ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి (The Diary of LEKHA GUMMADI)

 

ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి

The Diary of LEKHA GUMMADI

 

చాలాకాలం తర్వాత సీ.పీ, గారితో కాస్త ఆరాంగా మాట్లాడాను. ఆయన మహా చమత్కారి. భలే జోకులు వేస్తారు. దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ఏడ్చేవాళ్ళు లేదా ఏడిపించేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ నవ్వుతూ ఉండేవాళ్ళు చాలా తక్కువ. అందునా తోటివాళ్ళని నవ్వించేవాళ్ళు ఇంకా అరుదు.

 

సెన్సాఫ్ హ్యూమర్ అంటే ఇంకొకళ్ళని గిల్లి, గిచ్చి నవ్వడం కాదు. ఎవరిమీద జోక్ చేసినా అందరూ హాయిగా నవ్వుకునేట్లు ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్పుకునేట్లు ఉండాలి. ఎదుటివాళ్ళు ఏడ్చేట్లు, కుంచించుకు పోయేట్లు ఉంటే అవి కుళ్ళు జోకులు. ఇతర్లని డిప్రెషన్ లోకి నెట్టే మాటలు అసలు హాస్యం కేటగిరీలోకి రావు. అవి పైశాచిక ఆనందం అనిపించుకుంటాయి. దురదృష్టం ఏమిటంటే, ఎక్కువమంది వెకిలిగా, ఇన్ హ్యూమన్ గా ఉంటారు.

 

సరే, అసలు విషయానికి వస్తే, సీ.పీ. మాటల మధ్యలో...

 

''ఒక్క రెండేళ్లు ఓపిక పట్టండి.. మీకోసం బ్రహ్మాండమైన ఉద్యోగం రెడీగా ఉంది..'' అన్నారు.

 

ఏ ఛానల్లోనో క్రియేటివ్ హెడ్ లాంటి పోస్టు కాబోలు అనిపించింది.

 

మనకు లీడర్ షిప్ క్వాలిటీస్ లేవు గనుక, అలాంటి ఉద్యోగంలో ఎటూ ఇమడలేను. ఆ సంగతి సీ.పీ. గారికీ తెలుసు. ఇద్దరం పన్నెండేళ్ళు కలిసి పని చేశాం. పైగా ఇద్దరం చాలా విషయాలు దాపరికం లేకుండా మాట్లాడుకుంటాం. కనుక నా మనస్తత్వాన్ని టీ నెట్ కంటే గొప్పగానే కాచి వడపోసి ఉంటారు.

 

''ఏదయినా పత్రికైతే చెప్పండి'' అన్నాను.

 

''మహా అదృష్టం వరించడానికి సిద్ధంగా ఉంటే, ఇంకా అంత చిన్నాచితకా కోరికలేంటి? పేద్ద ప్యాలెస్సే ఉండగా, గుడిసె ఎందుకు?”

 

చెప్పొద్దూ, నాకు యమా ఉద్వేగంగా అనిపించింది. మహామహులతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా, ఏదో అద్భుతమైన ఆఫర్ ఉన్నట్లుంది.. అనుకుని ''ఎక్కడ, ఏం జాబ్?'' అన్నాను.

 

''అందులో మీరు తెగ పాటు పడాల్సింది కూడా ఏమీ ఉండదు.. చక్కగా ఓ కాటన్ చీర కట్టుకుని..''

 

''ఏంటీ డ్రెస్ కోడ్ ఉందా?'' ఆశ్చర్యంగా అడిగాను.

 

''అలా ఏమీ కాదుగానీ, మరీ అంత పెద్ద హోదాలో జీన్సులు, చుడీదార్లు ఏం బాగుంటాయి?''

 

''సరే చెప్పండి''

 

''వచ్చేపోయే గెస్టులకి కాస్తంత కాఫీ ఇప్పించి..''

 

''ఏంటీ, కాఫీనా... రిసెప్షనిస్టా..'' నా ముఖం వెగటుగా మారిపోయింది.

 

''అరే, అంత తొందరేంటి? జాక్ పాట్ లాంటి ఆఫర్ అంటే, రిసెప్షనిస్టు, డేటా ఆపరేటర్ లాంటి ఉద్యోగాలు గుర్తొస్తున్నాయా?”

 

“ఏమో బాబూ, అదేంటో త్వరగా చెప్పండి..''

 

''ఒకసారి ఊహించుకోండి.. మొఘల్ గార్డెన్లో దర్జాగా అటూ ఇటూ తిరుగుతూ..''

 

నాకు అయోమయంగా అనిపించింది. ''తెగ ఊరిస్తున్నారు, గానీ, ముందా ఉద్యోగం ఏమిటో చెప్పండి''

 

''ఇంకా అర్ధం కాలేదా.. ప్రతిభా పాటిల్ తర్వాత ఇక ఆ పోస్టు మీదే''

 

''ఏంటీ?” ''ఒద్దా? President of India పోస్టు కూడా నచ్చకపోతే ఇక నేనేం చేసేది?!” అంటూ నవ్వేశారు సీ.పీ.

