వినాయక చవితి పూజకు ఇలాంటి విగ్రహం పెడితే అంతా శుభమే..!
వినాయక చవితి పూజకు ఇలాంటి విగ్రహం పెడితే అంతా శుభమే..!
వినాయక చవితి భారతదేశం అంతటా జరుపుకునే పండుగ. కొన్ని ప్రాంతాలలో 9 రోజుల పండుగగా గణేష్ నవరాత్రుల పేరిట ఉత్సవాలు జరుపుతారు. మరికొన్ని ప్రాంతాలలో 10 రోజులు కూడా వినాయకుడిని మండపంలోనే ఉంచుతారు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని మనసారా భక్తితో మొక్కితే ఏ పనికి ఆటంకాలు రాకుండా ఉంటాయి. అయితే ఇంట్లో పూజ కోసం ఎలాంటి విగ్రహం తీసుకురావాలి? ఎలాంటి విగ్రహం శుభప్రదంగా పరిగణించబడుతుంది? వినాయకుడు విగ్రహం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? తెలుసుకుంటే..
వినాయకుడు విగ్రహం..
భారతదేశంలో ప్రతి హిందూ కుటుంబం తమ స్థోమత మేరకు వినాయకుడు విగ్రహాలు కొనుగోలు చేసి వినాయక చవితి పూజ చేసుకోవడం ఆనవాయితీ. మార్కెట్లో వివిధ రకాల భంగిమలలోనూ, వివిధ రకాల రంగులలోనూ వినాయకుడు విగ్రహాలు అమ్ముతుంటారు. అయితే తెలుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజలో ఉంచితే మంచిదట. అది కూడా వినాయకుడు లలితాసనంలో ఉండాలట. లలితాసనం అంటే కూర్చొన్న భంగిమ. అది కూడా స్వామి ముఖంలో ప్రశాంతత ఉండాలట. ఇలాంటి వినాయకుడు విగ్రహాన్ని పూజలో ఉంచుకుంటే ఆ ఇంట్లో శాంతి, అన్ని రకాలుగా అభివృద్ది ఉంటాయట.
భారతీయులకు ప్రతి పండుగను సంప్రదాయంగా కంటే ఆడంబరంగా జరుపుకోవడం అలవాటు అయిపోయిందని ఈ మధ్య కాలంలో బాగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా అన్ని రకాలుగా కాలుష్యం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకుడు విగ్రహాలను పూజలో ఉంచడం మంచిది. అంతే కాదు.. వినాయకుడు విగ్రహాల పరిమాణం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ పెద్దగా ఉన్న వినాయకుడు విగ్రహాలు కాకుండా చిన్నగా ఉన్న విగ్రహాలు తీసుకోవాలి.
వినాయకుడు విగ్రహాన్ని ఇంటికి తీసుకు వచ్చేముందు విగ్రహాన్ని ఏదైనా వస్ర్తం లేదా కాగితంలో ప్యాక్ చేయాలి. పూజకు ముందు ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు మాత్రమే విగ్రహానికి ఉన్న వస్త్రం లేదా కాగితం తీయాలి.
ఇప్పట్లో మార్కెట్లో మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు చాలా వినూత్నంగా అమ్ముతున్నారు. విగ్రహం తయారీలోనే విగ్రహంలో మొక్కల విత్తనాలను విగ్రహంలో ఉంచుతున్నారు. వినాయక పూజ అనంతరం విగ్రహాన్ని ఇంట్లోనే చిన్న మట్టి కుండీ లేదా ప్లాస్టిక్ కుండీలో నిమజ్జనం చేయవచ్చు. దీని వల్ల ఆ కుండీలో కొన్ని రోజులలో కొత్త మొక్క వస్తుంది. ఇది ప్రకృతి ప్రేమికులకు చాలా నచ్చే అంశం.
ప్రతిభను బట్టి మైదా, కాగితం, పసుపు, కర్రముక్కలు, బంకమన్ను సహాయంతో ఇంట్లోనే వినాయకుడు విగ్రహాలు తయారుచేసుకోవచ్చు.
వినాయకుడి విగ్రహాన్ని ఉత్తరం, ఈశాన్యం, తూర్పు లేదా పశ్చిమాన ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి.
వినాయకుడు ను ఉంచే ప్రదేశం శుభ్రంగా పూజకు అనువుగా ఉండాలి.
ఇత్తడి దీపపు కుందు లలో దీపాలు వెలిగించాలి.
వినాయకుడికి ఎర్ర మందారం అంటే ఇష్టం. ఎర్ర మందారం పూలు పూజలో ఉండేలా చూసుకోండి.
ఇంటి ద్వారం వద్ద ఉంచవచ్చా?
చాలామంది వినాయకుడి విగ్రహాన్ని ఇంటి ద్వారం వద్ద ఉంచుతుంటారు. లేదంటే ఇంటి బయట ఉంచుతుంటారు. అయితే ఇలా ఉంచడం మంచిది కాదని అంటున్నారు పెద్దలు, పండితులు. దీని వెనుక ఒక కారణాన్ని కూడా చెబుతారు.
పార్వతి దేవి నలుగు పిండితో బొమ్మను చేసి, దానికి ప్రాణం పోసి, తను స్నానం చేయడానికి వెళ్తూ ఆ బాలకుడిని ద్వారం దగ్గర కాపలాగా ఉంచుతుందట. ఇలా చేసినప్పుడు శివుడు ఇంట్లోకి రాబోగా.. బాల గణేశుడు శివుడిని ఇంట్లోకి రానివ్వలేదు. శివుడికి కోపం రావడం, బాల గణేశుడి తల నరకడం అన్నీ జరిగిపోయాయి. ఈ కారణంగా వినాయకుడి విగ్రహాన్ని ద్వారం వద్ద ఉంచితే గొడవలు, కలహాలు, ఇబ్బందులు తలెత్తుతాయని అంటారు. వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడమే మంచిది.
*రూపశ్రీ.