Read more!

గణపతిని ఆరాధించే 21 రకాల పత్రాలలోని ఔషధ గుణాలు..

 

గణపతిని ఆరాధించే 21 రకాల పత్రాలలోని ఔషధ గుణాలు..

 

 

 

శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః

"గణపతి" కి వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడు 21 రకాల ఆకులతో పూజ చేస్తాము. కొండంత దేవుడికి కొండంత పత్రితో పూజ చేయలేము. మనకు దొరికిన వాటితో, పెద్దలు చెప్పిన విధంగా పూజ చేస్తాము కదా.  బాగుంది. అయితే, మన పెద్దలు ఊరికే  " 21 "  ఆకులు అని చెప్పరు కదా.  ఏమిటి గణపతికి సంబంధించి " 21 " సంఖ్యకు ఉన్న ప్రత్యేకత అనేది తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.

  పరమాత్ముని సృష్టిలో మానవుని శరీరము మరియు జన్మ కూడా పవిత్రమైనవి.శక్తివంతమైనవి.  సృష్టిలో వేరే ఏ ప్రాణీకీ లేని విధముగా శబ్ద రూపములో అంటే మన మాటల రూపములో, మంత్రముల రూపములో భగవంతుడిని కీర్తించే అవకాశం ఉండి మనకు. అయితే ఈ అదృష్టాన్ని మన శరీరములోని 10  జ్ఞానేంద్రియాలు, 10  కర్మేంద్రియాలు, ఒక మనస్సు ఇవన్నీ కలిసి నియంత్రిస్తూ ఉంటాయి. ఇవి మొత్తము కలిపి 21 .  ఇవన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. చేసే పనిలో మంచి ఫలితము లభిస్తుంది.అంటే ఆ ఏకాగ్రత కుదరకుండా అడ్డు పడే విఘ్నాలను తొలగించి, కాపాడమని ఆ విఘ్నాధిపతిని వేడుకుంటూ మన ఇంద్రియాలు, మనస్సుకు ప్రతీకలుగా, ఈ 21  రకాల ఆకులను పూజలో వాడతాము. అంతే కాక ఆకులు 21  రకాలు, పూలు 21  రకాలు, గరిక 21 పోచలు, 21  పండ్లు, మోదకాలు 21  పూజలో వాడతారు. పెద్దలు చెప్పారనో, శాస్త్రం చెప్పిందనో, పెట్టక పొతే ఏమవుతుంది అన్న భయము అవసరము లేదు. వీలు కుదరక ఇవన్నీ సమకూర్చుకోలేక పొతే అన్నే కలిపి "21 " వచ్చేలా కూడా చూసుకోవచ్చు.  ఇంకా "2 +1 =3 " అవుతుంది. ఈ సంఖ్యను ఆకారము, ఉకారము, మకారముల సంయుక్తాక్షరముగా వచ్చే ఓంకారము నకు ప్రతీకగా చెపుతారు. గణపతి ఓంకార స్వరూపుడు కదా.  ఈ పూజను మనము మనసా,వాచా, కర్మణా త్రికరణ శుద్ధిగా చేస్తే పొందే ముఖ్యమైన లాభము ఏమిటి ఆంటే మనలోని సత్వ గుణము, రాజా గుణము మరియు తమో గుణము అనే 3 గుణముల పైన గణపతిని అధిపతిగా చేసుకోగలుగుతాము. అన్ని గుణాలు కావలసినవే కాబట్టి అవసరానికి తగినట్టుగా వాటిని మనకు ఉపయోగపడేలా చేసి సన్మార్గములో నడిపించే బాధ్యత ఆయనదే అవుతుంది.  మన జన్మ సఫలము అవుతుంది. ఇది ఇందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక కోణము.

      ఇక వైజ్ఞానిక పరముగా చూస్తే శ్రావణ బాధ్రపద మాసములు రెండు వర్షాకాలము. ఈ సమయములో ఎక్కడెక్కడి నీరు కలుషితము అవుతుంది. పసుపు బాగా వాడి, ఔషధ గుణములు కలిగిన ఈ ఆకులను నీటిలో నిమజ్జనం చేయడము ద్వారా నీటిలో కాలుష్యం తొలగిపోతుంది. శుభ్రమైన నీరు లభిస్తుంది.  ఈ పూజలో మనము వాడే ఆకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

ముందుగా "మాచీ పత్రము"

         దీని కషాయముతో దద్దుర్లు, పుండ్లు తొలగించవచ్చు. ఇది కుష్ఠువ్యాధికి మంచి మందు కూడా. నరాలకు పుష్టినిచ్చే ఔషధము. కళ్ళకు చలువ. పొట్టకు బలము. మానసిక వికాసానికి బాగా తోడ్పడుతుంది.

