Read more!

అహంకారం చివరికి నేర్పేది ఏమిటి?

 

అహంకారం చివరికి నేర్పేది ఏమిటి?

పురాణాలు చరిత్రల నుండి నేటి వర్తమానం వరకూ ఎంతోమంది గొప్పగా ఎదిగిన వారు తమ స్థానాన్ని నిలబెట్టుకోలేక, వ్యక్తిత్వాలు నిలకడగా ఉండలేక పతనం అవ్వడానికి కారణం ఏదైనా ఉందంటే అది అహంకారంమే… మనకు కలిగే అన్ని అనర్థాలకూ పునాది అహంకారమే! “నేను” అనే అహంకార మేఘాన్ని తొలగించగలిగితే మనలో ఉన్న “జ్ఞానం” అనే సూర్యుడు ప్రకాశిస్తాడు.


అహంకారం వల్ల వచ్చే అనర్థాల్ని ఎన్ని శాస్త్రాలు విశదీకరించినా, ఎంతమంది మహాత్ములు బోధించినా అవన్నీ ఇతరులకు అన్వయిస్తామే గానీ, మనకు వర్తిస్తాయని ఎన్నడూ ఊహించం. మనం ఇలాంటి భ్రమల వలయంలో బందీలుగా ఉండటం వల్లనే మనకు జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, “నేను” అనే అహాన్ని వదలలేకపోతున్నాం, అనర్థాలను కొనితెచ్చుకొంటున్నాం. మనలో 'నేను' అనే అహంకారం ఎంత దృఢంగా, ఎంత లోతుగా పాతుకు పోయిందో తెలియజేయడానికి శ్రీరామకృష్ణులు ఒక ఉదాహరణ చెప్పారు:


"లేగదూడ “హం హై, హంహై - నేనున్నాను, నేనున్నాను" అని అరుస్తూ పుడుతుంది. ఆ దూడ పెద్దదైన తరువాత దాన్ని బళ్ళకు కట్టి బరువులు మోయిస్తారు. కాడికి కట్టి పొలాన్ని దున్నిస్తారు - ఇలా ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది. చివరికి చనిపోయిన తరువాత కూడా దాని చర్మంతో డోలు చేస్తే 'హం హం - నేను, నేను' అంటూ శబ్దం చేస్తుంది”


ఓ ఉప్పు కణికకు ఆధారం అనంత సాగరం. ఆ అనంత సాగరం నుంచి వచ్చిన ఉప్పు కణిక సాగరం లోతునే కనుగొనాలని ప్రయత్నించడం ఎంత హాస్యాస్పదమో కదా! అలాగే నీటి బుడగ లాంటి మన బ్రతుకుకు ఆధారం ఆ సచ్చిదానంద సాగరం. ఆ విషయాన్ని మరచిపోతే సృష్టికి ఆధారభూతుడైన ఆ పరమాత్మ మన అజ్ఞానానికి అబ్బురపడక మానడు.


అహంకారం అంటే ఏమిటి??


ఒక మహారాజు తనకు ముక్తి మార్గం బోధించమని ఓ సాధువును ప్రార్థించాడు. ఆ సాధువు రాజుతో "మహారాజా! ఈ లోకంలో అన్ని అనర్థాలకూ మూలం 'నేను' అనే అహంకారమే. దాన్ని మనసులో నుంచి సమూలంగా త్రుంచి వేస్తే గానీ ముక్తి సాధ్యం కాదు" అన్నాడు. మహారాజు “అసలు, ఈ అహంకారమంటే ఏమిటో వివరించండి" అని సాధువును ప్రశ్నించాడు. రాజు అడిగిన ప్రశ్న వినగానే సాధువు కోపోద్రిక్తుడై “ఓ రాజ్యానికి రాజైన మీరు ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు వేస్తారా!” అని గర్జించాడు.


సాధువు కోపాన్ని చూసి సహనం కోల్పోయిన రాజు, "ఈ రాజ్యాధిపతినైన నన్నే అవమానిస్తారా! మీకు శిరచ్ఛేదమే సరైన శిక్ష” అని ప్రక్కనే ఉన్న సైనికుణ్ణి పిలిచాడు.


మహారాజు ఉగ్రరూపం చూసి సాధువు చిరునవ్వుల జల్లులు కురిపిస్తూ “రాజా! అహంకారం అంటే ఇదే!" అని సమాధానపరిచాడు. పరిశ్రమించకుండా లభించేది ఏదైనా చివరకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాబట్టి శ్రమించకుండా మనలో పెరిగే ఈ అహంకారమనే మొక్కను మొదట్లోనే త్రుంచివేయాలి. శ్రమిస్తే గానీ దొరకని సహనం, అణకువ లాంటి సుగుణాల్ని అలవరచుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే అహంకారం కాస్తా మనిషి అంతానికి దారితీస్తుంది.


                                        ◆నిశ్శబ్ద.