 

నాకూ నవ్వాగలేదు. ''మీకు నాకంటే బకరా ఎవరూ దొరకలేదా? నేనసలు పాలిటిక్స్ లో యమా పూర్వీకు రాలిని''

 

''అంటే?”

 

''poor plus weak కలిస్తే పూర్వీక్''

 

''హయ్యోరామ.. మినిస్టర్లకి, ఎం.ఎల్.ఏ. లకి రాజకీయాలు తెలిసుండాలి కానీ ప్రెసిడెంట్ పోస్టుకి అవేమీ అక్కర్లేదు''

 

''చాల్లే ఊరుకోండి'' అంటూ హాయిగా నవ్వేశాను.

 

___+++___

 

పొద్దున్న టొమేటో పచ్చడి చేశాను. పరవాలేదు, బాగానే ఉంది. కానీ వేణు వైఫ్ చేసినంత రుచిగా జీవితంలో ఒక్కసారి అయినా చేయగలనా?! అసలదేం చెయ్యి.. అందులో ఏదో అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లాంటిది ఉండి ఉంటుంది...

 

పాత రోజులు కళ్ళముందు మెదుల్తున్నాయి.

 

Lunch Time కి గనుక వేణు మాతో ఉంటే తప్పకుండా టొమేటో పచ్చడి కొంచెం వేసేవారు. వాళ్ళావిడ ప్రతిరోజూ టొ. చేయాల్సిందే! “కూరా, చారూ ఉన్నా,ఒక్కరోజు కూడా టొమేటో పచ్చడి మానేయరా" అని ఆశ్చర్యంగా అడిగేదాన్ని. ''అబ్బే, అది లేకపోతే మాకసలు అన్నం తిన్నట్టే ఉండదు'' అనేవారు. చిత్రం ఏమిటంటే, ఏడాది పొడుగునా టొమేటో పచ్చడి చేసినా ఒక్కసారి కూడా బోర్ కొట్టనంత బ్రహ్మాండంగా ఉంటుందది.

 

అసలు టొమేటో పచ్చడి అనే కాదు, ఆవిడ ఏది చేసినా అమోఘమే. ''వామ్మో, మీ ఆవిణ్ణి చూస్తే నాకు కుళ్ళు వచ్చేస్తోంది.. ఎం అదృష్టం మీది'' అన్నాను.

 

''నిజమే, ఈ విషయంలో అదృష్టవంతుణ్ణే'' అన్నారు.

 

వేణు యమా పాడతారు. ఆ గొంతులో అమృతం ఉందేమో అనిపిస్తుంది. తన అసలు స్వరమే కాకుండా జేసుదాసు, రఫీ, ఘంటసాల ఇలా ఎవరి పాట పాడితే, అచ్చం వాళ్ళే వచ్చి పాడుతున్నంత గొప్పలా పాడగలరు. అంత టాలెంట్ ఉన్నా ఆయనకి సినిమాల్లో పాడే అవకాశం రాకపోవడం నాకే బాధేసింది. ఇక అతనికి దుఃఖం ముంచుకురాదా?! అవకాశం రాకపోవడం వెనుక తన తప్పు కూడా ఉందంటూ '' అదే, పనిగా పెట్టుకుని ప్రయత్నిస్తే వచ్చేదేమో.. కానీ, ఊహ తెలిసింది మొదలు ఆర్ధిక ఇబ్బందులే.. నేను సంపాదిస్తేనే ఇళ్ళు గడుస్తుంది.. ఉద్యోగం వదిలితే వీధిన పడాలి.. మరో మార్గం లేదు.. పోనీ, జాబ్ చేస్తూ ట్రై చేద్దామంటే.. వీళ్ళు పర్మిషన్ ఇవ్వరు..'' అంటూ చెప్పుకొచ్చారు.

 

అదంతా తెలుసు కనుక, ఆ సంగతి రెట్టించకుండా, ''మీ ఆవిడ అదృష్టం ఈ జన్మకేలెండి.. తినాల్సినవన్నీ ఈ జన్మలోనే తృప్తిగా తినేయండి..'' అన్నాను.

 

వేణు అయోమయంగా ఏమిటన్నట్టు చూశారు.

 

''వచ్చే జన్మకి మీ ఆవిణ్ణి నేను బుక్ చేసేసుకుంటున్నాను... ఈసారి నేను అబ్బాయిగా పుట్టేట్లు, మీ ఆవిడ నాకు వైఫ్ అయ్యేట్లు.. దేవుడికి పది కొబ్బరికాయలు లంచం ఇచ్చేసి ఒప్పించేసుకుంటా..'' అన్నాను.

 

వేణు పకపకా నవ్వేశారు.

 

పక్కనున్న చిన్నా కొంటెకోణంగిలా ''హూ.. బాగానే ఉంది... అప్పుడు, ఆవిడే మీతో వంట చేయిస్తుందిలే '' అన్నారు. అదీ నిజమేలే.. నాలాంటి మెతక మనుషుల పరిస్థితి ఎప్పుడూ అంతేగా అనుకుని ఓ పిచ్చినవ్వుతో సరిపెట్టాను.

 

___+++___