Read more!

జీవిత పరమార్థానికి అర్థమిదే...

 

జీవిత పరమార్థానికి అర్థమిదే...


ఈ ప్రపంచంలో చాలా మంది ఆ భగవంతుడిని ఆరాధించేవారు జీవిత పరమార్థాన్ని చేరుకోవాలని, దాన్ని సాధించాలని అనుకుంటూ వుంటారు. ఎందుకంటే ఆ జీవిత పరమార్థంతోనే అపరిమితమైన సుఖం సాధ్యమవుతుందని గట్టి నమ్మకం.  అయితే సుఖాల పందిట్లో సేద తీరాలనీ, ప్రశంసల జల్లుల్లో పరవశించాలనీ ఆశించేవారు ఎన్నడూ నిజమైన ఆనందాన్ని పొందలేరు. సుఖాన్ని కోరుకునే వ్యక్తి దుఃఖాన్ని కూడా భరించగలిగే శక్తిని కలిగివుండాలి. ఎందుకంటే దుఃఖం, సుఖాన్ని అనుసరిస్తూంటుంది. అందుకే 'సుఖం, దుఃఖమనే ముళ్ళ కిరీటం ధరించి వస్తుంది' అని అంటారు స్వామి వివేకానంద. అందువల్ల జీవితంలో కష్ట సుఖాలు సహజమని భావించి, రెండింటినీ సమభావంతో ఆహ్వానించగలిగే మనఃస్థితిని అలవరచుకోవాలి.

పరమోన్నత స్థితి ఎలాంటిదంటే..

జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించగలగడం ఓ ఉన్నత స్థితి. కానీ సుఖం ఉన్నచోట దుఃఖం ఉంటుంది, రాగం ఉన్నచోట ద్వేషం ఉంటుంది, భయం ఉన్నచోట క్రోధం ఉంటుంది. ఈ ద్వంద్వాలకు అతీతమైన స్థితిని సాధించడమే జీవిత పరమార్థం. ఆ స్థితిని పొందినవాడే పరమోన్నతుడనీ, స్థితప్రజ్ఞుడనీ శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు.

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥

 'దుఃఖాలకు దిగులు చెందనివాడూ, సుఖాలకు సంతోషించని వాడూ, రాగం (దేనితోనూ బంధం) గానీ, భయంగానీ, క్రోధం గానీ లేనివాడూ అయిన మునిని స్థితప్రజ్ఞుడంటారు'.

సముద్రంలో ఎన్ని నదులు కలిసినప్పటికీ అది ఎలా మార్పు చెందదో, అలాగే పరమపద స్థితిని పొందిన వ్యక్తి ఎన్ని కష్టసుఖాలు ఎదురైనా నిశ్చలంగా ఉంటాడు. అలాంటి పరమోన్నత స్థితిని పొందిన ఒక సాధారణ ఉపాధ్యాయుడైన మాస్టర్ మహాశయ్ (మహేంద్రనాథ్ గుప్త - శ్రీరామకృష్ణ కథామృత రచయిత) జీవితంలో జరిగిన ఒక సంఘటనను తెలుసుకుంటే జీవిత పరమార్థం అంటే అర్థమవుతుంది.

 జీవితంలో ఎదురైన ఒడుదొడుకులకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొన్న మాస్టర్ మహాశయ్, శ్రీరామకృష్ణుల దర్శన భాగ్యంతో, వారి బోధనల స్ఫూర్తితో ఒక మహోన్నత మునిగా పరిణతి చెందారు. ఆ మహాత్ముణ్ణి దర్శించుకోవడానికి రామకృష్ణ మఠ స్వామీజీలు తరచూ ఆయన ఇంటికి వెళుతూండేవారు.

ఒకరోజు స్వామి వివేకానంద శిష్యులైన స్వామి ఆత్మానంద, మాస్టర్ మహాశయ్ ని దర్శించుకోవడానికి వెళ్ళారు. స్వామీజీని చూసిన వెంటనే ఆయన ఎంతో ఆనందంతో మేడపై ఉన్న తన గదికి తీసుకువెళ్ళారు. స్వామీజీని కూర్చోబెట్టి మిఠాయిలు తినమని ఆయన ముందుపెట్టారు. స్వామీజీ మిఠాయిని తింటూవుంటే మాస్టర్ మహాశయ్ తన జీవితానుభవాలను చెప్పసాగారు. ఇలా ఇద్దరూ సంతోషంగా సంభాషించుకొంటున్నప్పుడు కొంత మంది వ్యక్తులు వస్తూ పోతూండడాన్ని గమనించారు స్వామీజీ. అసలు విషయ మేమిటని మాస్టర్ మహాశయ్ ని అడిగినప్పుడు, 'మీరు మిఠాయిలు తినడం పూర్తయిన తరువాత చెబుతాను' అని అన్నారు ఆయన. కొద్దిసేపటికి ఇంటి క్రింది గది నుండి మధ్య మధ్యలో ఏడుపులు వినిపించాయి. ఏదో విషాద సంఘటన జరిగిందని గ్రహించిన స్వామీజీ అసలు విషయం ఏమిటో చెప్పమని మాస్టర్ మహాశయ్ ను ఒత్తిడి చేశారు. అప్పుడు మాస్టర్ మహాశయ్, స్వామీజీతో 'ఈ రోజు ఉదయం నా కుమార్తె మరణించింది. ఇప్పుడు ఆమెకు అంత్యక్రియలు జరపాల్సి ఉంది' అని ప్రశాంతంగా చెప్పారు.

విషాదంలో కూడా ప్రశాంతతను ప్రదర్శించిన మాస్టర్ మహాశయ్ స్థితప్రజ్ఞత్వాన్ని దర్శించిన స్వామి ఆత్మానందజీ ఆయనకు ప్రణమిల్లారు. పరిస్థితులకు అతీతంగా ఉండగలిగే ఆ పరమోన్నత స్థితిని పొందగలగడమే 'జీవిత పరమార్థం'.

ఇదీ జీవిత పరమార్థంలో ఉన్న అర్థం..

                                      ◆నిశ్శబ్ద.