Read more!

జ్ఞానం కలిగితే ఏమి జరుగుతుంది??

 

జ్ఞానం కలిగితే ఏమి జరుగుతుంది?? 


జ్ఞానం కలిగితే ఏం జరుగుతుంది అంటే గచ్ఛన్త పునరావృత్తం అంటే పునరావృత్తి కలుగదు. మరు జన్మ ఉండదు అని అర్థం. అటువంటి స్థితి ఎవరికి కలుగుతుంది అంటే మనసులో కల్మషం లేని వారికి, పాపములు నశించిన వారికి, అజ్ఞానము, అవిద్య లేని వారికి, కల్మషం ఎలా పోతుంది అంటే జ్ఞానం కలిగితే నశిస్తుంది. జీవునిలో పాపము మాలిన్యము ఉన్నంతవరకు ఆత్మజ్ఞానము కలుగదు. దానికి కావాలిసింది నిరంతర భగవంతుని చింతన, ఆత్మనిష్ట, ఆత్మను నమ్ముకోవడం.


ఇవన్నీ కావాలంటే సోమరి తనం ఉండకూడదు. నిరంతర సాధన, దానికి ప్రయత్నం అవసరం. మనం అశాశ్వతములైన ప్రాపంచిక వస్తువులను సంపాదించడం కోసరం రేయింబవళ్లు కష్టపడుతున్నాము. ఆ శ్రమలో సగం ఆత్మజ్ఞానం సంపాదించడంలో పెడితే శాశ్వత సుఖం లభిస్తుంది. అటువంటి శాశ్వత సుఖం కోసరం, శాంతి కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు. దీనికి పెద్దగా శ్రమపడనవసరం లేదు. మనం ప్రాపంచిక విషయములలో చూపే శక్తి, యుక్తి, బలము, నిష్ట, అటు నుండి ఇటు అంటే ఆత్మవైపుకు తిప్పితే చాలు జ్ఞానం వస్తుంది. మోక్షం వస్తుంది. కాబట్టి ఈ రోజునుండి ఆత్మయందు ప్రేమ, శ్రద్ధ, తదేక నిష్ట కలిగి ఆత్మజ్ఞానము సంపాదించమని భగవద్గీతలో కృష్ణుడు తెలియజేస్తాడు. 


తత్పరాయణా తత్పరత అంటే ఆత్మయందు కమిట్మెంట్. నేను ఈ శరీరం కాదు నేను ఆత్మస్వరూపుడను అనే భావన కలిగి ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా మనసులో పరమాత్మ గురించిన ధ్యానము, స్మరణ మరిచిపోకూడదు. ఎందుకంటే ప్రాపంచిక విషయాలలో దుఃఖం తప్ప సుఖం లేదు. పరమాత్మ యందు నిష్ట కలిగి ఉంటే సుఖమే సుఖము దుఃఖమునకు తావు ఉండదు.


తద్బుద్ధయః అంటే కేవలం పరమాత్మయందు కమిట్ మెంట్ ఉంటే సరిపోదు. ఆ కమిట్మెంట్ కార్యరూపం దాల్చాలి. భగవద్గీత చదవాలి అని గాఢమైన కోరిక ఉంటే సరిపోదు. ఆ పుస్తకం కొనాలి. 701 శ్లోకాలు పూర్తిగా చదవాలి. అప్పుడే కోరిక కార్యరూపం దాలుస్తుంది. అంటే మన సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టాలి అనే బుద్ధికూడా ఉండాలి. 


తదాత్మానః అంటే ఇక్కడ ఆత్మ అంటే మనసు. అంటే కేవలం చదివితే సరిపోదు. దాని మీద మనసు లగ్నం చేయాలి. చాలా మంది పైపైన చదువుతారు. మనసుపెట్టి చదవరు అందుకే అది అర్థంకాదు. శాస్త్రము అర్థం అయిందీ అంటే నేను వేరు ఈ శరీరం వేరు అనే భావన కలగాలి. నేనే ఈ శరీరము అనే భావన మనకు పూర్వజన్మవాసనల నుండి సంక్రమించింది. దానిని పోగొట్టుకోవాలంటే శాస్త్రమును మనసు పెట్టి శ్రద్ధతో అధ్యయనం చేయాలి. చదివిన దానిని మనసు పెట్టి ఆచరించాలి.


తన్నిష్టా: అంటే కేవలం శాస్త్రజ్ఞానం ఉంటే సరిపోదు. దాని మీద నిష్ఠ కలిగి ఉండాలి. దానిని పరిపూర్ణంగా నమ్మాలి. దానిని సర్వకాల సర్వావస్థలయందు అనుసరించాలి. ఆచరించాలి. అందులో లీనం అవ్వాలి. తాదాత్మ్యం చెందాలి. మనకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆ జ్ఞాననిష్టలో ఉండాలి. సుఖదుఃఖాలను సమంగా చూడగలగాలి. అటువంటి వారి జ్ఞానముతో మనిషిలో ఉన్న రాగద్వేషములు అనే కల్మషములన్నీ దూది పింజల వలె ఎగురగొట్టబడతాయి. అప్పుడు అతడు జీవన్ముక్తుడు అవుతాడు. జనన మరణ చక్రం నుండి విడివడతాడు.


                                    ◆వెంకటేష్ పువ్వాడ.