తరువాత బృహతీ పత్రము

        దీన్ని వాకుడాకు అని అంటారు. ముళ్ళ చెట్టు అయినా కూడా శ్లేష్మము, క్షయ, ఉబ్బసపు దగ్గు వంటి వాటికి చక్కని ముందుగా ఉపయోగపడుతుంది. హృద్రోగాలకు చక్కని మందుగా పని చేస్తుంది.

మూడవది మనకు బాగా తెలిసిన బిల్వ పత్రము

         దీన్నే మారేడు లేదా బిలిబిత్తిరి అనే పేర్లతో పిలుస్తారు. మూడు దళాలతో ఉండే ఈ పత్రం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శివాలయాల్లో ఈ చెట్టు తప్పకుండా పెంచుతారు. పాతకాలంలో చేతలకు దీని రసము రాసి పుచ్చు రానీయకుండా చూసుకుంటారు.  ఈ ఆకు నీటిని చాలా పరిశుభ్రం చేస్తుంది. అందుకే పరమశివునికి ఈ ఆకుని సమర్పించి, జలంతో అభిషేకం చేస్తారు.

నాలుగవది మనకు చాలా బాగా తెలిసిన గరిక

   ఎంతో ఎత్తుగా పెరుగుతుంది. ఎన్నో అద్భుతమైన ఔషధీ విలువలు ఉన్నాయి. కొద్దిగా గరిక తీసుకుని, ఉప్పు రాయి, పసుపు వేసి నూరి కట్టు కడితే ఎదురు దెబ్బల వలన తగిలిన గాయాలు మాసిపోతాయి. వేడిని తగ్గిస్తూ ఉంటుంది ఈ గడ్డి.

 ఐదవది దత్తూర పత్రము

   దీన్నే ఉమ్మెత్త ఆకు అంటారు. వీటిలో కూడా నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. విషాన్ని కూడా హరించే తత్త్వం ఈ ఆకుకు ఉంది. వేడి వల్ల వచ్చిన గడ్డలకు దీనితో చేసే వైద్యం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

ఆరవది బదరీ పత్రము

ఆంటే రేగు ఆకు. జీర్ణకోశ వ్యాధులను తగ్గించే దివ్య ఔషధం. రుచిని పుట్టిస్తుంది. రక్త దోషాలు హరిస్తుంది. బలం ఇస్తుంది. ఆకుల నురుగు రాస్తే అరికాళ్ళ మంటలు, అరచేతుల మంటలు తగ్గుతాయి.

ఏడవది అపామార్గ పత్రము

దీనినే ఉత్తరేణి ఆకు అంటారు. పంటి జబ్బులకు చక్కని మందు. విషాహారం తిన్నప్పుడు ఆంటే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు చాలా ఉపయోగం అవుతుంది. విషాన్ని హరిస్తుంది.

ఎనిమిదవది తులసీ పత్రము

మనకు చాలా బాగా తెలిసింది. ప్రతి ఇంట్లో ఉండేది. విష్ణు తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలు ఉంటాయి. తులసి ఆకులు మంచి యాంటీ సెప్టిక్.అహీరణ వ్యాధులకు, కడుపు నొప్పికి వాడతారు. చర్మ రోగాలకు చక్కని మందుగా పని చేస్తుంది. పసిబిడ్డల పాలిటి సంజీవని దీని రసము.

తొమ్మిదవది చూత పత్రము

 మామిడాకు. ఇంటికి మామిడి తోరణం కట్టారు ఆంటే శుభ కార్యము జరుగుతున్నట్లే. నలుగురు చేరిన చోట ప్రాణ వాయువు ఇస్తుంది ఈ ఆకు. దీని ఆకులతో విస్తరి కుట్టి దానిలో భోజనం చేస్తే రుచి కలిగిస్తుంది. గొంతు వ్యాధులను తొలగిస్తుంది.

పదవది కరవీర పత్రము

దీనినే గన్నెరాకు అంటారు. కంతులు. గడ్డలు రాకుండా కాపాడుతుంది. జంతువులకు సంబంధించిన విషయాలను విరగగొడుతుంది. ఈ రసముతో పేలు పోతాయి.

విష్ణుక్రాంత పత్రము

నేల పైన పాకుతూ విస్తారంగా పెరుగుతుంది. చిన్న మొక్కగా పెరుగుతుంది. కానీ దీని కషాయము పైత్య జ్వరాలకు, కఫ జ్వరాలకు, ఉబ్బసములకు మందుగా పని చేస్తుంది.  వీటి ఆకులని ఎండ పెట్టి ఆ పొగ పీలిస్తే జలుబు, దగ్గు, ఉబ్బసము వంటివి తగ్గుతాయి.

