Read more!

రామకృష్ణ పరమహంస ప్రభావం ఆయన శిష్యుల మీద ఎలా ఉండేది?

 

రామకృష్ణ పరమహంస ప్రభావం ఆయన శిష్యుల మీద ఎలా ఉండేది?

ఆధ్యాత్మికత ఓ అద్భుతం అని చెప్పవచ్చు. ఎన్ని విషయాలు పరిశోధించినా పరిశీలించినా, పాటించినా అవన్నీ మనిషి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడేవే కానీ మనిషికి మానసిక అభివృద్ధికి దోహదపడేది, మనిషిలో జ్ఞాన జ్యోతిని వెలిగించేది మాత్రం ఆధ్యాత్మిక మార్గమే.. ఈ మార్గంలో మనిషి ప్రపంచాన్ని చూస్తూ తనలో తాను ప్రయాణిస్తూ తనని తాను తెలుసుకుంటాడు. ఈ ఆధ్యాత్మికతను వ్యాప్తం చేయాలని చూసినవారిలో స్వామి వివేకానంద పేర్కొనదగినవారు. పరదేశాల్లో సైతం భారతీయ హిందూ ధర్మం గొప్పతనం గురించి ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పగలిగిన ధీరుడు ఆయన. ఈయనను శిష్యుడిగా చేసుకున్నవారు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస శిష్యులలో ఎందరో గొప్పవారు ఉన్నారు. 

నిజమైన గురువు, శిష్యుడిలో నిద్రాణంగా ఉన్న పవిత్రకాంక్షను క్షణంలో ప్రకాశింపజేయగలడు. తనలో అలాంటి దివ్యప్రేమనూ, శక్తినీ ఆరనిజ్యోతిలా ప్రజ్వలింప జేసుకున్న గురువరేణ్యులు శ్రీరామకృష్ణ పరమహంస. సురేశ్చంద్ర సంప్రదాయపరంగా సన్న్యాసాన్ని స్వీకరించక పోయినా, ఆధ్యాత్మిక పరాకాష్ఠతో పవిత్రత, నిజాయతీ, నిస్వార్థం, నిస్సంగత్వం, వివేకవైరాగ్యాలు అలవరచుకున్న సుగుణసంపన్నుడు. అతనికి పనే దైవం. పూజనీయం. పునరావాస కార్యక్రమాల్లో స్వామి అఖండానందజీ మహరాజు సహకరించేందుకు సురేశ్చంద్ర కొన్నాళ్ళు బెరహమూర్లో ఉన్నాడు. శ్రీరామకృష్ణుల పట్ల సురేశ్ కనబరచే భక్తిప్రపత్తులకు స్వామి అఖండానంద అబ్బుర పడేవారు. సురేశ్ జీవితంలో చోటు చేసుకున్న ఒక అపురూప ఘట్టం ఆయనకు 'గురుమహరాజ్'పై ఉన్న శ్రద్ధకు అద్దం పడుతుంది.

స్వామి వివేకానంద 1897 మే నెలలో శరత్చంద్ర చక్రవర్తికి మంత్రదీక్ష ప్రసాదించారు. ఆ సందర్భంలో శరత్చంద్ర, శ్రీరామకృష్ణులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు ఆచరించదలిచాడు. శరత్చంద్ర అంత ప్రాతః కాలాన్నే పూజాద్రవ్యాలను సమీకరించి, పూజకు ఏర్పాట్లు చేయగలడా? అన్న సందేహం కలిగి, స్వామీజీ అంత ఆసక్తి కనబరచలేదు. విషయం తెలుసుకున్న సురేశ్ ఆలమ్బజార్లోని మఠానికి కలకత్తా నుంచి పూజాసామగ్రి తీసుకువచ్చే బాధ్యతను తను స్వీకరించాడు.

మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకే సురేశ్, శరత్చంద్రను తీసుకొని కలకత్తా అంగడికి వెళ్ళాడు. కావలసిన సామగ్రిని కొని శరతన్ ను ఒక్కడినే సామాగ్రితో పంపించి, తను మాత్రం ఒంటరిగా కాలినడకన బయలు దేరాడు. శరత్ ఆశ్చర్యంగా, 'ఎందుకు వెంట నీవు రావడం లేదు?' అని అడిగాడు. అప్పుడు సురేశ్ 'నేను అలా బండి మీద రాలేను. నేను గురుమహరాజ్ కి ఇష్టమైన తియ్యని పెరుగును కుండలో తీసుకువస్తూ, ఇలా బండిలో క వస్తే, ఆ బండి కుదుపులకు పెరుగు ఒలికిపోతుంది. కాబట్టి నేను జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తాను. ఈ పెరుగును పూజా సమయానికి ఎలాగైనా తీసుకువచ్చి, గురుమహరాజ్ కు సమర్పించుకుంటాను' అన్నాడు.

శరచ్చంద్ర ఇతర పూజాసామగ్రితో అనుకున్న సమయానికి పూజామందిరానికి చేరుకున్నాడు. అలా ఆయన అనుకున్న సమయానికే ప్రత్యక్షమయ్యేసరికి స్వామి వివేకానంద ఆశ్చర్యపోయారు. ఇదంతా శరత్ వల్ల కాదని తెలిసి స్వామీజీ అసలు విషయమేంటని అడిగారు. సురేశ్ వల్లే ఇదంతా సాధ్యపడిందని తెలుసు కొని, ‘మరి సురేశ్ ఎక్కడ?' అని అడిగారు. శరత్ జరిగిన విషయమంతా చెప్పాడు. సురేశ్ కాలినడకన పెరుగు కుండతో వస్తున్నాడని తెలుసుకున్న స్వామీజీ కళ్ళ వెంట ఆనందబాష్పాలు రాల్చుతూ "ఆ గురువరేణ్యులు ఎవరినైతే స్పృశిస్తారో వారు స్వర్ణతుల్యులవుతారు. ఆ దివ్యస్పర్శకు ఉన్న మాహాత్మ్యం అలాంటిది" అన్నారు.

ఇలా రామకృష్ణ పరమహంస ప్రభావం ఆయన శిష్యులపై ఎన్నో విధాలుగా ఉండేది.

                                    ◆నిశ్శబ్ద.