Read more!

మనిషి జన్మ సార్థకం అవ్వాలంటే!

 

మనిషి జన్మ సార్థకం అవ్వాలంటే!


మనం మనకోసమే జీవించడం కన్నా ఇతరుల కోసం కూడా జీవించడం నేర్చుకోవాలి. అదే మానవ జీవితానికి పరమార్థం. పశువులు కూడా తమ కోసం తాము జీవిస్తాయి. ఇతరుల కోసం జీవించగలిగే శక్తి, తెలివి మనుష్యులకే ఉంటాయి. “ఇతరులకు సహాయం చేసిన వారిలో మానవత్వం ప్రకటితమవుతుంది” అని స్వామి వివేకానంద అనేవారు. స్వార్థాన్ని జయించి పరోపకారం చెయ్యడమే మానవత్వం.


ఒకవైపు పూజలు, పునస్కారాలు చేస్తూ దేవాలయాలకు వెళ్ళి దైవదర్శనాలు చేసుకుంటూ, మరోవైపు సంకుచిత మనస్తత్త్వాన్ని విడిచిపెట్టకపోతే, చేసిన పూజలన్నీ వ్యర్థం. అలాంటి పూజలు వ్యాపారంతో సమానం.


పరమేశ్వరుణ్ణి మనం గుడిలో ప్రతిమగా కాకుండా, ప్రపంచంలోని దుఃఖితుల్లో, పీడితుల్లో చూసి వారి కష్టాలనూ, బాధలనూ దూరం చేసే ప్రయత్నం చేసిననాడు ఈశ్వరుని కృపకు పాత్రులమవుతాం. కేవలం తనను స్తుతించడం ఒక్కటే పరమేశ్వరుడికి ఇష్టం ఉండదు.


ఒక ధనికుడి తోటలో ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. ఒకడు బద్ధకస్తుడు, దుర్బలుడు. కానీ, యజమాని ఎప్పుడు ఎదురుపడినా లేచి నిల్చొని నమస్కారం చేసి ఆయన అందచందాలను పొగిడేవాడు. రెండో పనివాడు తన పని తాను చూసుకునే వాడు. బాగా కష్టపడి పని చేసి, తోటలో రకరకాల పళ్ళు, కూరగాయలు పండించి అన్నీ తనే మోసుకుంటూ దూరంగా ఉన్న యజమాని ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఇద్దరిలో ఎవరిని యజమాని ఇష్టపడతాడు? తోటలో కష్టపడి  పనిచేసిన ఆ రెండోవాడినే!


అదే విధంగా ఈ ప్రపంచమే ఒక తోట. దాని యజమాని ఆ భగవంతుడు. ఇక్కడ కూడా రెండు రకాల తోట పనివారున్నారు. మొదటి రకం మనుష్యులు బద్ధకస్తులు! పనీ పాట చెయ్యని వారు. పై పై కబుర్లు చెబుతూ భగవంతుణ్ణి ప్రశంసలతో ముంచెత్తుతూ ఉండే రకం వీరు. రెండో రకం మనుష్యులు భగవంతుని సంతానమైన మానవులందరికీ సాయం చేసి తరించేవారు. ఈ రెండు రకాల మనుష్యుల్లో భగవంతుడికి ఏ రకం వారు నచ్చుతారు? నిశ్చయంగా ఇతరులకు సేవ, సహాయం చేసే వారే! అందుకే 'మానవ సేవే మాధవ సేవ' అని అన్నారు. 


సాధ్యమైనంత వరకూ పవిత్రంగా ఉండి, వీలైనంత వరకూ ఆపదలో ఉన్న వారికి సహాయం చెయ్యడమే మన జీవితాన్ని తగిన విధంగా ఉపయోగించుకోవడమంటే! దాని వల్ల మనస్సులో ఉన్న మాలిన్యమంతా తొలగిపోతుంది. మన హృదయంలో నివసించే భగవంతుడు ప్రకటితమవుతాడు. అద్దం మీద ధూళి, దుమ్ము పేరుకొని ఉంటే దానిలో మన ప్రతిబింబం స్పష్టంగా చూసుకోలేం. దుమ్ము దులిపితే అద్దంలో ప్రతిబింబం బాగా కనిపిస్తుంది. అలాగే అజ్ఞానం, దానితో ఉత్పన్నమయ్యే స్వార్థం మన హృదయమనే అద్దం మీద దుమ్ములా పేరుకుపోతాయి. నిస్వార్థపరుడెప్పుడూ దేనినీ ఆశించడు. “నా గురించి నాకు బెంగ లేదు. స్వర్గానికి వెళ్ళాలనే కోరిక నాకు లేదు. ఎవరికైనా మంచి జరుగుతుందంటే నేను నరకానికి వెళ్ళడానికైనా సిద్ధమే” అంటాడు స్వార్థం లేనివాడు. ఇదే మానవత్వమంటే. 


ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని సాధిస్తున్నారనడానికి ఇదే ఓ నిదర్శనం. వారే భగవంతుడికి ఇష్టులవుతారు. అతడు నాస్తికుడైనా సరే. స్వార్థపరుడు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని తీర్థ స్థలాల చుట్టూ తిరిగినా దేవునికి ఎన్నటికీ ప్రియుడు కాలేడు. కాబట్టి ప్రతి మనిషీ తన సుఖాన్ని కోరుకోవడంతో పాటు ఇతరులకు సంతోషాన్ని ఇవ్వగలిగిననాడే ఈ అరుదైన మానవజన్మ సార్థకమైనట్లు!


                              ◆నిశ్శబ్ద.