Read more!

బాల్యం నుండి మంచిని భోదించడం ఎందుకు ముఖ్యం?

 

బాల్యం నుండి మంచిని భోదించడం ఎందుకు ముఖ్యం?

బాల్యం నుంచీ పిల్లలకు సృష్టికర్తకు సంబంధించిన ఆలోచనలివ్వటం ఆవశ్యకం. అయితే అవి గుడ్డి నమ్మకాలుగానో, బలవంతాన రుద్దే భావాలుగానో కాదు. మనిషి మనసులో ఉత్పన్నమయ్యే ఆలోచనస్వరూపంలా ఉండాలి. అంటే, వ్యక్తిలో స్వతహాగా నమ్మకమనేది కలగాలి. 

భగవంతుడనే భావనను ఎటువంటి సంకుచిత తత్త్వాలు, అపోహలు లేకుండా కలిగించాలి. భారతీయధర్మంలో 'ఇది తప్పనిసరిగా ఆచరించాలి. దీన్ని ఎదిరించకూడదు. ప్రశ్నించకూడదు' అన్న ఆలోచన లేదు. ప్రతి విషయాన్నీ ప్రశ్నించాలి. పరీక్షించాలి. నిగ్గు తేల్చుకోవాలి అంటుంది భారతీయధర్యం. కానీ పెద్దలను గౌరవించటం, సృష్టికర్తపై అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండటం, వేదాన్ని విశ్వసించటం అన్న విషయాల్లో మాత్రం ఎటువంటి రాజీ పడటం లేదు. భగవంతుడి నిర్దిష్టస్వరూపాన్ని విశ్వసించనక్కర్లేదు. కానీ భగవద్భావనను గౌరవించాలి. అందుకే శాంతిపాఠంలో విద్యార్థి 'బ్రహ్మాన్ని నేను నిరాకరించకుందు గాక' అంటాడు. ఎందుకంటే 'సృష్టికర్త'ను నిరాకరించటమంటే, సృష్టిని నిరాకరించటం. సృష్టిని నిరాకరించడం అంటే, వ్యక్తి తన ఆస్తిత్వాన్ని తానే ఒప్పుకోక పోవటం. దీన్ని మించి అర్థవిహీనమైంది ఇంకొకటి లేదు. కాబట్టి వ్యక్తి బ్రహ్మను నిరాకరించటమన్నది అర్థవిహీనం.

ఎప్పుడైతే ఈ భావన బాల్యంలోనే అర్థమౌతుందో, అప్పుడే వారి జీవితాల్లోంచి ఉద్విగ్నతలు, ఆరాటాలు అదృశ్యమైపోతాయి.

బ్రహ్మభావనను వల్లె వేయటం సులభం. కానీ నిత్యజీవితంలో అనుభవించి ఆచరించటం చాలా కష్టం.  బ్రహ్మభావనను ఎన్ని రకాలుగా విమర్శించవచ్చో, ఎన్ని రకాలుగా నిరాకరించవచ్చో ఊహించి ఆ సందేహాలన్నిటికీ ముందే సమాధానాలు, కథల రూపంలో అందించారు. ఉదాహరణకు భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచంలోకి చెడు ఎలా వచ్చిందని ప్రశ్నించి భగవద్భావనను విమర్శిస్తారు. ఈ వాదంతో వ్యక్తులకు భగవద్భావనపై విశ్వాసాన్ని సడలించే ప్రయత్నం చేస్తారు. ప్రపంచంలో మంచి, చెడు ఎందుకు ఉన్నాయో ఛాందోగ్యోపనిషత్తు వివరిస్తుంది. సురలు, అసురులు ప్రజాపతి సంతానం. అంటే మంచి, చెడు ఏకగర్భజం అన్నమాట. మానవసృష్టి భౌతికమైంది. ఈ భౌతికశరీరంలోకి అనంతమైన ఆత్మ వచ్చి వొదుగుతుంది. ఈ ఆత్మ ఇప్పుడు ఇంద్రియాల ద్వారా జ్ఞానం గ్రహిస్తుంది. శరీరం ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తుంది. దాంతో ఇక్కడ రెండు అంశాలను గ్రహించాల్సి ఉంటుంది. ఒకటి శరీరంలో ఒదిగిన ఆత్మ. రెండవది ఆ ఆత్మకు దృష్టి నిచ్చే భౌతికాంశాలు. అనుక్షణం ఈ రెంటి మధ్య ఒక విధమైన ఘర్షణ జరుగుతూంటుంది. ఆత్మ తన అనంతత్వాన్ని పరిమితమైన భౌతికాంశాల ద్వారా గ్రహించాలని తపన పడుతూంటుంది. శరీరం తన భౌతికతతో తనలో ఒదిగిన ఆత్మను పరిమితం చేయాలని ప్రయత్నిస్తూంటుంది. ఈ భౌతిక శరీరం, ఆధ్యాత్మిక ఆత్యలను అసుర, సురశక్తులు ప్రతిబింబిస్తాయి.

