భగవద్భావన వల్ల కలిగే పలితం ఏంటి?

 

భగవద్భావన వల్ల కలిగే పలితం ఏంటి?

మానవజీవితంలోని ప్రతి క్షణం అర్థవంతం. ప్రతి కదలిక అర్థవంతం. గమనిస్తే, శాస్త్రీయనృత్యాలలో ప్రతి కదలికకూ, ముద్రకూ పరమార్ధం ఉంది. కానీ ఆధునిక నృత్యాలలో శారీరక పరమైన కదలికల అర్థం ఒక్కటే. అదీ నీచతాపూర్ణమైందే. అందుకే, కోరికల దారి మళ్ళించి వ్యక్తిత్వవికాసం సాధించాల్సిన వ్యక్తి కోరికల వెల్లువలో కొట్టుకుపోతూ, గడ్డిపోచల్లాంటి కృత్రిమవ్యక్తిత్వవికాసాల ఊత కోసం అర్రులు చాస్తున్నాడు. ఇటువంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించినట్టు మన తత్త్వవేత్తలు, కోరికలను అదుపులో ఉంచుకునేందుకు మరో రకమైన 'భయా'న్ని ప్రదర్శించారు.

'పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం'

మనిషి అనుభవించే నరకయాతనలన్నిటిలోకీ, మాతృగర్భంలో, చీకటిలో, కళ్ళు, కాళ్ళు సరిగ్గా ఎదిగీ ఎదగక, ఏం జరుగుతూందో, ఏమీ అర్ధం కాక, ఉమ్మ నీటిలో, మలమూత్ర భూయిష్ట ప్రాంతంలో తొమ్మిది నెలలు గడపటమే పరమనికృష్టమైనదని మన తత్త్వవేత్తలు నొక్కిచెప్పారు.

'మానవజన్మ అత్యుత్తమమైనది' అని నొక్కి చెప్పారు. కానీ మరో జన్మ లేకుండా చూసుకోవటమే వ్యక్తి 'లక్ష్యం' అని ప్రవచించారు. ఒక వైపు ధర్మాన్ని, కర్తవ్యాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచిస్తూనే, మరో వైపు ప్రాపంచిక విషయాలపై వ్యామోహాన్ని తొలగించాలని ప్రయత్నించారు. ప్రాపంచిక సౌఖ్యాలపై నిరాసక్తతతను, అసహ్యాన్ని పెంచాలని చూశారు. ముఖ్యంగా స్త్రీ వ్యామోహాన్ని తొలగించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు కాస్త ముందుకు వెళ్ళి మహిళను 'మాయ'గా అభివర్ణించే స్థాయికి చేరుకున్నాయి. మగవారిని భ్రష్టులను చేసేందుకే స్త్రీలు ఉన్నరన్న అభిప్రాయాన్ని కలిగించి, ఆధునిక స్త్రీవాదులకు ఆయుధాలను అందించారు.

ఇలా ప్రాపంచిక సౌఖ్యాలపై విరక్తిని కలిగించటంలో భాగమే స్త్రీసాంగత్యంలో సౌఖ్యభావన అసలు రూపం వివరించటం. గమనిస్తే, పైకి కనబడే చర్మం ఒక తొడుగు. వంటిది. కానీ ఈ పైతొడుగు తొలగించి చూస్తే... కళ్ళు గుంటలు. నోరు ఓ కంత. ముక్కు రంధ్రాలు. తల భాగం పుర్రె. దానిపై అతికించినట్టు జుట్టు. అధరామృతమని అభివర్ణించే పెదవులు మాంసఖండాలు. శరీరం ఎముకల గూడు. ఊరించి, అలరించి, మనిషిలో ఆవేశం కలిగించి, అతడిని పశువును చేసే అంగాలన్నీ మాంసఖండాలు. ఈ మాంసఖండాల సంగమం కోసం ఉవ్విళ్ళూరుతూ, విచక్షణను మరచి, మనిషి పశువు అవుతున్నాడు.

