Read more!

ఇదిగో కనరా ... వేమన గుడి

 

ఇదిగో కనరా ... వేమన గుడి!!



విశ్వదాభిరామ వినురవేమ

ఆయన పద్యాలు చదువుకోని తెలుగు విద్యార్థి ఉండరు. అప్పట్లో చదువురాని వారికి కూడా అలవోకగా ఆయన పద్యాలు కంఠస్తం. ఎన్నో జీవనసత్యాలను పద్యాలుగా మనకందించిన యోగి "వేమన". వందల ఏళ్ల నాడే అన్నిమతాల డాంబికాచారాలనూ, మూఢనమ్మకాలనూ కడిగిపారేసిన  యోగులు కలకలాం పూజ్యనీయులే. అలాంటి యోగికి గుడికట్టి ఆరాధిస్తున్న ఊరి గురించి తెలుసుకుందాం. 

 



 అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లి వాసులు ‘వేమన గుడి’ నిర్మించారు. 1789 ప్రాంతంలో ఆయన తమ ఊరిలోనే జీవ సమాధి అయ్యారన్నది అక్కడివారి విశ్వాసం. దీనిపై చాలా అభ్యంతరాలున్నప్పటికీ,  ఆ ఊరిజనం మాత్రం వేమనకు గుడి కట్టి ఆరాధిస్తున్నారు ఇది యదార్థం. వేమన తమ ఊరిలో జీవసమాధి పొందడం ఇక్కడి వారు గౌరవంగా భావిస్తుంటారు. అందుకే  కటారుపల్లిలో దాదాపుగా ప్రతీ ఇంటిలో ఒక్కరికైనా వేమన పేరు పెట్టుకొని అభిమానాన్ని చాటుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని భవన ప్రాకారాలపై 150కు పైగా వేమన పద్యాలు చెక్కారు. వాటిలో మనకు తెలియని  చాలా పద్యాలూ ఉంటాయి.

 ఇక్కడిలాగే కదిరికి 13కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం నల్లచెరువులో కూడా వేమనకు ఒక ఆలయం ఉంది. కటారుపల్లిలో సజీవ సమాధి అయిన తరువాత లేచి ఆయన ఇక్కడికి వెళ్లినట్లు నమ్మకం. అందుకే అక్కడ గుడి కట్టినట్టు చెబుతారు.  బెంగుళూరుకు చెందిన నారాయణ రెడ్డి  వేమన తత్వం, వేమన భావాలు ప్రజలకు దగ్గర చేయటానికి  ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా బెంగళూరులో,  అలాగే కటారుపల్లి గ్రామంలో కూడా ‘యోగివేమన ఆశ్రమం‘ నిర్మించారు. దీనికి ‘విశ్వవేమన కొండ’ అని నామకరణం చేశారు. వేమన జీవిత చరిత్ర పుస్తకాలు, పద్యాల సీడీలను ఇక్కడి లైబ్రరీలో అందుబాటులో ఉంచారు.

 



  వేమన గుడికి సమీపాన ఉన్న ప్రపంచ ప్రసిద్ద తిమ్మమ్మ మర్రిమానును చూట్టానికి సందర్శకులు వస్తుంటారు. కదిరి శ్రీ లక్ష్మీనరసింహుని దర్శించుకోవడానికీ, పుట్టపర్తికీ వచ్చే భక్తులూ పర్యాటకులూ ఇక్కడికీ వస్తున్నారు. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఈ  ఊరిపై దృష్టి సారించింది. 2కోట్ల రూపాయలతో కటారుపల్లిలో కాలేజీ, హోటల్, పార్క్ నిర్మాణాలు పూర్తి చేసింది.

   ఈ ఆలయానికి నిత్యం అనంతపురం కర్నూలు, కడప, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆదివారం,  మంగళవారం వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతీ యేడాది ఎరామనవమి సమయంలో మూడు రోజుల పాటు వేమన తిరునాళ్లు వైభవంగా సాగుతాయి. ఉట్ల ఉత్సవానికి పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతారు. వసతి, విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేస్తే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.