Read more!

తూర్పు దిక్కు గురించి సుగ్రీవుడి అద్భుత వర్ణన!

 

తూర్పు దిక్కు గురించి సుగ్రీవుడి అద్భుత వర్ణన!


సుగ్రీవుడు వినతుడు అనే వానరాన్ని పిలిచి వినతా! నువ్వు లక్షమంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకి వెళ్ళు. నీకు నెల రోజుల సమయం ఇస్తున్నాను. నెల రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. మీరు ఇక్కడినుండి తూర్పు దిక్కుకి బయలుదేరి గంగ, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులని, వాటి తీరములలో ఉన్న ప్రాంతాలని అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశి, కోసల, మాగధ, పుఱ్ఱ, అంగ దేశములలో ఉండే పట్టణాలని, జనపదాలని వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ వెతకండి. 

సముద్రాలలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద  గ్రామాలలో కొందరు ప్రజలు నివసిస్తు ఉంటారు, అక్కడ కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకూ వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుట్టు చెవుల వరకూ పడి ఉంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైన నరభక్షకులు, వారు నీళ్ళల్లో ఉంటారు. మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి. అలా కొంతదూరం వెళితే యవద్వీపం కనపడుతుంది, అది రత్నములతో నిండి ఉంటుంది, మీరు అక్కడ వెతకండి. తరువాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము ఉంటాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనటువంటివి. అది దాటితే శిశిరం అనే పర్వతం కనపడుతుంది, ఆ పర్వతం అంతా వెతకండి.

కొంతదూరం వెళ్ళాక శోణానది కనపడుతుంది. ఆ నది చాలా లోతుగా, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశంలో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తరువాత ఇక్షు సముద్రం వస్తుంది. అందులో మహాకాయులైన అసురులు ఉంటారు. వారు ఆకలిని తీర్చుకోడానికి ప్రాణుల నీడని పట్టి బక్షిస్తుంటారు. అది దాటాక లోహితము అనే మధు సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి, అందుకని ఆ ద్వీపాన్ని శాల్మలీ ద్వీపం అంటారు. అక్కడున్న గిరి శిఖరాలకి మందేహులు అనే రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వారు సూర్యుడు ఉదయించే సమయంలో, సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రహించే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే, ఆ జలముల యొక్క శక్తి చేత, సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రంలో పడిపోతుంటారు. అప్పుడు వారు మళ్ళి లేచి ఆ పర్వతానికి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆ సముద్రము మధ్యలో ఋషభము అనే పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరుగల గొప్ప సరోవరం వెండి కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని దాటితే క్షీర సముద్రం వస్తుంది, దానిని కూడా దాటితే మధుర జలములు కలిగిన మహా సముద్రం వస్తుంది. అందులో ఔర్వుడు అనే మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది, దానికి హయముఖము అని పేరు.

దానిని దాటి ముందుకి ఒక 13 యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతం కనపడుతుంది. దానికి జాతరూప శిలము అని పేరు. దానిమీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు. ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉంది. దాని పక్కనే ఒక వేదిక ఉంది, దానిని దేవతలు నిర్మించారు. మీరు ఆ ఆదిశేషుడిని దర్శించి ముందుకి వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతం 100 యోజనముల వరకూ విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే సౌమనసం అనే ధృడమైన బంగారు శిఖరము ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణ ప్రసారం ప్రారంభమవుతుంది. అది దాటి వెళితే కటిక చీకటి. ఇక్కడిదాక అంగుళం విడిచిపెట్టకుండా సీతమ్మ జాడ వెతకండి. కాబట్టి తూర్పు దిక్కుకి వెళ్ళే వానరాలు సిద్ధం కండి" అన్నాడు.

◆వెంకటేష్ పువ్వాడ.