దాడిమీ పత్రము

దీనిని దానిమ్మ పత్రము అంటారు.  వగరుగా ఉండే మంచి ఔషధము. నీళ్ల విరోచనాలు తగ్గిస్తుంది. రక్త హీనత తొలగిస్తుంది. నోటి పూత ఉన్నవారు వీటి లేత ఆకులు నమిలితే తగ్గిపోతుంది.

ఆ తరువాత మరువక పత్రము

దీనినే మరువము అని కూడా అంటారు.  రకరకాల పూలతో  ఈ ఆకును కలిపి మాలగా కట్టి స్త్రీలు తలలో పెట్టుకుంటూ ఉంటారు. దీని తైలము మెదడుకు చలువ కలిగిస్తుంది.  జుట్టు రాలకుండా కాపాడుతుంది. గుండె జబ్బు, కీళ్ల వ్యాధులకు మందుగా పని చేస్తుంది.

ఆ తరువాత సింధువార పత్రము

దీన్నే వావిలకు అంటారు. దీని కషాయము జ్వరాలను హరిస్తుంది. ఉబ్బులు, కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులకు మందుగా పనికి వస్తుంది.

అనంతరము జాజి ఆకులు

జాజికాయ, జాపత్రి వంటల్లో బాగా వాడతారు. పైత్యానికి ముందుగా ఉపయోగపడతాయి. నోటి పూటకు చక్కని మందు. కామెర్లకు మందుగా పని చేస్తుంది. చర్మ రోగాలకు మందుగా పనిచేస్తుంది. కాలేయానికి బలము. పక్షవాతము రాకుండా నివారిస్తుంది.

ఆ తరువాత గండకీ పత్రము

దీనినే వినాయక పత్రము లేదా అడవి మొల్ల అని కూడా అంటారు. తేలికగా లభించదు ఈ పత్రము.  కొన్ని కొన్ని ప్రత్యేక ప్రదేశములలో మాత్రమే లభించే ఈ ఆకు చర్మ వ్యాధులకు చాలా మంచింది.

అనంతరము శమీపత్రము

మనకు బాగా తెలిసిన  జమ్మి ఆకు. పాండవులు అజ్ఞాత వాసము చేసేటప్పుడు ఈ జమ్మి చెట్టుపైన వారి ఆయుధాలు ఉంచారని మనకు తెలుసు. ఈ చెట్టే ఎందుకు ఆంటే దీని లోని ఔషధ గుణములు తుప్పు పట్టకుండా కాపాడతాయి.

ఆ తరువాత అశ్వత్థ పత్రము

 దీనిని రావి ఆకు అని కూడా అంటారు.  జ్వరాలు, నోటి పూతలకు మందుగా ఉపయోగపడుతుంది. వీటి పండ్ల చూర్ణం చేసి రోజుకు రెండు సార్లు, రెండు చెంచాలు తినిపిస్తే ఆస్తమా తగ్గిపోతుంది.

ఆ తరువాత పూజలో మనం వాడే పత్రము అర్జున పత్రము

ఆంటే మద్ది ఆకు. ఈ మద్దిలో తెల్ల మద్ది, నల్ల మద్ది అని రెండు రకములు ఉంటాయి. తెల్ల మద్దిని మేహ శాంతి కొరకు, వ్రణాలకు మందుగా వాడతారు. చెవినొప్పులకు మంచి మందుగా పని చేస్తుంది. త్రిదోష హరము కూడా ఈ ఆకు.

చివరగా అర్క పత్రము

    జిల్లేడు ఆకు.  ఆ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే విషాన్ని హరిస్తుంది అని ఆయుర్వేదం చెప్తోంది. కానీ వైద్య సలహాలు లేకుండా పొరపాటున కూడా వీటిని వాడకూడదు. ఇది తేలు, పాము వంటి వాటి విషాన్ని హరిస్తుంది. మూర్ఛ, పక్షవాతము వంటి వాటిలో మంచి ఔషధముగా పని చేస్తుంది.

ఇలా ఈ స్వామి పూజలో వాడే ప్రతి ఆకుకు ఎంతో వైద్యపరమైన ప్రాధాన్యత ఉంది. ఇవన్నీ అర్ధం చేసుకుని మన సంస్కృతి. సంప్రదాయాలను గౌరవిస్తూ ఆ స్వామిని పూజించి తరిద్దాము.