Read more!

ధ్యానం గురించి ఓ రహస్యం!

 

ధ్యానం గురించి ఓ రహస్యం!

యోగం ఎందుకు చేయడం? టైం వేస్టు  అనేవారికి చెప్పేది ఏమీ లేదు. ఎలా చేయాలి? అన్నవారికి మార్గం చూపించవచ్చు. యోగానికైనా కొన్ని నిబంధనలు ఉంటాయి గానీ ధ్యానానికి అస్సలు నిబంధనల్లేవు. ఒక గురువు అవసరం లేదు. ఒక మంత్రం అవసరం లేదు. కళ్లు మూసుకుని కూర్చుని, మనస్సును నిర్మలం చేసుకోవడం ఒక్కటే ధ్యానానికి బాట. ఆలోచనలు వచ్చినా తర్వాత సమసిపోతాయి. మనం శారీరకంగా, మానసికంగా రిలాక్స్ అయినకొద్దీ, అంటే టెన్షన్ తగ్గిన కొద్దీ ఆలోచనలు పోయి ప్రశాంతత ఏర్పడుతుంది. మనస్సు నిర్మలమవుతుంది. ఆ తర్వాత శూన్యంలో ప్రయాణమే పరమానంద దాయకమవుతుంది. ఆ శూన్యంలో సత్యాన్ని వెదకటం, పరబ్రహ్మాన్ని అనుభూతించడం లాంటివి మళ్లీ యోగంలోని భాగాలు, యోగ విభూతులు అవుతాయి. ఇక్కడ సత్యం రంగ ప్రవేశం చేస్తుంది.

ఏది సత్యం! దేనిని అన్వేషించాలి! సత్యాన్ని అన్వేషించడం ఏమిటి అసలు? మనకు తెలిసేది, అనుభూతికి అందేది మాత్రమే సత్యం అవుతుందా? అలా అనుకోవచ్చా? సత్యానికి ఏది ప్రమాణం? మనకు సత్యం అనిపించింది మాత్రమే సత్యం అవుతుందా? వీటికి ఎవరూ సమాధానం చెప్పరు చెప్పలేరు. సాక్షి 'ఆత్మ' మాత్రమే కనుక. పోనీ అదే 'ఆత్మ' అని ఎలా తెలుస్తుంది? సత్యశోధన అందరూ చేయరు? శోధించిన ఏ మహర్షి అయినా 'ఇదే సత్యం' అని చెప్పడు. జీవితానికి అన్వయిస్తాడు తన అనుభూతిని, అనుభవాన్ని, తన ఆనందాన్ని.

అసలు జరిగేది ఏమిటంటే 'సత్య స్పర్శ' వల్ల ఈ లోకంపట్ల వ్యామోహం తగ్గిపోతుంది. పరలోకం పట్ల కాకపోయినా, ఒక అరూప, అగోచర, అవ్యక్త ఆనందం పట్ల, ప్రశాంతి పట్ల చక్కని అవగాహన ఏర్పడుతుంది. అది అనుభవించిన వారు మాత్రమే చెప్పగలరు కానీ చెప్పరు! అదే ధ్యాన రహస్యం యోగానికి కీలకం!

ఏ యోగక్రియను అనుసరించకుండా, జప తపాలు లేకుండా, తీవ్రమైన సాధన లేకుండా, ఉత్తినే ధ్యానం చేస్తే కుండలినీ అనుభవం కలుగుతుందా? కుండలినీ శక్తి సహస్రారం వరకు సుషుమ్న ద్వారా చేరినప్పుడు గదా బ్రహ్మానంద స్థితి? అని అనుమానించే అవకాశం ఉంది. అసలు మనలో శూన్యం అంటూ ఉండేది మూలాధారంలోని కుండలినిలో అని అందరూ అంగీకరిస్తారు. ఆ శూన్యంలో ఉండే శక్తినే కుండలిని అంటారు. అది మూడున్నర చుట్లు చుట్టుకొని ఉంటుందని, కదిలిస్తే బుసలు కొడుతుందని అంటారు. ధ్యానంలో దానిని కదిలించనవసరం కలగదు. అది బుసలు కొట్టదు. ధ్యానంలో మనం శూన్యంలోకి వెళ్లి ఆ శూన్యాన్ని కుండలినిలోని శూన్యతో జతపరుస్తామన్నమాట. 

మనం ధ్యానంలో ఎంత లోతుకువెళ్లి ఎంతగా శూన్యం అయితే అంతగా కుండలినితో తాదాత్మ్యం చెందడం జరుగుతుంది. ధ్యాన శూన్యతను ఒక్క కుండలిని శూన్యమే భరించ గలుగుతుంది. కనుక ఏ వత్తిడి లేకుండా, ఎలాంటి ప్రతిఘటన లేకుండా మన కుండలిని చైతన్యం పొంది, శరీరం మొత్తాన్ని చైతన్య పరుస్తూ, సహస్రార కేంద్రాన్ని చేరుతుంది. ఆ తర్వాత స్థితి మామూలే, బ్రహ్మత్వం. కనుక సింపుల్ ధ్యానం వల్ల తక్కువ ఫలితం కలుగుతుందని అనుమానించకూడదు.

ఎవరి పద్ధతి వారిది. ఎవరి అన్వేషణ వారిది. చివరకు ఎవరు సత్యాన్ని తెలుసుకోగలరంటే చెప్పలేం. సత్యానికి సైతం బహుముఖాలు, వేయికోణాలు, లక్ష రూపాలు. ఎవరి ఆనందం, తృప్తి వారివి. ఎవరికి వారికే తెలుస్తుంది తాను ఎక్కడకు చేరింది? ఏ స్థితిలో ఉన్నది? మరొకరు చెప్పనవసరం ఉండదు. ఎవరి స్వేచ్ఛ వారిది. అది స్వతంత్ర ప్రజ్ఞ. మన అంతరాత్మ మనకు చెప్పవలసిందే. మనం పయనిస్తున్న మార్గం సత్యం వేపు అని మన హృదయమే చెబుతుంది. బయట ఎవరూ, చివరికి గురువైనా, పరీక్షలు పెట్టి, మార్కులు వేయనవసరం లేదు. ఇందులో గ్రేడులుండవు. ఎవరి అర్హత వారిది. హృదయమే ఒక స్థాయిలో గురువుగా వ్యవహరిస్తుంది.

                                  ◆నిశ్శబ్ద.