మంగళ గౌరీ వ్రతం.. మొదటివారం పూజ ఇలా చేసుకోండి..!

 


మంగళ గౌరీ వ్రతం.. మొదటివారం పూజ ఇలా చేసుకోండి..!


మంగళవారం,  శుక్రవారం అంటే సాధారణంగానే అమ్మవారి ఆరాధనకు ఎంతో ప్రత్యేకత అని చెబుతారు.  ఇక ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలకు కొదవ లేదు. కొత్తగా  పెళ్లైన స్త్రీలు శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన వ్రతాలలో మంగళ గౌరీ వ్రతం కూడా ఒకటి. ఇది కేవలం ఒక్కరోజుతో పూర్తయ్యేది కాదు.. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళ వారాలు ఈ వ్రతాన్ని తప్పక చేసుకుంటారు. స్త్రీ మాంగళ్యాన్ని గౌరీ దేవి స్వరూపంగా భావిస్తారు. అలాంటి మాంగళ్యం పదికాలాల పాటు  పచ్చగా ఉండాలని కోరుకుంటూ మంగళ స్వరూపిణి అయిన గౌరీ దేవిని మంగళ గౌరిగా పూజిస్తారు.

శ్రావణ మాసంలో మొదటి మంగళ గౌరీ పూజ జూలై 29 తేదీన చేసుకుంటారు.  ఈ మంగళ గౌరీ పూజ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే..

మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో జూలై 29,  ఆగష్టు 5,  19, 12 తేదీలలో చేసుకుంటారు. ఈ తేదీలు మంగళవారం కనుక ఈ రోజుల్లో చేసుకుంటారు. ప్రతి మంగళవారం పూజను ఉదయం 7 గంటల నుండి 9 లేదా 10 గంటలలోపు పూర్తీ చేసుకోవడం మంచిది.  మంగళ గౌరీ వ్రతాన్ని పార్వతీ దేవిని ప్రార్థిస్తూ చేసుకునే నోము. ముఖ్యంగా కొత్తగా వివాహం అయిన మహిళలు,  పెళ్లైన మొదటి 5 సంవత్సరాలు తప్పకుండా చేసుకుంటే కలకాలం సుమంగళిగా ఉంటారని ప్రతీతి.

వ్రతం ఎలా చేసుకోవాలి?

సాధారణంగా మహిళలు చేసుకునే ప్రతి వ్రతానికి కొన్ని పనులు ఒకే విధంగా ఉంటాయి.  అవే ఉదయాన్నే నిద్ర లేవడం, ఇల్లు, దేవుడి గది శుభ్రం చేసుకోవడం, తలస్నానం ఆచరించడం, వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవడం. ఇవన్నీ చేసుకున్న తరువాత వ్రతాన్ని ఆచరించాలి.

మొదట పసుపు గణపతికి పూజ చేయాలి.  వినాయకుడికి షోడశోపచార పూజ చేసి వినాయకుడిని ఆవాహన చేసి వ్రతంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేలా ప్రార్థించాలి. నైవేద్యంగా కనీసం బెల్లం ముక్క అయినా పెట్టవచ్చు.

గణపతి పూజ అయిన తరువాత పచ్చిగా ఉన్న నూలు దారంతో తోరాలు తయారు  చేసుకుని మంగళ గౌరీ వ్రత పూజ ప్రారంభించాలి.

శివపార్వతుల చిత్రపటం లేదా పార్వతీ దేవి చిత్రపటం పూజకు ఉపయోగించాలి. పటాన్నిపసుపు, కుంకుమ,  గంధం,  పువ్వులు, అక్షింతలు లతో అలంకరించాలి. ఆ తరువాత ఆచమనం పాటించి,  వ్రత విధానం ప్రకారం  వ్రతాన్ని ఆచరించాలి. అష్టోత్తర శతనామ పూజ,  పుష్పార్చన చేసి నైవేద్యం సమర్పించి,  తరువాత కొబ్బరికాయ కొట్టి నీరాజనం ఇవ్వాలి.  వ్రతం అనంతరం మంగళ గౌరీ వ్రత కథను పఠించాలి.  వ్రతం ఆచరించేటప్పుడు  బియ్యం పిండితో దీపాలు తయారు చేసి, అందులో ఒత్తులు వేసి నెయ్యితో దీపాలు వెలిగించాలి. వెలుగుతున్న దీపాల మీద అట్లకాడ లేదా కత్తిని ఉంచాలి.  ఇలా కాలిన కత్తి మీద నల్లగా చేరిన మసి మీద ఒక్క చుక్క ఆవు నెయ్యి వేసి దాన్ని కాటుకలాగా అమ్మవారికి పెట్టి పూజ చేసుకున్న మహిళలు,  తాంబూలం తోసుకోవడానికి వచ్చిన ముత్తైదువలు పెట్టుకోవాలి. అనంతరం ముత్తైదులను మంగళ గౌరీ స్వరూపంగా భావించి వారికి వాయన తాంబూలాలు ఇవ్వాలి.  ఇలా మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలోని అన్ని మంగళ వారాలు చేసుకోవాలి. ఇలా 5ఏళ్లు తప్పనిసరిగా చేసుకుంటే దీర్ఘసుమంగళి యోగం,  సుఖ సంతోషాలతో పాటు శుభ ఫలితాలు కూడా ఉంటాయి.

                          *రూపశ్రీ.