ఇక్కడ హనుమను పూజించడం నిషేధం.. ఎందుకంటే..!
ఇక్కడ హనుమను పూజించడం నిషేధం.. ఎందుకంటే..!
హిందూమతంలో దైవారాధనకు చాలా ప్రత్యేకత ఉంది. అంతేకాదు.. దైవ ఆరాధనకు ఎన్నో పద్దతులు, మరెందరో దేవతలు కూడా ఉన్నారు. వీరిలో హనుమంతుడు ముఖ్యమైనవాడు. హనుమను సప్త చిరంజీవులలో ఒకరిగా పేర్కొంటారు. హనుమ ఆరాధన వల్ల బుద్ధి బలం, ధైర్యం, యశస్సు, ఏ పనినైనా చేయగలిగే సామర్ధ్యం వంటివి లభిస్తాయని కూడా నమ్ముతారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ హనుమంతుడు అంటే ఒక ప్రత్యేకమైన ఆరాధనా భావం, భక్తి ఉంటాయి. సనాతన ధర్మానికి నెలవైన భారతదేశంలో ఇది కాస్త ఎక్కువే ఉంటుంది. కానీ.. భారతదేశంలో ఒక గ్రామంలో మాత్రం హనుమను ఆరాధించడం నిషేధం. ఎందుకని అక్కడ హనుమను ఆరాధించడం నిషేధించారు? దీని వెనుక కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..
ఉత్తరాఖండ్‌ను దేవభూమి అని కూడా పిలుస్తారు. అంటే దేవతల భూమి అని అర్థం. గొప్ప ఋషులు ఇక్కడి పర్వతాలు, అడవులలో తీవ్రమైన తపస్సు, యజ్ఞాలు చేశారట. దేవతలు సంచరించే నాలుగు పవిత్ర స్థలాలలో ఉత్తరాఖండ్‌లో కూడా ఉంది. ఉత్తరాఖండ్‌లో చిన్నవి, పెద్దవి అనే తేడా లేకుండా దేవతల ఆలయాలు అడుగడుగునా కనిపిస్తాయి. ఈ పవిత్రమైన ప్రాంతంలో హనుమంతుని పూజించడమే కాకుండా, ఆయన పేరును కూడా ఎవరూ ఇష్టపడని గ్రామం ఉంది.
ఉత్తరాఖండ్‌లోని ఈ గ్రామంలో హనుమంతుడిని పూజించడం నిషేధించబడింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని ఒక పర్వత గ్రామమైన ద్రోణగిరి హనుమంతుడిని పూజించడాన్ని నిషేధిచింది. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది.
రామాయణ కాలంలో రావణుడి కుమారుడు మేఘనాథుడు లక్ష్మణుడిని స్పృహ కోల్పోయేలా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు, రాముడు చాలా బాధపడ్డాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవని మూలికను తీసుకురావడానికి ద్రోణగిరి పర్వతానికి చేరుకున్నాడు. అయితే హనుమంతుడు సంజీవని మూలికను గుర్తించలేక మొత్తం పర్వతాన్ని తనతో పాటు లంకకు తీసుకువెళతాడు.
ద్రోణగిరి గ్రామ ప్రజల అభిప్రాయం ప్రకారం, హనుమంతుడు గ్రామ దేవత అనుమతి లేకుండా సంజీవని మూలికను తీసుకున్నాడట. దాని కారణంగా గ్రామస్తులకు హనుమ మీద ఎనలేని కోపం ఉందట. ద్రోణగిరి గ్రామ ప్రజలు రామ నవమి పండుగను చాలా వైభవంగా జరుపుకున్నా.. ఆ సందర్భంగా హనుమను పూజించడం కానీ, కనీసం హనమ పేరును ఉచ్చరించడం వంటివి కూడా చేయరట. ఇదీ హనుమ ఆరాధన నిషేధించడం వెనుక ఉన్న కథనం.
*రూపశ్రీ.