Read more!

ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎందుకు

 

ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎందుకు?

 

 

ఉగాది అనగానే మనసులో మెదిలేది... ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలోని షడ్రుచులూ జీవితంలోని సుఖదుఖాలకు సంకేతం అని ఒక మాట ఉన్నప్పటికీ ఇందులో ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి లేకపోలేవు. ఉగాది పచ్చడిని తినడాన్ని ‘నింబకుసుమ భక్షణం’ అంటారు. అంటే వేపపూతను తినడం అన్న అర్థం వస్తుంది. వేపకు ఆయుర్వేదంలో ఉన్న ప్రాధాన్యత ఎవరికీ తెలియంది కాదు. సూక్షనాశనిగా, క్రమిసంహారినిగా... చుట్టుపక్కల ఉన్న గాలిని సైతం శుద్ధి చేసేదిగా వేప గుణం తెలియని వారుండరు. అయితే ఉగాదినాడు వేప ఆకుకు బదులుగా పువ్వుని వాడటంలో ఒక ఆంతర్యం ఉంది. వేప పూత వచ్చే వసంతం నాటికే ఉగాది వస్తుంది. ఆ కాలం దాటిపోతే వేప పువ్వుని తినే అవకాశం ఉండదు. వేప పూతలో చేదు, పరిమళం, రంగు... అన్నీ ఇమిడి ఉంటాయి. పైగా పిల్లలకు సైతం త్వరగా జీర్ణమవుతుంది. అందుకే ఈ పూతను సద్వినియోగం చేసుకునేందుకు ఉగాది పచ్చడిలో దాన్ని చేర్చి ఉంటారు పెద్దలు. ఇక ఎండలు ముదిరి వాతావరణం ఒక్కసారిగా మారే సమయంలో ఆటలమ్మ, పొంగు, కామెర్లు వంటి ఆంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ వ్యాధులన్నీ కూడా వైరస్‌ వల్ల వ్యాపించేవే. శరీరంలో రోగనిరోధక శక్తి ఏమాత్రం తక్కువగా ఉన్నా, ఇవి మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. ఆ రోగనిరోధక శక్తిని వేపపూత మనకు కల్పిస్తుంది. ఒకరకంగా ఈ నింబకుసుమభక్షణం వైరస్‌ను ఎదుర్కొనే టీకాలా పనిచేస్తుందన్నమాట!