Read more!

మనసును అర్థం చేసుకునే ప్రక్రియ ఏమిటి?

 

మనసును అర్థం చేసుకునే ప్రక్రియ ఏమిటి?

మనను మనం అర్థం చేసుకునే ప్రక్రియను ఎక్కడ ప్రారంభించాలో తెలుసా.. మనిషి తనను గురించి తాను ఇలా ఆలోచించాలని జిడ్డు కృష్ణమూర్తి చెబుతారు. 

నేను ఇక్కడ వున్నాను నన్ను నేను చదవడం ఎలా? గమనించడం ఎలా?? నా అంతరంగంలో ఏం జరుగుతుందో చూడడం ఎలా? సంబంధ బాంధవ్యాల సరణిలోనే నేను నన్ను గమనించగలుగుతాను ఎందుకంటే, జీవితమంతా ఈ  సంబంధాల సరాగమే. ఏదో ఒకమూల కూర్చుని నన్ను గురించి నేను ధ్యానం చేసుకుంటే ప్రయోజనం లేదు. నా అంతట నేను బ్రతకలేను కదా? చుట్టూవున్న మనుషులతో సంబంధించి, వస్తువులతో అభిప్రాయాలతో సమన్వయం అయి బ్రతుకుతుంటాను నేను. బయటి వస్తువులు, మనుషులు, ఆంతరిక విషయాలు వీటన్నిటితో సంబంధించి నా ఉనికిని గమనించగలిగితే అప్పుడే నన్ను నేను అర్ధం చేసుకున్నట్లు. మరి ఏ ఇతర అవగాహన అయినా కేవలం ఊహాగానం, నన్ను అలా చదువుకోలేను. నేనేదో నైరూప్యమయిన విషయాన్ని కాదు, నేను నా వాస్తవ అస్తిత్వాన్ని చదువుకోగలగాలి, గమనించగలగాలి నేను ఉన్నట్లుగానే, అంతేగాని నేను  ఉందామనుకున్నట్లుగా కాదు అని.

అవగాహన అనేది మేధా ప్రక్రియ కాదు. మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవడం, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ఈ రెండూ వేరువేరు విషయాలు. మిమ్మల్ని గురించి మీరు పోగుచేసుకున్న విషయాలన్నీ గతానికి సంబంధించినవి, గతంతో బరువుగా సాగుతున్న మనసు దుఃఖభరితమయిన మనసు. మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవడం ఏదో ఒక భాష నేర్చుకోవడం, శాస్త్రవిజ్ఞానం నేర్చుకోవడంలో మీరు పోగుచేసుకోవలసిన విషయాలు, గుర్తుంచుకోవలసినవీ ఎక్కువ వుంటాయి. అంతా పునఃప్రారంభం చేయడం అసంబద్ధ విషయం.

 మానసిక క్షేత్రంలో మటుకు మిమ్మల్ని గురించి మీరు నేర్చుకోవడం అనేది ఎప్పుడూ వర్తమానంలోనే వుంటుంది. జ్ఞాన సంచయం గతానికి సంబంధించినది. మనలో చాలమందిమి గతంలోనే జీవిస్తాము కనుక, అటువంటి జీవనంతోనే తృప్తి పడుతూ వుంటాము. కనుక జ్ఞానం మనకు చాలా ప్రధాన విషయంగా తయారయింది. అందుచేతనే మనం పండితులను, తెలివిగలవారిని, మోసగాళ్ళను గౌరవిస్తూ వుంటాము. మీరు ప్రతి క్షణమూ గమనం ద్వారా, వినడం ద్వారా నేర్చుకుంటున్నట్లు అయితే, చూడడం, చేయడం ద్వారా నేర్చుకుంటూ వుంటే అప్పుడు తెలిసి వస్తుంది. నేర్చుకోవడం అనేది నిరంతర చలనము అనీ, దానికి గతంతో ఏమీ ప్రమేయం లేదనీని,

మిమ్మల్ని గురించి మీరు క్రమక్రమంగా నేర్చుకుంటాను. చిన్నచిన్నగా అనేక విషయాలు జత చేసుకుంటాను - అంటే, మీరు ఇప్పుడు వున్నట్లుగా మిమ్మల్ని అధ్యయనం చేయడం లేదన్నమాట. పోగుచేసుకున్న జ్ఞానం ద్వారానే పరిశీలించుకుంటున్నారు. నేర్చుకోవటానికి మహత్తరమయిన సునిశితత్వం వుండాలి. గతానికి సంబంధించిన ఏదో అభిప్రాయానికి ముడి వేసుకుని వున్నప్పుడు, అది వర్తమానాన్ని ముంచెత్తి వేస్తున్నప్పుడు,  సునిశితత్వం సాధ్యంకాదు. అప్పుడు మనసు వాడిగా, పదునుగా, జాగరూకంగా వుండదు. మనలో చాలా మంది కనీసం భౌతికంగా అయినా సునిశితులం కాదు. మనం అతిగా తింటాం. యుక్తాహారం అంటే యేమిటో మనకు గమనంలేదు, అతిగా పొగపీలుస్తాం, తాగుతాం. అందువల్ల మన శరీరాలు మొద్దుబారిపోయి, సునిశితత్వాన్ని కోల్పోతాయి. శరీరతత్వంలో చురుకుతనం, జాగరూకత అనేదే లేకుండా పోతుంది. శరీరం ఇలా తయారయితే మరి మనసు జాగరూకంగా, సునిశితంగా, స్పష్టంగా ఎలా వుండగలుగుతుంది? 

మనకేదో వ్యక్తిగత కాంక్షవున్న కొన్ని విషయాల పట్ల సునిశితత్వం వుండవచ్చు. కాని జీవితానికి సంబంధించిన అన్ని విషయాలపట్ల సమున్నతంగా పరిపూర్ణంగా సునిశితత్వం వుండాలంటే శరీరానికి మనసుకు విభాగం పనికిరాదు, అవి కలిసికట్టుగానే ముందుకు వెళ్ళాలి.

ఇదీ జిడ్డు కృష్ణమూర్తి తన మాటల్లో చెప్పిన మహత్తరమైన సారాంశం.

                                        ◆నిశ్శబ్ద.