అంటే ఈ ప్రపంచాన్ని సృష్టికర్త సృష్టిస్తూనే రెండు శక్తులు రంగప్రవేశం చేశాయన్నమాట. ఒకటి వెలుతురు లాంటి దైవశక్తి. రెండవది చీకటి లాంటి అసురశక్తి. ఈ రెండు శక్తుల నడుమ జరిగే సంగ్రామం వ్యక్తి జీవితకథ.

'దేవాను రాహవై యాత్ర సంయేతిర్ ఉభయే ప్రజాపత్యా స్తద్ర దేవా ఉద్దీథమా జుహు ఈనేనైనాన భిభవిష్యామ ఇది?

దేవాసురుల నడుమ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దేవతలు యుద్ధం చేశారు. దీంతో మనం అసురులపై విజయం సాధిస్తాం అని నిశ్చయించారు. ఇది చూస్తూనే మనకు అర్ధమౌతుంది. బాహ్యప్రపంచాన్ని చూపే ఇంద్రియాలు, అంతః ప్రపంచాన్ని తప్పు దారి పట్టిస్తాయని, బాహ్యప్రపంచాన్ని చూపే ఇంద్రియాలను నియంత్రించి నిజం చూపాలని అంతఃప్రపంచం ప్రయత్నిస్తుందని, ఈ రెంటి నడుమ సంగ్రామమే మానవ 'మనస్సంఘర్షణ'కు మూలం అని. 

యుద్ధం ఆరంభమైన తరువాత దేవతలు నాసికలో నివసించిన దేవతను ధ్యానించారు. ఇంతలో అసురులు దుష్టశక్తితో నాసికలో ప్రవేశించారు. దాంతో నాసిక సువాసనను అనుభవిస్తుంది. దుర్వాసనను పీల్చుకుంటుంది. ఇలా, దేవతలు, వాక్కును, దృష్టిని, శ్రవణేంద్రియాన్ని మనస్సును ధ్యానించారు. వీటన్నిటిలోనూ అసురులు ప్రవేశించారు. అందుకే మనం మంచి మాట్లాడుతాం. చెడు మాట్లాడుతాం. మంచిని వింటాం. చెడును వింటాం. మనస్సుతో మంచి ఆలోచనలు చేస్తాం. చెడు ఆలోచనలు చేస్తాం. ప్రపంచంలో మంచి, చెడు ఉండేందుకు ఇదీ కారణం. ఈ మంచిచెడుల నడుమ ఘర్షణ వ్యక్తి జీవితాన్ని నిర్దేశిస్తుంది. వ్యక్తి వ్యక్తిత్వస్వరూపాన్ని నిర్దేశిస్తుంది. సురులు, అసురులపై విజయం సాధించటంలో యజ్ఞం ప్రధానబాధ్యత వహిస్తుంది. అందుకే బాల్యం నుంచీ 'మంచి' నేర్పటం, మంచి ఆలోచనలు ఇవ్వటం, మంచి ఆదర్శాలు నిలపటం వంటివి అలవాటు చేయాల్సి ఉంటుంది. ఎదుగుతున్న కొద్దీ బాహ్యేంద్రియాల ప్రభావం పెరుగుతుంది. అవి అందించే ఆకర్షణల శక్తి పెరుగుతుంది. ఆ ఆకర్షణల అసలు స్వరూపం గ్రహించే శక్తికి పునాది బాల్యంలో బలంగా పడాల్సి ఉంటుంది.


 ◆నిశ్శబ్ద.