Read more!

సుధా సాగర మధనం కృష్ణ తత్వం !!

 

సుధా సాగర మధనం కృష్ణ తత్వం !!

 

మహాభారతం ఒక మహా గ్రంథం. అందులో పాండవులు, కౌరవులు, కురుక్షేత్ర మహా సంగ్రామము అబ్బో చెప్పాలంటే ఎన్నో. ఇదంతా ఒక ఎత్తు అయితే గీతాసారం, దాన్ని బోధించిన కృష్ణ నీతి జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించవలసినదే. అల్లరి వాడైన ఈ నల్లని వాడు, రాధా మాధవుల ప్రణయ గాధలో ప్రాణనాధుడు, కాళింది మడుగులో నాట్యం చేసిన పిల్లవాడు, గోవర్ధన గిరిని చిటికెన వేలు మీద నిలిపిన మాయాజాలం. పాండవులకు మార్గదర్శిగా, అర్జునుడికి గీతను బోధించి కర్తవ్యాన్ని గుర్తు చేయడంలో అయినా ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేదు. కొందరు కృష్ణుణ్ణి మయావి అని అంటుంటారు. కానీ నిజానికి కృష్ణ సిద్ధాంతం ఎంతో గొప్పది నేటి సమాజానికి ఆచరించదగ్గది కూడాను. అలాంటి మన కన్నయ్య పుట్టుక  నుండి ప్రతి సంఘటన అద్బుతము, ఆశ్చర్యము వెరసి సమ్మోహనం కలిగిస్తుంది. అంతేకాదు మృత్యు గుహలో జన్మించి అణువణువునా ఆపదల నుండి తప్పుకుంటూ సాగే కృషుని జీవితం తెలుసుకుంటూ ఎంతో నేర్చుకోవచ్చు. 

కారాగారంలో జననం

కంసుని చెల్లెలు దేవకి. ఆమెను వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు కంసుడు. అయితే కంసుడి క్రూరత్వం కారణంగా అతన్ని చంపడానికి  దేవకి కడుపున ఒక బిడ్డ పుడతాడని, అది కూడా దేవకి, వసుదేవులకు పుట్టే ఎనిమిదవ బిడ్డ చేతిలోనే కంసుడి మరణం జరుగుతుందని ఆశరీరవాణి చెప్పడంతో కంసుడు చెల్లెలు అని కూడా చూడకుండా పిల్లలు కూడా కలుగకుండానే దేవకిని చంపాలని చూస్తాడు. అయితే వసుదేవుడు కంసుడితో, నీకు ప్రమాదం ఉన్నది నీ చెల్లెలికి పుట్టే బిడ్డతో కానీ నీ చెల్లెలితో కాదు కదా దయచేసి ఆమెను వదిలిపెట్టు, మాకు పుట్టే బిడ్డను నీకు ఇచ్చేస్తాం అని చెబుతాడు. దానికి ఒప్పుకుని కంసుడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధించి, వాళ్లకు పుట్టే ప్రతి బిడ్డను చంపుతూ వస్తాడు. అలా ఎనిమిదవ బిడ్డగా శ్రావణ శుద్ధ అష్టమి న రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మిస్తాడు.

మధుర నుండి  గోకులంలో కన్నయ్యగా

పుట్టిన బిడ్డను కాడుకోవడానికి వసుదేవుడు ఆలోచిస్తుండగా ప్రతి చోట  అతనికి అనుకూలత ఏర్పడి తన బిడ్డను రేపల్లె లో నివసించే యశోద ఇంటికి చేర్చుతాడు వసుదేవుడు. అలా రేపల్లె లో గోవుల మధ్యన, వెన్నదొంగగా, యశోదా తనయుడిగా పెరుగుతాడు. గొల్లభామలను అల్లరి పెట్టి, గోప బాలకులతో రచ్చ చేసి వెన్నను మాత్రమే కాదు మన్నును తిని, తన నోటిలోనే సృష్టి మొత్తాన్ని యశోదకు సాక్షాత్కరించిన అవతార పురుషుడీయన.

