ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 2 (The Diary of LEKHA GUMMADI)

 

ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 2

(The Diary of LEKHA GUMMADI)


పొద్దున్నే అలారాలతో పనే లేదు. అదేం చిత్రమో గానీ, నేను ఎన్నింటికి లేవాలనుకుంటే, ఖచ్చితంగా ఆ టైముకి మెలకువ వచ్చేస్తుంది. అలా ఆరింటికి నా మైండ్ లో టైం సెట్ చేసి ఉంది. ఎప్పుడైనా పొరపాటున మెలకువ రాకపోతే ''సంకీర్తన'' వాళ్ళు రానే వస్తారు. వాళ్ళని చూస్తే నాకెంత ఆశ్చర్యమో! ఎంత పొద్దున్నే లేస్తారో గానీ, స్నానాలూ జపాలూ ముగించి, పైగా అందరూ ఒకచోట కలుసుకుని బయల్దేరడమంటే మాటలా? మొన్నోరోజు వాన పడ్తున్నా వాళ్ళ పాటలు వినిపించేసరికి నాకు మతి పోయింది. తలుపు తీసి బాల్కనీలోకి వెళ్ళి చూశాను.. ఇద్దరు గొడుగు పట్టుకున్నారు. ఇద్దరు రెయిన్ కోటు వేసుకున్నారు, తక్కినవాళ్ళు తడుస్తూనే ఉన్నారు. సంకల్పబలం ఉంటే ఏదీ అడ్డు, అవరోధం కాదేమో! అసలు సంకీర్తన ఎందుకో, దానివల్ల ప్రయోజనం ఏమిటో నాకైతే తెలీదు. సంకీర్తన వల్ల సంతృప్తి, సంతోషం పొందుతున్నారు కాబోలు.. జోరున వాన కురిసినా ఆపడంలేదు.

 

నా మట్టుకు నాకు ఆరింటికి లేవడమంటే మహా పనిష్మెంటే. కానీ తప్పదు. ఏ లక్ష్మీ మిట్టల్ ఇంట్లోనో పుట్టి ఉంటే ఈ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పుడు ఎంచక్కా హాయిగా, ఆరాంగా ఉండేది. ఏ పనీ చేయక్కర్లేకుండా మహారాణీలా దర్జాగా పడుకునేదాన్ని. కూర్చున్నచోటికి కాఫీలూ, టిఫిన్లూ ఎగురుకుంటూ వచ్చేవి. ఛ.. వత్తిడి ఎక్కువైపోయి అనుకోవడమే కానీ, నిజంగా అలా ఏం బాగుంటుంది? బేవార్సుగా కూర్చుని తింటే కొవ్వు పేరుకుపోయి కొండలా తయారవనూ?! పైగా సోమరిపోతులంటే నాకే తగని చిరాకు. కాకపోతే మరీ నిద్ర సరిపోక విసుగేస్తోంది. పొద్దున్న ఆరింటికి లేస్తే, రాత్రి పదకొండు దాకా పనే పని. అంటే రోజుకు 17 గంటలు కష్టపడుతున్నాను. ఇందిరాగాంధీ రోజుకు 18 నుండి 20 గంటల వరకూ పనిచేసేదట. అందుకే ఆవిడ దేశానికి prime minister అయింది. నేను గల్లీ లీడర్ని కూడా కాలేదు.

 

ఏమో ఇతర్ల సంగతి నాకెందుగ్గానీ, నాకు మాత్రం నిద్ర తక్కువౌతోంది. పొద్దున్నే కంగారుగా లేచేయకుండా బోల్డంతసేపు పడుకోవాలని తెగ కోరిక. ప్చ్.. నిన్న ఆదివారమే కదా, ఎవరికీ హడావిడి లేదు.. హాయిగా గుర్రు పెట్టి ఇంకాసేపు పడుకోవచ్చా.. అబ్బే, రోజూ వచ్చినట్లే ఆరింటికి మెలకువ వచ్చేసింది. లేచి ముందుగదిలోకి వెళ్ళాను. బుక్ రాక్స్ లో పుస్తకాల్ని చూస్తే జాలేసింది. ఓ పద్ధతీ పాడూ లేకుండా పిచ్చి మోళ్ళలా పడున్నాయి.

