భారతదేశంలో కలిమాయ అంటని ప్రదేశం గురించి తెలుసా!
భారతదేశంలో కలిమాయ అంటని ప్రదేశం గురించి తెలుసా!
నాలుగు యుగాలలో కలియుగం చివరిది, కలియుగం కాలవ్యవధి దీనికి ముందు జరిగిన మూడు యుగాలలోకెల్లా అతి తక్కువ కాలంగా పరిగణించబడుతుంది. వేదాలు , పురాణాల ప్రకారం, కలియుగంలో అధిక స్థాయిలో అధర్మం, దురాశ, హింస , అజ్ఞానం మొదలైనవి ఉంటాయి. వీటి కారణంగా మానవుడు చెయ్యకూడని పనులు, దుర్మార్గాలు, దారుణాలు చేస్తూ ఉంటాడు. ఇదంతా కలి మాయ అని చెబుతారు. ఈ సృష్టిలో ప్రతి జీవికి కలి మాయ తప్పదు అని కూడా చెబుతారు. కానీ కలిమాయ అంటని ప్రదేశం ఒకటుంది. ఈ ప్రదేశంలో కలి ఇంకా ప్రవేశించలేదని చెబుతున్నారు. అసలు ఆ ప్రదేశం ఏంటి? ఆ ప్రదేశంలో కలి ప్రవేశించకపోవడం వెనుక కారణం ఏంటి? తెలుసుకుంటే..
నైమిశారణ్యం..
నైమిశారణ్యం ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో గోమతి నది ఒడ్డున ఉన్న ఒక పుణ్యక్షేత్రం. పురాణాల ప్రకారం, ఇది కలియుగం ఇంకా ప్రవేశించని ప్రదేశమని నమ్ముతారు. అంటే, ఈ ప్రదేశం కలియుగ ప్రభావాలకు లోను కాలేదు.
నైమిశారణ్యం పై కలి ప్రభావం ఎందుకు లేదు?
ఒక కథనం ప్రకారం మహాభారత యుద్ధం తరువాత, కలియుగం రాబోతోందన్న ఆందోళనతో ఋషులు, సాధువులు కలియుగం గురించి చాలా కలత చెందారు. కలియుగ ప్రభావాల నుండి విముక్తి పొందిన ప్రదేశం కోసం వారు బ్రహ్మదేవుడిని సహాయం కోరారు. దీనికి పరిష్కారంగా బ్రహ్మదేవుడు తన "మనోమయ చక్రాన్ని" ప్రయోగించి, ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో ఆ ప్రదేశం కలియుగ ప్రభావాల నుండి విముక్తి పొందుతుందని ప్రకటించాడు. బ్రహ్మ మనోమయ చక్రం నైమిశారణ్య వనంలో ఆగింది. దీంతో ఋషులు, సాధువులు ఆ ప్రదేశాన్ని తమ తపస్సు స్థలంగా చేసుకున్నారు.
నైమిశారణ్య ప్రాముఖ్యత..
మహాభారతంతో సహా అనేక ప్రాచీన గ్రంథాలు నైమిశారణ్యాన్ని ఒక దట్టమైన అడవిగా పేర్కొన్నాయి, ఇది అత్యంత పవిత్రమైనదిగా, అన్ని హిందూ పుణ్యక్షేత్రాలలో మొదటిదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం బ్రహ్మ, విష్ణు, సతీదేవి , శివునితో ముడిపడి ఉంది. ఇది 33 కోట్ల మంది దేవతలు , దేవతల నివాసంగా కూడా పరిగణించబడుతుంది, చార్ ధామ్ యాత్రలో నైమిశారణ్యాన్ని సందర్శిస్తే యాత్ర సంపూర్ణమైనట్టు భావిస్తారు.
బ్రహ్మలోక ప్రాప్తి..
నైమిశారణ్యంలో 12 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మలోకాన్ని పొందుతారని అంటారు. ఫాల్గుణ అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే 84 కోసుల పరిక్రమకు నైమిశారణ్యం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన ప్రదేశాలలో చక్రతీర్థ, వ్యాస గడీ , హనుమాన్ గఢీ, లలితా దేవి ఆలయం , సీతా కుండ్, పంచ ప్రయాగ, సూత గఢీ.. మొదలైనవి ఉన్నాయి.
నైమిశారణ్యంలో జరిగిన ప్రసిద్ధ సంఘటనలు..
ఈ ప్రదేశంలో 88 వేల మంది ఋషులు తపస్సు చేశారు, అందుకే దీనిని తపోభూమి అని కూడా పిలుస్తారు..
శ్రీరాముడు ఈ ప్రదేశంలో అశ్వమేధ యజ్ఞాన్ని పూర్తి చేశాడు.
బ్రహ్మదేవుని చక్రం ఈ ప్రదేశంలో పడిందని నమ్ముతారు.
ఈ ప్రదేశంలోనే దధీచి మహర్షి ప్రజల సంక్షేమం కోసం దేవతల రాజైన ఇంద్రునికి తన ఎముకలను దానం చేశారు.
*రూపశ్రీ.