Yeluka Vacche Illu Bhadram 56

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

ఎలుక వచ్చే ఇల్లు భద్రం 56

ఇలపావులూరి మురళీమోహన రావు

"ఏంటలా పేకాటలో సర్వస్వం కోల్పోయిన వారిలా దిగాలుగా ఉన్నారు.? ఏవైంది?" అడిగాడు వక్రతుండం.

సుందరికి బీరకాయ పీచు బంధువు వక్రతుండం. వరసకు బాబాయి అవుతాడు. కోర్టు కేసులో సాక్ష్యం చెప్పడానికి హైదరాబాద్ వచ్చాడు. హోటల్ ఖర్చును పార్టీ ముందుగానే చెల్లించినా ఖర్చు కలిసొస్తుంది కదా అని సుందరి ఇంటికి వచ్చాడు. అతగాడి బాంధవ్యాన్ని గుర్తుకు తెచ్చుకోడానికి గంట పట్టింది సుందరికి.

"నా పెళ్ళిలో ఎక్కడా నిన్ను చూసినట్లు గుర్తులేదే" అన్నది సుందరి.

తాను పేకాట ఉండటం వలన పెళ్ళి పందిట్లోకి రాలేకపోయానని, సరిగ్గా సూత్రధారణ సమయానికి తాను షో చేసి రెండు మూడు కౌంట్లు లెక్క అపెట్టుకోవాల్సి వచ్చి అక్షింతలు వేయలేక పోయానని వివరణ ఇచ్చాడు వక్రతుండం.

వెంకట్రావు ఆఫీసు నుంచి వచ్చాక ముభాగంగా ఉండటంతో వారి దిగులుకు కారణమడిగాడు. మొదటినుంచి జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించాడు వెంకట్రావు.

"అబ్బో ... అయితే ఇంట్లో చాలా లోపాలున్నాయి. ఇల్లు కట్టేముందే ఎవరైనా మంచి వాస్తు పండితుడికి చూపించాల్సింది" అన్నాడు వక్రతుండం.

"దాదాపు వంద వాస్తు గ్రంథాలు తిరగేశాను మామయ్యగారూ" చెప్పాడు వెంకట్రావు.

"అది పెద్దపొరపాటు. ఏ ఒక్క రెండు గ్రంథాలు ఒకటిలా ఉండవు. ఒక వాస్తు పండితుడు రాసేదానికి మరొకడు రాసేదానికి పొంతన ఉండదు. అందుకని ఏదో ఒక్కదాన్నే నమ్ముకోవాలి."

"వాస్తుకు అంతటి పవరుండా మామయ్యా గారూ?"

"తిన్నగా అంటావేంటి అల్లుడూ? వాస్తు అనేది మహా పవర్ ఫుల్. ఇంటికి, రోడ్డుకు, గ్రామానికి, పట్నానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కూడా వాస్తు అనేది చాలా అవసరం. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబులతో సర్వనాశనమైనా కూడా జపాన్ అంత త్వరగా కోలుకుని అగ్రదేశం ఎలా అయిందంటావ్? ఆ దేశంలో సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు. ఆ సహజ ప్రభావం వలన జపాన్ అభివృద్ధి చెందిన దేశమైంది."

"అసలీ వాస్తుకు అర్థమేంటి బాబాయ్?"

"చెబుతా. వాస్తు అనేది గొప్ప వ్యాకరణ పదం. వాస్ అంటే వ్యాసుడు. తు అనగా ఉద్భవించినది. టోటల్ గా వాస్తు అంటే వ్యాసుడి ముఖతా ఉద్భవించినదని పిండితార్థం."

"ఈ వాస్తు అనే మాటకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన నిర్వచనం ఇస్తున్నారు."

"అంతే అల్లుడుగారూ, తెలిసీ తెలియని వారినడిగితే అలాగే చెబుతుంటారు. తూర్పు పడమరలు తెలిసిన ప్రతివాడు నేడు వాస్తు నిపుణుడే."

"అయితే మీరు తెలిసే చెబుతున్నారా?"

"ఒహ్హె ..హ్హె... అహ్హ..హ్హ..హ్హ..అల్లుడుగారు భలే చమత్కారి. అల్లుడుగారూ మా స్వగ్రామంలోనూ చుట్టుపక్కల గల పాతిక గ్రామాల్లోనూ వాస్తు చెబుతున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే వాస్తులో నేను వాస్తవంగా పండిపోయాను."

"అయితే చెప్పండి. మాఇంట్లో వాస్తు లోపాలకు పరిష్కారం ఏమిటి?"

"మీరేం దిగులు పడకండి. మంచి తాపీ పనివారిని నలుగురిని మాట్లాడండి. ఏవేం కూలగొట్టాలో క్షణంలో కూలగొట్టించి అవతల పారేస్తాను. సిటీలో ఎలాగూ రెండురోజుల పని మీదొచ్చాను. మరో రెండు నెలలుండటానికి నాకేం అభ్యంతరం లేదు."

"ఎంతో కష్టపడి దగ్గరుండి మరీ కట్టించాను మామయ్యగారూ... ఆర్నెల్లపాటు ఆఫీసుకెళ్ళి సంతకం చేసి అఫిషియల్ వర్క్ అని రిజిష్టర్లో రాసి ఇంటికొచ్చి దగ్గరుండి వాస్తు పుస్తకాలు చేతపట్టుకుని చదువుతూ కట్టించాను. దీన్ని కూలగొట్టడానికి నా మనసు అంగీకరించడం లేదు. దాని కంటే ఉన్నదాన్ని ఉన్నట్లు అమ్మెయడం మంచిది."

"చూడబ్బాయ్.. ఎవరికంటికీ కనిపించని. ఉందో లేదో తెలియని మనసు అనే పదాన్ని పట్టుకుని వేలాడుతూ మనం నిర్ణయించవలసిన విషయాలను దాని అంగీకార అనంగీకారాలకు వదిలెయ్యడం ప్రాజ్ఞుల లక్షణం కాదు. ఇన్ని లోపాలున్న ఇంటిలో మీరు నివసిస్తూ నానా కష్టాలూ పడుతుంటే పెద్దముండాకొడుకులం మేము చూస్తూ కూర్చోలేం కదా. ఇల్లు కూలగొట్టడమా అనే విషయం నా కొదిలిపెట్టు."

"ఏమిటో...సరైన సలహా చెప్పే వారెవరూలేక"

"అది ఇంతవరకూ, ఇప్పుడు నేనున్నానుగా. ఇక మీకు ఏ చీకూ చింతావద్దు."

"ఇల్లు కట్టించడం సులభమే కానీ అమ్మడం చాలా కష్టం మామయ్యాగారూ."

"భలేవాడివే అల్లుడూ, ఇళ్ళు అమ్మడంలో నాకు నలభైసంవత్సరాల అనుభవం ఉన్నది."

{ఇంకావుంది}

{హాసం వారి సౌజన్యంతో}