Read more!

వానరసైన్యం సంఖ్య ఎంతో తెలుసా?

 

వానరసైన్యం సంఖ్య ఎంతో తెలుసా?


కిష్కింధలో లక్ష్మణుడితో మాట్లాడిన తరువాత సుగ్రీవుడు లక్ష్మణుడిని తీసుకుని రాముడు ఉంటున్న గుహ దగ్గరకు వెళ్ళాడు.

రాముడు సుగ్రీవుడితో "సుగ్రీవా!! అసలు సీత ఇంకా బతికే ఉందా లేదా?? ఒకవేళ బతికే ఉంటే ఎక్కడ ఉంది అని విషయాన్ని మొదట తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే నాలుగు దిక్కులకు మాత్రమే కాకుండా నాలుగు మూలలకు కూడా వానరాలను పంపి వెతికించాలి" అని అన్నాడు.

"రామా!! నేను పదిరోజుల కిందటే హనుమంతుడి సలహా మీద ఎక్కడెక్కడో ఉన్న వానరాలను ఇక్కడికి రావాల్సిందిగా రాజుగా ఆజ్ఞ పంపాను. పదిరోజుల లోపు నాదగ్గరకు చేరకుంటే ఆ వానరాలకు చావే గతి అని హెచ్చరించి మరి పంపాను. కాబట్టి అవన్నీ దారిలో వస్తూనే ఉంటాయి. అవి మాత్రమే కాకుండా నా దగ్గర ఉన్న వానరాలను సీతమ్మ జాడ కోసం ఎప్పుడో రంగంలోకి దింపాను. నేను నీ మేలు మరచిపోయి సీతమ్మ విషయం పట్టించుకోలేదనే మాట నిజం కాదు" అని చెప్పాడు.

"నువ్వు చాలా గొప్ప స్నేహితుడివి సుగ్రీవా!! కానీ సీత ఎక్కడుందో అనే బాధ వల్ల నా మనసు నిలకడగా లేదు. నువ్వు వర్షాకాలం ముగిసినా నన్ను కలవలేదు. అందుకే నాకు దుఃఖం కలిగింది" అని సుగ్రీవుడితో  చెప్పాడు రాముడు.

అప్పుడే అక్కడికి కోట్ల కొద్దీ వానరాలు వచ్చాయి. ఒక్కసారిగా అన్ని వానరాలు రావడంతో ఆ ప్రాంతం అంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది, ఆ వానరాలు కొన్ని పరస్పరం మాట్లాడుకుంటున్నాయి. మరికొన్ని ఆసక్తిగా ఏమి జరుగుతుందా అని చూస్తున్నాయి. ఆ వానరాలను అక్కడి తీసుకొచ్చిన నాయక వానరాలు సుగ్రీవుడికి నమస్కారం చేస్తున్నాయి.

"ఏ ప్రాంతం నుండి ఎవరు ఎన్ని వానరాలను తీసుకొచ్చారు వివరంగా చెప్పండి" అన్నాడు సుగ్రీవుడు.

"సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల వానరాలు వచ్చాయి, శతబలి అనే వానరుడు 10 వేల కోట్ల వానరములతో వచ్చాడు. సుషేణుడు లెక్కపెట్టలేనన్ని వానరాలతో వచ్చాడు. రుమ తండ్రి కొన్ని వేల కోట్ల వానరాలతో వచ్చాడు. హనుమంతుడి తండ్రి అయిన కేసరి కొన్ని వేల కోట్ల వానరములతో వచ్చాడు. గవాక్షుడు 1000 కోట్ల కొండముచ్చులతో వచ్చాడు. ధూమ్రుడు 2000 కోట్ల భల్లూకములతో వచ్చాడు, పనసుడు మూడు కోట్ల వానరాలతో వచ్చాడు, నీలుడు పది కోట్ల నల్లటి దేహం కలిగిన వానరాలతో వచ్చాడు, గవయుడు అయిదు కోట్ల వానరాలతో వచ్చాడు, దరీముఖుడు 1000 కోట్ల వానరాలతో వచ్చాడు, మైంద ద్వివిదులు అశ్విని దేవతల్లా 1000 కోట్ల వానరాలని తెచ్చారు, గజుడు 3 కోట్ల వానరాలని తెచ్చాడు, జాంబవంతుడు 10 కోట్ల భల్లూకాలని తెచ్చాడు. రుమణుడు 100 కోట్ల వానరాలని తెచ్చాడు, గంధమాదనుడు 10 వేల కోట్ల వాసరములతో వచ్చాడు, ఆయన వెనకాల లక్ష కోట్ల వానరాలు వస్తున్నాయి, అంగదుడు 1000 పద్మ వానరాలని, 100 శంకు వానరాలని తీసుకొచ్చాడు, తారుడు 5 కోట్ల వానరాలని తీసుకొచ్చాడు, ఇంద్రజానువు 11 కోట్ల వానరాలని తెచ్చాడు, రంభుడు 1100 ఆయుత వానరాలని తెచ్చాడు. దుర్ముఖుడు 2 కోట్ల వానరాలని తెచ్చాడు, హనుమంతుడు కైలాశ శిఖరాల్లా ఎత్తుగావున్న 1000 కోట్ల వానరాలని తెచ్చాడు, నలుడు 100 కోట్ల 1000 మంది వానరాలతో వచ్చాడు, దధిముఖుడు 10 కోట్ల వానరాలతో వచ్చాడు. 

10,000 కోట్లయితే ఒక ఆయుతం,

 లక్ష కోట్లయితే ఒక సంకువు, 

1000 సంకువులయితే ఒక అద్భుదం, 

10 అద్భుదములయితే ఒక మధ్యం, 

10 మధ్యములయితే ఒక అంత్యం,

 20 అంత్యములయితే ఒక సముద్రం, 

30 సముద్రములయితే ఒక పరార్థం, 

అలాంటి పరార్థాలు కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ" అని అన్నారు ఆ వానర నాయకులు.

◆వెంకటేష్ పువ్వాడ.