! "సత్యమేవ జయతే” - ఎన్నటికైనా 'సత్యమే' గెలుస్తుంది. అసత్యం, అబద్ధం, అధర్మం గెలవవు. ఎల్లప్పుడూ సత్యాన్ని అంటిపెట్టుకోవాల్సిందని శ్రీరామకృష్ణుల ఉవాచ. భగవద్ విశ్వాసంతో, శరణాగతితో మనం జీవితంలో విజయ సోపానాలను అధిరోహించాలి. అంతే కానీ పాండవులు కూడా తప్పులు చేశారు, మనం చేస్తే ఏమయ్యింది?? కృష్ణుడే పాండవులు, కౌరవులను వర్గాలుగా చీల్చి యుద్ధంలో ఒక పక్షాన నిలబడ్డాడు, మనం అలా చేస్తే ఏమయ్యింది?? ఇలాంటి నీతులు ఈ కాలంలో పనికిరావులే… లాంటి ప్రశ్నలు, సమర్థింపులు చేసుకుంటూ ఉంటే మనిషి సాధించే విలువలు ఏమీ ఉండవు. కోల్పోవడమే ఎక్కువ ఉంటుంది.

                                  *నిశ్శబ్ద.