 

ఈ ఇంట్లోకి వచ్చాక మరీ బద్ధకం పెరిగిపోయింది. అలా అనేకంటే అస్సలు టైం సరిపోవడం లేదు అనాలి. రెండు బీర్వాల పుస్తకాలు.. మినీ లైబ్రరీని సర్దడం అంటే మాటలా? నా బుక్స్ లో సగం.. పోనీ అందులో సగం శివాజీగారు ఇచ్చినవే. ఆయనకి లారీలకొద్దీ థాంక్స్ చెప్పినా సరిపోదు. సరే, అప్పుడంటే ఒకే ఆఫీసు కనుక ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడెక్కడో పల్టీలు కొట్టి ఇక్కడ తేలానా.. కనీసం నా ఫోన్ నంబరయినా తెలీదా... అయినా ఎలాగో సాధించి, చందమామల డీవీడీ ఇచ్చారు. ''మనం పుట్టకముందు నుంచీ ఇప్పటివరకూ అన్ని చందమామలూ ఉన్నాయి" అని శివాజీగారు చెప్తోంటే ఇదేదో రుణానుబంధమే అనిపించింది. తల్లకిందులుగా తపస్సు చేస్తే మాత్రం అన్ని వేల పిల్లల కథలు దొరుకుతాయా మరి?! నిజంగా లంకెబిందెలు దొరికినా ఇంత ఆనందం సొంతమయ్యేది కాదు. ఆ డీవీడీ ముందు అన్నీ బలాదూరే!

 

చిన్నికి నాకంటే ఎక్కువ కథల పిచ్చి. ఎనిమిదేళ్ళకే బ్రహ్మాండంగా చదివేస్తోంది. ఈ తరం పిల్లల్లో ఎక్కువమందికి తెలుగు చదవడం దాదాపుగా రాదు. రోహిత, 10th classకి వచ్చిందా.. తెలుగులో ఒక్క praragraph చదివేసరికి తాతలు దిగివచ్చినట్లే ఉంటుంది. అందులో వంద తప్పులు. మళ్ళీ Englishలో అయితే మాంఛి fluency ఉంది. ''నువ్వు తెలుగు న్యూస్ రీడర్ వి అవ్వవే రోహితా.. ఎంత సీరియస్ విషయమైనా జనాలు నవ్వుకుంటూ వింటారు'' అంటుంటాను. ఇది జోక్ కాదు, నిజమే! టీవీ ఛానళ్ళవాళ్ళు కామెడీ ఎలా క్రియేట్ చేయాలా, ఛానల్ రేటింగ్ ఎలా పెంచుకోవాలా అని బుర్ర బద్దలు కొట్టుకోవడం ఆపేసి, కాన్వెంట్ పిల్లలతో కాసేపు తెలుగు చదివిస్తే చాలు అదే మాంఛి కామెడీ ప్రోగ్రాం అవుతుంది. ప్రేక్షకులు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయం.

 

ఇంతకీ ఈ బుక్స్ అన్నిటినీ ఎప్పుడు సర్దుకోవాలి? వాటిని కథలు, నవలలు, సైకాలజీ, కామెడీ, ఇన్ఫర్మేటివ్ -అంటూ కేటగిరీలుగా చేయాలి.. కానీ, అందుకు బోల్డంత తీరిక, ఓపిక కావాలి. అబ్బే, కుదిరేట్టు లేదు.. అవునూ.. ఓ లైబ్రేరియన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి మెడమీద కత్తో, కొడవలో పెట్టేసి, సాయింత్రంలోపు సర్దేసెయ్.. లేదంటే చీకటిగదిలో పడేసి నెలరోజులు తిండీతిప్పలు పెట్టనని బెదిరిస్తే.. హూ.. మనకంత నైపుణ్యం కూడా ఏడ్చిందా? పనివాళ్ళే మాట విని చావరు.. అలాంటిది ముక్కూమొహం తెలీని లైబ్రేరియన్ని బెదిరించడం ఒకటి...

 

మొత్తానికి ఈ బుక్స్ అన్నీ సర్దడానికి ఆదివారం చాలదు. Sunday ఒకటా రెండా వెయ్యి పనులు.. extra సెలవు కావాలి.. రేపు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున, నేను నా స్వేచ్ఛనీ స్వాతంత్రాన్ని వదిలేసుకుని ఈ పుస్తకాలన్నిటినీ చక్కగా, స్టేట్ లైబ్రరీ కంటే అందంగా సర్దాలి. పెళ్ళికూతురిలా తయారుచేయాలి. అవసరానికి ఏ బుక్ ఎక్కడుందో దొరక్కపొతే, ఇక ఇవన్నీ ఉండి ఏం లాభం?

___+++___