Read more!

ఆశ్చర్యపరిచే అనసూయ గొప్పదనం!!

 

ఆశ్చర్యపరిచే అనసూయ గొప్పదనం!!

రామాయణంలో సీతా రామలక్ష్మణులు ఒరణం చేస్తూనే ఉంటారు. భరతుడు అడవులలోకి వెళ్లి రాముడిని కలుసుకుని తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించమంటే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా రానని చెబుతాడు. ఇక చేసేది లేక వశిష్ట ముని బంగారు పాదుకలు రాముడి ముందు పెట్టించి రాముడిని ఒకసారి ఆ పాదుకలలో నిలబడమంటాడు. రాముడు నిలబడ్డాక ఆ పాదుకలు తలమీద పెట్టుకుని అయోధ్యకు వెళతాడు. ఇక అక్కడ ఉండటం వద్దని రాముడు సీతను, లక్ష్మణుడిని తీసుకుని అక్కడి నుండి ప్రయాణం అవుతాడు. 

అలా కొంత దూరం ప్రయాణించాక వాళ్లు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి "నా భార్య పేరు అనసూయ (కర్దమ ప్రజాపతి - దేవహుతిల కుమార్తె). ఆమె చాలా వృద్ధురాలు, ఆవిడ ఒకసారి దేవతల కోసం 10 రాత్రులని కలిపి ఒక రాత్రి చేసింది. దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే, ఎండిపోయిన గంగా నదిని తన తపఃశక్తితో ప్రవహించేటట్టు చేసింది. ప్రజలందరికి అన్నం పెట్టింది. ఆమె పదివేల సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేసింది. సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. రామ! సీతమ్మని ఒకసారి అనసూయ చూస్తుంది. కాబట్టి ఆమె దగ్గరికి ఒకసారి పంపించు" అని అన్నాడు.

రాముడు సీతను అనసూయ దగ్గరకు వెళ్ళమన్నాడు. పర్ణశాలలో ఉన్న అనసూయ దగ్గరకు వెళ్ళింది సీత. తన దగ్గరికి వచ్చిన సీతమ్మని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని అనసూయ ఇలా చెప్పింది. "సీతా! నువ్వు మహా పతివ్రతవని, భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు. హీనుడే కావచ్చు, పతితుడే కావచ్చు. గుణములు లేనివాడు కావచ్చు, కాని స్త్రీకి పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను. నీ అభిప్రాయం కూడా చెప్పు" అని అడిగింది.

అప్పుడు సీతమ్మ "నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు. పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా ఈ మాటే చెప్పారు, అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాట చెప్పింది, అరణ్యాలకి బయలుదేరేముందు కూడా కౌసల్య ఈ మాట చెప్పింది. కాని నా అదృష్టం ఏంటంటే, అమ్మ, నాన్న, సోదరులు, గురువు ఎలా ప్రేమిస్తారో, నా భర్త నన్ను అలా ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలిసున్నవాడు, జితేంద్రియుడు. ఇటువంటి భర్త లభిస్తే, అతనిని ప్రేమించడంలో గొప్ప ఏముందమ్మ, అతనితో ఇలా రావడంతో తప్పు ఏముందమ్మా!!" అని పలికింది.

సీతమ్మ మాటలకి ఎంతో సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ "సీతా! నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను. ఇవి ఎప్పుడూ నలగవు, కొన్ని పువ్వులు ఇస్తున్నాను. ఇవి ఎప్పుడూ వాడవు, అంగరాగములు(సుగంధ ద్రవ్యాలు) ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాసన తగ్గవు. ఇవి నువ్వు పెట్టుకుంటే, నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహా విష్ణువుని సంతోషపెట్టినట్టు, నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనబడు" అని పలికింది. అప్పుడు సీతమ్మ అవన్నీ కట్టుకొని, అత్రికి, అనసూయకి నమస్కారం చేసి రాముడి దగ్గరికి వెళ్ళింది. రాముడు సీతని చూసి "సీతా! ఎవ్వరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు" అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు. అనసూయ గొప్పదనాన్ని పదేపదే తలచుకున్నాడు.

◆వెంకటేష్ పువ్వాడ.