Read more!

మనస్సు నాలుగు విభాగాల గురించి తెలుసా?

 

మనస్సు నాలుగు విభాగాల గురించి తెలుసా?

మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర పోషించేది మనసు. ఈ మనస్సుకు నాలుగు మౌలిక చర్యలు ఉన్నాయి. వీటిని ఉదాహరణతో వివరించవచ్చు. దాదాపు పది సంవత్సరాల క్రితం కలుసుకొన్న ఒక వ్యక్తిని మళ్ళీ కలుసుకొన్నామనుకోండి. ఆ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ కలుసుకొన్నామో, అతడు ఎవరో జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నిస్తాము. ఈ సదరు వ్యక్తికి సంబంధించిన ఏవైనా సంఘటనలు మన అంతరాంతరాలలో చోటుచేసుకొని ఉన్నాయేమో అని అవలోకించడం జరుగుతుంది.. హఠాత్తుగా ఆ వ్యక్తి ఫలానా అని గుర్తుకు వస్తుంది. 'నేను ఫలానా చోటు కలుసుకొన్న ఫలానా వ్యక్తే ఇతడు' అని తెలియ వస్తుంది.

పై ఉదాహరణను విశ్లేషించి మనస్సు నాలుగు విభాగాలను మనం గ్రహించవచ్చు

జ్ఞాపకశక్తి : 

గత అనుభవాల జ్ఞాపకాలు, అనుభూతులు మనస్సు ముందు వివిధ సంభావ్యతలను  ఆవిష్కరిస్తాయి. ఈ జ్ఞాపకాల అనుభూతుల సమూహమే 'చిత్తం' అనబడుతుంది. ఈ చిత్తంలోనే మన మంచిచెడు ఆలోచనల, పనుల ఫలితంగా ఏర్పడిన సంస్కారాలు నెలకొని ఉంటాయి. ఈ సంస్కారాలే మన స్వభాన్ని లేదా నడవడికను నిర్ణయిస్తాయి. ఈ చిత్తమే మళ్లీ మన సుప్తచేతనావస్థగా పేర్కోబడుతున్నది. జ్ఞాపకశక్తి మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

చర్చోపచర్చలు, భావనారూపకల్పన : 

ఇదమిత్థం కాని స్థితిలో తన ముందు  ఆవిష్కృతమైన వివిధ సంభావ్యతలను మనస్సు పరీక్షిస్తుంది. అది అనేక విషయాలపై పర్యాలోచన చేస్తుంది. మనస్సు యొక్క ఈ సమర్థతను 'మనస్' అని పేర్కొంటారు. ఊహించడం, రూపకల్పనలు కూడ ఈ మనస్ వ్యాపారాలే.

దృఢ నిశ్చయం - నిర్ణయం : నిర్ణయం చేసే సామర్థ్యం బుద్ధికి ఉంది. ఏది వాంఛనీయమో దాన్ని బుద్ధి నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తిలోని 'విచక్షణాశక్తి' కూడ అదే. వాస్తవికత, అవాస్తవికతల మధ్య, చేయదగిన, చేయదగని పనుల మధ్య, నైతికంగా తప్పు, ఒప్పుల మధ్యగల విచక్షతను అది తెలుపుతుంది. వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమైన 'సంకల్పశక్తి' కి ఆధారం కూడ బుద్ధే కనుక ఇది మనకెంతో ప్రధానమైనది.

 'అహం' భావం : 

నేను తింటాను, నేను చూస్తాను, నేను మాట్లాడతాను, నేను వింటాను, నేను ఆలోచిస్తాను, నేను గందరగోళ స్థితిలో ఉన్నాను  ఇత్యాది భౌతిక, మానసిక కార్యరంగాలలో తనను ఉద్దేశించుకొంటూ ప్రయోగించిన 'నేను' ను 'అహంకారం' అని అంటారు. సుశిక్షితం కాని మనోదేహాలతో ఈ 'అహం' ఎంత వరకు తాదాత్మ్యం చెంది ఉంటుందో, అంతవరకు ప్రపంచంలో జరిగే సంఘటనల, పరిస్థితుల చెప్పుచేతల క్రింద మానవ జీవితం ఉంటుంది. అంతేగాక ప్రీతికరమైన సంఘటనలతో ఆనందం పొందుతూ, ప్రతికూలమైన వాటితో దుఃఖపూరితం అవుతుంటుంది. 

మనస్సు నిర్మలం, సుశిక్షితం అయ్యేకొద్దీ మనిషి అహంకారం యొక్క నిజమైన మూలం తెలుసుకోగలుగుతాడు. తదనుగుణంగా అతడు దైనందిన జీవితంలో సమతౌల్యతను సంతరించుకో గలుగుతాడు. ఆపై అటువంటి వ్యక్తి ఏవిధమైన సంఘటనల, పరిస్థితుల ప్రభావానికి కూడా లోనుకాడు. మనస్, బుద్ధి, చిత్తం, అహంకారం అనే మనస్సు యొక్క నాలుగు విభాగాలు భిన్నంగా అనిపిస్తున్నప్పటికి, అవి వేరు వేరు కావు. అవి నిర్వర్తించే కార్యకలాపాల మేరకు విభిన్న పేర్లతో అదే మనస్సు పేర్కొనబడుతుంది.

                                       ◆నిశ్శబ్ద.