Read more!

విశ్వాసపాత్రుల అవసరం ఎంత?

 

విశ్వాసపాత్రుల అవసరం ఎంత?

మన పురాణాల్లో 'నారదుడి' పాత్ర ఎంతో గొప్పది. నారాయణ నామభజన చేస్తూ, సకల లోకాలు తిరుగుతూ, అటు వార్తలు ఇటు, ఇటు వార్తలు అటు 'లోకకల్యాణం' కోసం చేరవేస్తుంటాడు నారదుడు. ఈ పాత్ర ద్వారా మన పూర్వికులు వార్తాహరులకు ఉండవలసిన లక్షణాలను, ఉత్తమవ్యక్తిత్వాన్ని అత్యంత ప్రతిభావంతంగా లోకానికి చాటి చెప్పారు. నారదుడు సైతం ఒకరి చెవిని కొరికి, మరొకరి మరణానికి కారకుడైనా, 'దుష్టసర్పం' కాదు. నారదుడు దేవర్షి నారదుడు బ్రహ్మచారి. రాగద్వేషరహితుడు. సకల మానవాళి శాంతిసౌఖ్య కాముకుడు. అటువంటి వ్యక్తి అక్కడి మాటలు ఇటు, ఇక్కడి మాటలు అటు చేరవేసినా అందువల్ల సమాజానికి మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. కానీ మాటలు చేరవేసేవారంతా 'నారదమహర్షి' అంతటివారు కాలేరు. అందువల్లనే సమస్యలు ఉత్పన్నమౌతాయి.

'కాః కథానగరే భద్ర వర్తనే విషయేషు చ

రాముడి చుట్టూ, నగరం నుంచి పలురకాల కథలు, సమాచారవిశేషాలను సేకరించి వచ్చిన విజయ, మధుమత్త, కాశ్యప, మహిళ, కుల, సురాజి, కాలియ, భద్ర, దంతవక్త్ర, సుమాగాథ వంటివారు కూర్చున్నారు. రకరకాల కథలను వినిపిస్తున్నారు. తాము సేకరించిన వార్తా, విశేషాలను రాముడికి నివేదిస్తున్నారు. అవి వింటూ రాముడు, భద్రుడనే వ్యక్తిని ఈ ప్రశ్న అడిగాడు. 'నగరంలో ప్రజలు ఏ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు? వారి అభిప్రాయాలేంటి? వారు నా గురించి, సీత గురించి, నా పాలన గురించి, నా సోదరులు గురించి ఏమనుకుంటున్నారు?' అని అడుగుతూ చివర్లో 'వక్తవ్యతాం చ రాజానో వనే రాజ్యే ప్రజని చ' అంటాడు. 'రాజుల గురించి రాజుల పాలన గురించి, సరైన విమర్శ అడవుల్లో, ప్రజల నడుమనే లభిస్తుంది' అని వ్యాఖ్యానిస్తాడు.

తరువాత జరిగిన కథ పక్కన పెడితే 'ఉత్తరరామాయణం'లోని అతికీలకమైన ఈ ఘట్టం గొప్ప మేనేజ్మెంట్ సూత్రాన్ని పరిచయం చేస్తుంది. వ్యక్తి ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒంటరి వాడవుతాడు. భూమికి అంత దూరం అవుతాడు. అతడి దృష్టి మామూలు కన్నా ఎక్కువ దూరం ప్రసరించినా, అతడి దృష్టికి చిన్న చిన్న విషయాలు ఆనవు. కానీ ఉపేక్షిస్తే చిన్న చిన్న విషయాలే, తరువాతి కాలంలో ప్రమాదకరం అవుతాయి. ఒక వ్యక్తి నిరసనను అరికట్టకపోతే, చినుకు చినుకు కలిసి చెరువును నింపినట్టు, ఆ నిరసన సమస్తసమాజానికీ పాకుతుంది. కాబట్టి ఎటువంటి చిన్న విషయాన్నయినా తేలికగా తీసేయాకూడదు. ప్రాధాన్యాన్ని అనుసరించి, విషయాలను విశ్లేషించినా, అప్రధానంగా కనిపించిన విషయాన్ని కొట్టి పారేయకూడదు. దాని ప్రాధాన్యం దానికి ఉంటుంది.

అయితే, రాజులా, అధికారిలా ఓ ఎత్తున ఉన్నవారు సామాన్యులకు దూరం అవుతారు. సామాన్యుల అభిప్రాయం వారిని చేరదు. కానీ, చెట్టు ఎంత వృక్షంగా ఎదిగినా, వేళ్లు భూమిలో స్థిరంగా ఉంటేనే, దానికి మనుగడ ఉన్నట్టు, రాజు ఎంత గొప్పవాడైనా, శక్తిమంతుడైనా, సామాన్యుల అభిప్రాయాన్ని నిరాకరిస్తే అతడి రాజ్యం కుప్పకూలి పోతుంది. అందుకే దేశం నలుమూలలా తిరుగుతూ, ప్రజల అభిప్రాయాన్ని నిక్కచ్చిగా రాజుకు చేరవేసేవారి అవసరం రాజుకు ఉంది. అలాగే శత్రురాజుల కుట్రలను, కార్యకలాపాలను తెలుసుకుని అందించేవారి అవసరం ఉంది. ప్రస్తుతం, రాజు స్థానాన్ని ఆక్రమించిన అధికారులకు కూడా ఒకప్పటి రాజుల్లాగే తమ కిందివారి అభిప్రాయాలను తెలుసుకుని అందించేవారి అవసరం ఉంది. 

పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసేవారికి, పోటీ కంపెనీల గురించి వివరాలు అందించే వారి అవసరం ఉంటుంది. కాబట్టి, 'అధికారి' వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, ఆఫీసులో వారి ప్రవర్తన గురించి, అభిప్రాయాల గురించి, అధికారికి చేరవేసే విశ్వాసపాత్రులైన వారి అవసరం ఉంటుంది. అయితే, తనకు సమాచారం సేకరించి అందించేవారి విషయంలో అధికారి ఎంతో జాగరూకత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఈ సమాచారాన్ని సేకరించే వారంతా నారదుడిలా, నిర్మోహులు కారు. వారు గంధం చెట్టును చుట్టుకుని ఉండే విషసర్పాల వంటివారైతే, అధికారికే కాదు, సంస్థకు కూడా ప్రమాదం.

                                      ◆నిశ్శబ్ద.