Read more!

పాప పుణ్యాల గురించి సరైన అర్థం చెప్పే శ్లోకం!

 

పాప పుణ్యాల గురించి సరైన అర్థం చెప్పే శ్లోకం!

ఓం కృతంమే దక్షిణే హస్తే జయో మే సవ్యఆహితః గోజిద్ భూయాస మశ్వజిద్ ధనంజయో హిరణ్యజిత్ 

మానవుడు పరాక్రమంతో సంపదలు పొంది సుఖంగా జీవించాలని ఈ మంత్రాభిప్రాయం. అంతేకాదు నా కుడిచేతిలో పురుషార్ధ ముంది, ఎడమ చేతిలో విజయ రహస్యముందనే కూడా తెలియ చేస్తుంది. సత్యాన్ని కూడా ఈ మంత్రార్థం తెలియజేస్తుంది.

పుణ్యేన పుణ్యం లోకం 

నయతి పాపేన పాపం 

ఉబాభ్యాంమనుష్యలోకం

మంచి ఫలం పుణ్య రూపంలోను, చెడు ఫలం పాపరూపంలో ఉంటుంది. శరీరాన్ని ఆశ్రయించి కుడి ఎడమలున్నట్లే. కార్యాన్నాశ్రయించి ఫలం ఉంటుంది. మంచి పనులు చేసిన పుణ్యం వల్లే డబ్బు, ఐశ్వర్యం, హోదా అన్నీ లభిస్తాయి. కొన్ని పనులకు ఫలం వెంటనే లభిస్తుంది. మరికొన్నింటికి ఫలం తరువాత లభిస్తుంది. ఉదాహరణకు రైతు భూమిలో విత్తనం నాటిన రోజే పంట లభించదు. దానికి సమయం పడుతుంది. నిప్పుపైన చేయి పెట్టామంటే వెంటనే కాలుతుంది. దీనికి ఫలం వెంటనే బాధ రూపంలో అనుభవమవుతుంది.

భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునునకు కర్మ చేయడానికే నీకు అధికారముంది. ఫలం మాత్రం పరమాత్ముని అధీనంలో ఉందని బోధిస్తారు. ఆ ఫలం ఈ జన్మలోనైనా అనుభవించవచ్చు. లేక తరువాత జన్మలోనైనా అనుభవించవచ్చు, దీనిని నిర్ణయించేది సృష్టి కర్త పరమాత్ముడని కృష్ణ భగవానుడు అంటారు.

ఈ వేద మంత్రం మరొక సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. నేను కుడిచేతితో పనిచేస్తుంటే, ఎడమ చేతిలోకి వెంటనే ఫలం వస్తుందని అంటుంది.

"అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభా శుభమ్” 

కర్మలకు అనుకూలంగానే ఫలితాలను పొందుతామని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మానవులు ధర్మ కర్మలు ఆచరించకపోతే జీవితం సుఖమయం కాదు.

సాధారణ మానవులు సంపూర్ణంగా ఫలాన్ని త్యాగం చేయలేరు. వారు పూర్ణజ్ఞానులు కారు. కేవలం లోకహిత భావనతోనే సత్కర్మలు ఆచరిస్తారు. వారి విషయంలో అదే ఉత్తమమని విద్వాంసుల అభిప్రాయం. కానీ పూర్ణజ్ఞానులు ఆత్మస్వరూపం తెలుసుకొని, భగవత్ సాక్షాత్కారం పొందాలనీ అదే వారి జీవిత ధ్యేయమని వేద ఋషులు అంటున్నారు. ఈ వేద మంత్రంలో చెప్పబడిన పురుషార్థమే కర్మ. ఏ కర్మైనా ఫలాపేక్షతో చేస్తే అది ప్రశంసనీయం కాదు. ఫలాపేక్షతో చేసే కర్మ స్వార్థమవుతుంది. 

మానవులకు అన్నిటి కంటే మృత్యు భయం ఎక్కువ. దానినుండి తప్పించుకోవడమే మానవ జీవిత లక్ష్యం. అందుకే మానవుడు సాధించాల్సిన చతుర్విధ పురుషార్థాలలో (ధర్మ, అర్థ, కామ, మోక్షాలు) అంతిమ పురుషార్థం మోక్షం. దీనినే మృత్యువు తప్పించుకోవడమని శాస్త్రాలు వివరిస్తున్నాయి. నుండి

మానవుడు భయంకరమైన ఈ మరణ దుఃఖం నుండి తప్పించుకోవాలంటే నిశ్చితమనస్కుడై వుండాలి. భోగాసక్తుడు కాకూడదు. మానవుడు కోరికలను విడిచి సుఖ దుఃఖాలలో ఏకరసుడై స్థితప్రజ్ఞుడు కావాలి. అప్పుడు రాగం, భయం, క్రోధం అతనికి ఉండవు. శుభా శుభాలలో లిప్తుడుకాడు. ఇంద్రియాలను జయిస్తాడు. అసూయ, ద్వేషాలను అధిగమిస్తాడు. స్థితప్రజ్ఞునకు విశేష లక్షణాలుంటాయి. సాధన వలన మనస్సు స్థిరమై ప్రసన్నమవుతుంది. అదే యోగధర్మం.

                                           ◆నిశ్శబ్ద.