Read more!

మనిషి సహజంగా చేసే పొరపాటు ఇదే!

 

మనిషి సహజంగా చేసే పొరపాటు ఇదే!

మనం సాధారణంగా గడిపే జీవితంలో చాల తక్కువ ఏకాంతం వుంటుంది. మనం వంటరివాళ్ళం అయినా ఎన్నో ప్రభావాలు, పాండిత్యం, జ్ఞాపకాలు, అనుభవాలు, ఆదుర్దాలు, దుఃఖం, సంఘర్షణ ఇవన్నీ మన మనసును మొద్దుబారిపోయేట్లు చేసి, సౌకుమార్యం అంతా హరింపచేసి, యాంత్రికం దుర్భరం అయిన కార్యక్రమంగా తయారు చేస్తుంది జీవితాన్ని. మనం ఎప్పుడయినా ఒంటరిగా వున్నామా? లేక ఎప్పుడూ నిన్నటి బరువులు మోసుకుంటూ తిరుగుతున్నామా? ఈ విషయం మనిషిలో ఎన్నో ప్రశ్నలను ముందుంచుతుంది. ఆ ప్రశ్నలకు ఎన్నో కోణాల నుండి సమాధానాలు వెలికితీస్తుంది. విచిత్రంగా ప్రతి సమాధానం మనిషి తనను తాను సమర్థించుకునేదే అవుతుంది.

ఇలాంటి విషయాన్ని విశ్లేషించే ఒక కథ వుంది. ఇద్దరు సన్యాసులు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళుతున్నారు. నదీ తీరంలో ఒక యువతి కూర్చోని వుంది. ఆమె ఏడుస్తోంది. ఆ ఇద్దరు సన్యాసుల్లో ఒక సన్యాసి ఆమె దగ్గరకు వెళ్ళి 'ఏమిటి సమాచారం? ఎందుకేడుస్తున్నావు' అని అడిగాడు.

 'నదికి ఆవలి తీరంలో కనిపిస్తూవున్న ఇల్లు వుంది చూసారా, అక్కడ నుండి వచ్చాను ఈ ఉదయం. అప్పుడు నదిని తేలికగా దాటగలిగాను. ఇప్పుడేమో నది వరదలలో వుంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళలేను. ఇక్కడ పడవగూడా లేదు' అంది. 

సన్యాసి అంతా విని 'అది పెద్ద సమస్య కాదు' అంటూ ఆమెను భుజాలకు ఎత్తుకున్నాడు. నది దాటించాడు, ఆవలి తీరంలో ఆమెను వదిలాడు. ఆ తరువాత ఇద్దరు సన్యాసులూ తమ నడక సాగించారు. రెండు గంటల తరువాత, రెండవ సన్యాసి అన్నాడు: 'సోదరా! స్త్రీని తాకము అని మనం ప్రతిన పూనాం, నీవు ఇప్పుడు మహత్తరమైన పాపం చేశావు. నీవు స్త్రీని తాకడం వల్ల కొంత సుఖం పొందావుగదూ?' అని అన్నాడు.

దానికి మొదటి సన్యాసి "నేను ఆమెను రెండు గంటల క్రితమే దింపి వేశాను. నీవు యింకా మోసుకువస్తున్నట్లున్నావు కదూ?' అని జవాబు చెప్పాడు.

మనం చేసే పని కూడా అదే. మన బరువులు నిరంతరం మోసుకుంటూ తిరుగుతాము. వాటి విషయంలో చనిపోము. ఒక సమస్య పట్ల పరిపూర్ణమయిన సావధానత చూపినప్పుడే దానిని తక్షణం పరిష్కరించగలుగుతాము. ఏ పనిని రేపటికి వాయిదా వేయగూడదు. మరుసటి క్షణానికయినా వాయిదా వేయడం  పనికిరాదు. అప్పుడు మనం జనసమ్మర్దంతో నిండిన ఇంటిలోవున్నా, బస్సులో కూర్చునివున్నా  ఏకాంతంగా వున్నట్లే లెక్క. ఆ ఏకాంతము తాజా మనసును సూచిస్తుంది, అమాయక మనసును సూచిస్తుంది.

ఆంతరిక ఏకాంతం, స్థలం ఏర్పర్చుకుని వుండడం చాలా ముఖ్యం. దాని వల్లనే స్వేచ్ఛ, ముందుకు పోవటానికి, పనులు చేయటానికి, ఎగరటానికిని మార్గం ఉంటుంది. ఏమయినా మంచితనం అనేది, స్వేచ్చ వున్నచోట పుష్పం వికసించినట్లుగా, విశాలస్థలంలోనే స్థావరించుకో గలుగుతుంది. మనకు రాజకీయ స్వాతంత్య్ర్యం వుండవచ్చును, కాని ఆంతరికంగా స్వేచ్ఛలేదు. అందువల్లనే అంతర్గత స్థల వైశాల్యం లేకుండా పోయింది. మనలో విశాలమైన రామస్ధలం వుంటేనే ఏ సుగుణమయినా, సలక్షణమయినా వికసించి ప్రవర్తిల్ల గలుగుతుంది. విశాలస్థలం, నిశ్శబ్దం చాల ముఖ్యం. ఎందుకంటే, అవి వున్నప్పుడే మనసు ఏకాంతంగా, ప్రభావితం కాకుండా, శిక్షితం కాకుండా, వివిధ రకాల అనుభవాల పాలపడకుండా వుంటుంది, సరికొత్తగా సంపూర్ణంగా నూతనత్వాన్ని ఆహ్వానించ గలుగుతుంది.

                                         ◆నిశ్శబ్ద.