మహాభారతం, కురుక్షేత్రం

మేనత్త కొడుకులైన పాండవులతో శ్రీకృష్ణుని స్నేహం,వారి మధ్య ఉన్న అనుబంధం వర్ణించలేనిది. కష్టాలలో ఉన్నపుడు వెన్నంటి ఉండి వారిని కాపాడుకున్న వాడు కృష్ణుడే. కురుక్షేత్ర మహాసగ్రామంలో యుద్ధానికి భయపడి వెనకడుగు వేయబోయే అర్జునుడికి గీతాబోధ చేసి తిరిగి సన్నద్ధుని చేసి, యుద్ధంలో విజయం సాధించేందుకు తోడ్పడినవాడు కృష్ణుడే. 

స్త్రీ లోలుడు కాదు!! స్త్రీ సంరక్షకుడు.

ఎవరైనా ఇద్దరు భార్యలు లేదా అంతకంటే ఎక్కువ అమ్మాయిల స్నేహం కలిగి ఉన్న వ్యక్తులను వెంటనే కృష్ణుడితో పోల్చేస్తారు కానీ అది ముమ్మాటికీ తప్పు. కృష్ణుడు ఎప్పుడు స్త్రీల కోసం పాకులాడలేదు. అసలైన ప్రేమను అర్థం చేసుకునేవారికే కృష్ణుడి ఆరాధన కూడా అర్థమవుతుంది. అదొక మానసిక భావం అంతే!! కృష్ణుడికి పదహరువేల మంది భార్యలు అని గేలి చేసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్లందరిని నరకాసురుడి బారి నుండి కాపాడి వాళ్లకు సంరక్షణ కల్పించడానికి వాళ్ళను భార్యలుగా స్వీకరించాడు తప్ప వాళ్ళతో శారీరక సంబంధం అణుమాత్రమైనా లేదు. 

కృష్ణ భక్తి

కృష్ణుడిని ఆరాధించడమే జీవిత పరమావధిగా చేసుకున్నవారిలో అందరికి తొందరగా స్పృరణకు వచ్చే పేరు మీరాబాయి. ఈమె భజనలు ఎంతో ప్రాచుర్యం చెందినవి. 

కృష్ణ నిర్యాణం

మహాభారత యుద్ధం తరువాత కృష్ణుడి వంశం అయిన యాదవ వంశం క్రమంగా మందగించిపోతుంది. కృష్ణుడు అడవులలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక వేటగాడి బాణం దెబ్బకు ప్రాణం వదులుతాడు. దాంతో కృష్ణుడి నిర్యాణం, మాత్రమే కాదు ద్వాపర యుగం కూడా ముగుస్తుంది. 

 నేటి కృష్ణాష్టమి

కృష్ణుడి జీవితం ఇంత ఉన్నా, జన్మాష్టమి అంటే పిల్లాడైన కృష్ణుడి రూపం కాబట్టి యావత్ భారతదేశంలో ఎంతో మంది తమ పిల్లలకు కృష్ణుడి రూపం వేసి మురిసిపోతుంటారు. అమ్మాయిలకు గోపికల వేషం, రాధ వేషం వేసి సందడి చేస్తుంటారు. ఎన్నో ఇళ్ల ముంగిళ్ళలో కృష్ణుడి పాదాల గుర్తులు వేసి పూజిస్తూ ఉంటారు. వారింటికి కృష్ణుడు వస్తాడని అదొక భక్తిపూర్వక నమ్మకం. 

కృష్ణుడిని నమ్మిన వారికి, నమ్మకపోయినా నీతి నిజాయితీల వెంట నడిచేవారికి కృష్ణుడు నేరుగా సహాయం చేయకపోయినా తన జీవితం ద్వారా, భాగవత, భగవద్గీతల సారం ద్వారా మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి కార్యోన్ముఖులను చేస్తాడని గొప్ప నమ్మకం. 

వీటి గురించి పక్కన పెడితే వీలైన ప్రతి ఇంటి ముంగిట వెన్నదొంగను ఆహ్వానించడానికి అందమైన పాద ముద్రలు వేసి మీ ఇంట బిడ్డను కృష్ణుడిగా అలంకరించి శ్రీకృష్ణ పరమాత్మను మనసారా తలచుకుంటే "ఇష్టకామ్యార్థసిద్దిరస్థు" అని ఆశీర్వదించకుండా ఉంటాడా చెప్పండి. 

◆ వెంకటేష్ పువ్వాడ