Read more!

ఉగాదినాడు నువ్వుల నూనెతో స్నానం ఎందుకు

 

ఉగాదినాడు నువ్వుల నూనెతో స్నానం ఎందుకు?

 

ఉగాదినాడు చేయవలసిన కార్యక్రమాలలో అభ్యంగన స్నానాన్ని మొదటగా సూచించారు మన పెద్దలు. అది కూడా తైలాభ్యంగనం అన్నారు. అంటే నువ్వుల నూనెతో తలంటుకోవడం! ఇందుకోసం ఒంటి నిండా నువ్వుల నూనెను దట్టించి, శనగపిండితో స్నానం చేయాలి. దీని వల్ల ఒంటి మీద ఉన్న స్వేదరంధ్రాలన్నీ శుభ్రపడతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఉగాదినాడు చేసే ఈ అభ్యంగన స్నానం, మండు వేసవిలో వచ్చే చర్మరోగాలను నిలువరించి తీరుతుంది. స్వేదరంధ్రాలు మూసుకుపోవడం వల్ల వచ్చే చెమటపొక్కులు, మొటిమలు వంటి సమస్యలు దరిచేరవు.  ఇక ఇందుకోసం నువ్వుల నూనెను సూచించడం వెనుక కూడా ఓ కారణం ఉంది. మిగతా నూనెల కంటే నువ్వుల నూనెకి సాంద్రత ఎక్కువ. పైగా ఉష్ణాన్ని కలిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు! నువ్వుల నూనెలో విటమిన్ ఇ, కె చాలా అధికంగా ఉంటాయి. నువ్వుల నూనెలో దాదాపు 13 శాతం విటమిన్‌ కె ఉంటుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. అలాంటి నువ్వుల నూనెని ఒంటికి పట్టించడం వల్ల, చర్మం నిగనిగలాడుతుంది. వెంట్రుకలకి తగిన పోషణనిస్తుంది. వాత, కఫ దోషాలను పరిహరిస్తుంది. అందుకే కనీసం పదిహేను రోజులకు ఒకసారైనా తైలాభ్యంగన స్నానం చేయాలని పెద్దలు చెప్పారు. అది మనం ఎలాగూ ఆచరించం కాబట్టి పండుగ రోజుల్లో అయినా ఈ ఆచారాన్ని కొనసాగించమన్నారు. పండుగల నాడైనా ఇది పాటించేవారు కరువైపోతారు కాబట్టి... నరకచతుర్దశి, ఉగాది రోజుల్లో అయినా తైలాభ్యంగనం చేయమని సూచించారు. ఉగాది అంటే తెలుగువాడి సంవత్సరాది. సంవత్సరంలోని మొదటి రోజైనా ఈ ఆచారాన్ని పాటిస్తే శుభారంభంగా నిలుస్తుందని చెప్పాలా! అందుకే ఉగాదినాడు అభ్యంగనం చేయనివాడు నరకానికి పోతాడని హెచ్చరిస్తున్నారు పెద్దలు. అనారోగ్యాన్నీ, అపరిశుభ్రతనూ మించిన నరకం ఏముంటుంది!