ఈ రకమైన వర్ణనలు, వివరణల ద్వారా వ్యక్తిని విధ్యుక్తధర్మం తప్ప ఇతరప్రాపంచిక సౌఖ్యాల నుంచి విరక్తుడిని చేయాలని ప్రయత్నించారు. ఓ రకంగా చూస్తే, ఈ వర్ణనలో అబద్ధం, అతిశయోక్తులేవీ లేవు. ఈ రకంగా జ్ఞానం ద్వారా, విచక్షణ ద్వారా, విజ్ఞానం ద్వారా, భక్తి ద్వారా, భయం ద్వారా, సామాజికనియమల పాలన ద్వారా, ధర్మపాలన, కర్తవ్యనిర్వహణ ద్వారా వ్యక్తి బ్రహ్మచర్య పాలనకోసం ప్రయత్నించవచ్చు. వ్యక్తిత్వవికాస సాధన దిశలో అడుగు ముందుకు వేయవచ్చు.

తనలో కోరిక కలిగినప్పుడు, ఆవేశం కలిగినప్పుడు వ్యక్తి ఒక్క క్షణం ఆగి తన కోరిక స్వరూపాన్ని విశ్లేషించాలి. ఆవేశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. తనలో చెలరేగుతున్న లైంగికభావనల పరమార్థం సంతానప్రాప్తి అని గ్రహించాలి. దాంతో వ్యక్తికి 'బాధ్యత' గుర్తింపుకు వస్తుంది. తనలో చెలరేగుతున్న కోరితల తుఫానును అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అదీ కుదరకపోతే, పురాణాలలో లైంగికమైన కోరికలు అదుపు తప్పినవారి స్థితిని గురించి చదివి జాగ్రత్తపడే ప్రయత్నాలు చేయాలి. అదీ కుదరకపోతే, శంకరాచార్యులు సూచించిన 'పునరపి జననం' మననం చేయాలి. 

ఇంకా అదుపులోకి రాని కోరికను అదుపులోకి తెచ్చుకోవాలంటే, తొడుగు లేని మానవ శరీరాన్ని ఊహించాలి. బ్రహ్మచర్యసాధనలో కోరికను అదుపులో ఉంచుకునేందుకు ఇన్ని రకాల ప్రయత్నాలున్నాయి, మన జీవనవిధానంలో. 'భక్త తుకారాం' అనే ఓ సినిమా ఉంది. దాంట్లో ఓ నర్తకి (కాంచన) తుకారాంను ప్రలోభపెట్టాలని నర్తిస్తుంది. ఊరిస్తుంది. అయితే తుకారాం ఆమె ప్రలోభానికి లొంగడు. ప్రస్తుతం యౌవనంలో ఉన్న ఆమె శరీరాన్ని వర్ణించి, వార్ధక్యంలో తోలు తిత్తి అయి, వాడి వక్కలైపోయే ఆమె శరీరాన్ని ఊహకు తెస్తాడు. అంతే... ఆమెలో తన అందం పట్ల అతిశయం నశించటంతో పాటు, ఆమె కూడా భగవద్భావనకే అంకితం అవుతుంది.

అదుపులేని లైంగికేచ్ఛను అదుపు లోకి తెచ్చుకుని భగవద్భావన జోడించి సృజనాత్మకంగా దాన్ని వ్యక్తపరిస్తే ఏ కోరిక అయితే వ్యక్తిని పశువుగా మార్చి దిగజారుస్తుందో, అదే కోరిక వ్యక్తిని ఉన్నతుడినీ, ఆదర్శప్రాయుడినీ, చిరంజీవిని చేస్తుంది. అందుకే వ్యక్తిత్వ వికాసంలో బ్రహ్మచర్యభావనకు అంత ప్రాధాన్యం ఉంది.

                                 ◆నిశ్శబ్ద.