చారుమతికి కలలో కనిపించి వర అభయం ఇచ్చిన వరలక్ష్మీ దేవి కథ..!

 

చారుమతికి కలలో కనిపించి వర అభయం ఇచ్చిన వరలక్ష్మీ దేవి కథ..!


వరలక్ష్మీ వ్రతం పేరులోనే వరాల జల్లు కురిపించే దేవత వ్రతం అని స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే వరాల జల్లు కురిపించే వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరు ఎవరికి చెప్పారు? వరలక్ష్మీ వ్రతాన్ని తొలిసారిగా ఎవరు చేసుకున్నారు? ఈ వ్రతం శక్తి ఏమిటి? ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవచ్చు? తెలుసుకుంటే..

పూర్వకాలంలో మగధ అనే దేశం ఉండేది. ఆ దేశంలో కుండినం అనే పట్టణం కూడా ఉండేది.  ఆ పట్టణం బంగారు గోడలతోనూ.. బంగారు గోపురాలతోనూ ఎంతో అందంగా, అద్భుతంగా ఉండేది. ఆ కుండినంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె చాలా గుణవంతురాలు.  అందరి పట్ల ఆదరంతో, ఇంటివారి పట్ల ప్రేమతో, గౌరవ మర్యాదలతో ఉండేది. కోడలిగా తన భాద్యతను ఎంతో చక్కగా నిర్వర్తించేది.  భర్తను చక్కగా చూసుకుంటూ,  అత్తమామలకు సేవలు చేస్తూ ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకునేది. అంత సుగుణవతియైన చారుమతికి ఒక రాత్రి కలలో వరలక్ష్మీ దేవి కనిపించింది.  శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసుకో.. నువ్వు కోరిన వరాలు అన్నీ ఇస్తాను అని అభయం ఇచ్చింది.

చారుమతికి వెంటనే మెలకువ రాగా.. తనకు వరలక్ష్మీ దేవి కలలో కనిపించి అభయం ఇచ్చిన విషయం తలచుకుని ఎంతో సంతోషించింది.  వెంటనే ఆ విషయాన్ని అత్తమామలకు, భర్తకు చెప్పింది.  వారందరూ చారుమతిని వ్రతం చేసుకోమని ప్రోత్సహించారు.  చారుమతికి వచ్చిన కల గురించి కుండినం లోని మహిళలకు తెలిసింది.  వారు కూడా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వ్రతం చేసుకోవడానికి ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు.

శ్రావణ శుక్రవారం రోజున కుండినంలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తల స్నానం చేసి, పట్టు వస్త్రాలు ధరించి, చారుమతి ఇంటికి వెళ్లారు. చారుమతి తన ఇంట్లో ఒక మంటపం ఏర్పాటు చేసి, ఆ మంటపం పైన బియ్యం పోసి ఐదు రకాల పత్రాలైన రావి, జువ్వి,  మర్రి,  మామిడి,  ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీ దేవిని మంత్రోచ్ఛారణతో ఆహ్వానించి ప్రతిష్టించి, షోడశోపచారాలతో పూజ చేసి,  పంచ భక్ష్య భోజ్యాలను నివేదించి తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణలు చేసి వరలక్ష్మీ దేవిని కొనియాడారు.

చారుమతితో పాటు స్త్రీలు అందరూ అలా మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు ఘల్లుఘల్లుమని మోగాయట, రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరిశాయట.  మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణబూషితులు అయ్యారట.  వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా అందరికీ ధన, కనక,  వస్తు,  వాహానాలు చేకూరాయట. తమకు అంతటి భాగ్యం కలగడానికి కారణం చారుమతికి వరలక్ష్మీ దేవి కలలో కనిపించి చెప్పడమేనని,  చారుమతి ఎంతో అదృష్టవంతురాలని పట్టణ స్త్రీలందరూ చారుమతిని కొనియాడారు.  అప్పటి నుండి ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి ముందురోజు వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.

ఈ కథను పురాణ పద్దతిలో సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ దేవికి ఉపదేశించారు.

                                 *రూపశ్రీ.