పరమాత్మను చేరుకోవడానికి నివృత్తి మార్గం!!

 

పరమాత్మను చేరుకోవడానికి నివృత్తి మార్గం!!

 


మచ్చితస్సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి 

అథ చేత్వమహఙ్కారాన్న శ్రోష్యసి వినంక్ష సి||


చిత్తమును నా యందు (ఆత్మయందు) ఉంచితే, నా అనుగ్రహము చేత, సంసారములో ఉన్న సమస్తదుఃఖములను దాటి, సన్నే పొందగలవు. లేకపోతే నీవు నీ అహంకారము వదలకపోతే, అనవసరంగా చెడిపోతావు అంటాడు పరమాత్మ.


ఈ శ్లోకంలో రెండు మార్గాలు సూచించాడు పరమాత్మ. ఒకటి ప్రవృత్తి మార్గము. రెండవది నివృత్తి మార్గము. నివృత్తి మార్గమును ముందు సూచించాడు. ప్రవృత్తి మార్గము దాటి నివృత్తి మార్గములోని ప్రవేశించాలి. దానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. అందుకని ఇక్కడ సర్వదుర్గాణి అనేపదం వాడారు. దుర్గములు అంటే దాటడానికి చాలా కష్టమైనవి. ఎన్నో అడ్డంకులు ఉంటాయి. కందకములు(నీటితో నిండిన గోతులు) వాటిలో మొసళ్లు, దుర్గము(కోట) పైన ఫిరంగులు, సైనికులు. అలాగే ఈ సంసారము, బంధనములు, కోరికలు, అనుబంధాలు, ఇవన్నీ దాటడానికి కష్టమైన దుర్గములు అని భావన. మరి ఈ సంసారము అనే దుర్గములను దాటాలంటే ఒకే ఒక మార్గము మనస్సును అంటే చిత్తమును ఆత్మలో నిలపడం. అప్పుడు పరమాత్మ అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. అప్పుడు ఈ సంసారము అనే దుర్గములను దాటడానికి వీలవుతుంది.


అలా కాకుండా కేవలం ప్రవృత్తి మార్గంలోనే ఉంటే ఏమవుతుందంటే…….  మనుషులకు అహంకారము సహజంగా ఉంటుంది. అది సాత్విక, రాజసిక, తామసిక అహంకారాల రూపంలో ఉంటుంది. (వీటినే సత్వ, రజో, తమో గుణాలని ఆ గుణాల ప్రభావాన్ని బట్టి మనుషులను కూడా అలాగే విభజిస్తారు) ఆ అహంకారం కళ్లను కప్పేస్తుంది. నిజం తెలుసుకోలేదు. అప్పుడు ఈ మాటలు తలకెక్కవు. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అటువంటి వారు విసంక్ష్యసి అంటే చెడిపోతారు. వారిని ఎవరూ బాగుపరచలేరు.


ప్రతి వాడూ తనకు ఎప్పుడూ సుఖాలు కావాలనే కోరుకుంటాడు. దుఃఖాలు అస్సలు రాకూడదు అనుకుంటాడు. కాని దానికి కావలసిన సాధన మాత్రం చెయ్యడు. కష్టాలలో పడతాడు. ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలంటే చేయాల్సింది ఒక్కటే. మన మనస్సును ఈ ప్రాపంచిక విషయాలనుండి మరల్చి పరమాత్మవైపు మళ్లించడం, ఆత్మలో నిలపడం, అటువంటి వారి మీద భగవంతుని అనుగ్రహం దానంతట అదే కలుగుతుంది. అటువంటి వాడికి దుఃఖమే ఉండదు. ఇది ఎలా జరుగుతుంది అంటే సంసారము అనే దుర్గమును దాటడం వలన, మామూలు దుర్గాలు అయితే సైన్యాలతో జయించ వచ్చు. సంసారము అనే దుర్గము మాత్రం పరమాత్మ . అనుగ్రహం లేనిది ఛేదించలేము.


కురుక్షేత్ర యుద్ధంలో కూడా కృష్ణుని అనుగ్రహంతోనే అర్జునుడు అందరినీ జయించి విజయుడు అయ్యాడు. సుందర కాండలో కూడా ఆంజనేయస్వామి, ఎంత వెతికినా సీత కనపడక, నిరాశ చెంది, అశోక వనం ఎదురుగా కూర్చుని, ఇంక నావల్లకాదు, ఆత్మహత్యేశరణ్యము అని తలచుకుంటూ, తన మనస్సు రాముని యందు నిలిపితే, అప్పుడు ఎదురుగా ఉన్న అశోక వనం అందులో ఉన్న సీత కనబడింది. కాబట్టి ఎంతటి వారికైనా, ఈ సంసారము అనే దుర్గము నుండి అందులో అనుక్షణం ఎదురయ్యే ఎదురు దెబ్బల నుండి బయట పడాలంటే పరమాత్మ అనుగ్రహం కావాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలిసినా నమ్మరు. పట్టించుకోరు. దానికి కారణం వారిలో ఉన్న అహంకారము. ధనమదము, అధికార గర్వము. అటువంటి వారు తుదకు కష్టముల పాలై చెడిపోతారు. ఎప్పుడూ ప్రవృత్తి మార్గంలోనే ఉంటూ, నివృత్తి మార్గం మరిచిపోతారు. 


కాబట్టి మనుషులు నివృత్తి మార్గం చేరుకుంటేనే జీవితంలో పరమాత్మ కృపకు పాత్రులవ్వగలుగుతారు.


◆ వెంకటేష్ పువ్వాడ.