Read more!

స్వర్గనరకాల గురించి స్వామి రామతీర్థ చెప్పిన కథ!

 

స్వర్గనరకాల గురించి స్వామి రామతీర్థ చెప్పిన కథ!

స్వర్గం, నరకం అనేవి వున్నాయనీ, భూతలంమీద పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళతారనీ, పాపం చేసిన వారు నరకానికి పోతారనీ సంఘటిత మతాలు ప్రతిపాదిస్తుంటాయి. ఆధునికులు ఈ స్వర్గ నరకాలను నమ్మరు. కానీ మనిషి చేసే పుణ్యానికి, పాపానికి ఏదో కొంత ఫలితం ఇప్పుడో మరెప్పుడో వుంటుందనే అనుమానం మాత్రం వీడదు.

అయితే ఎవరికి స్వర్గప్రాప్తి కలుగుతుందో, ఎవరు నరకంలో పోయి పడతారో ఎవరూ నిర్ధారణగా చెప్పగలిగిగేవారు లేరు. లోకం మెచ్చే పుణ్యకార్యాలు చేసేవారి జీవితాల్లో మనకు కనుపించని పాపమెంతో చోటుచేసుకొని వుండచ్చు. అనామకులుగా జీవితం వెళ్ళదీసిన వారెందరో అతి పవిత్రమైన బ్రతుకు బ్రతికి వుండచ్చు. అలాంటి తరుణంలో ఈ అనామకుడికే స్వర్గప్రాప్తి, ఆర్భాటంగా గొప్ప కార్యాలు నిర్వహించిన ఆ వ్యక్తికి నరకప్రాప్తి కలగవచ్చు.

అదేవిధంగా మత విశ్వాసాలు కలిగిఉన్న వారికే స్వర్గం దక్కుతుందనీ, అలాంటి విశ్వాసాలు లేనివారికి నరకం సంభవిస్తుందనీ అనుకోడం కూడా పొరపాటే అవచ్చు. ఈ స్వర్గనరకాల ప్రస్తావన వచ్చినప్పుడు, అద్వైత వేదాంతానికి మకుటం లేని మహారాజు అనదగిన స్వామి రామతీర్థ ఈ కథ చెప్పాడు.

"డార్విన్, హక్సీ వంటి మహాశాస్త్రవేత్తలు మనుషులుగా మంచివారైనప్పటికీ మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా బ్రతికారు కాబట్టి, మరణానంతరం వారిద్దరికీ నరకమే ప్రాప్తించి వుంటుందని నమ్మిన ఒక మతాచార్యుడు తాను స్వర్గానికి వెళ్లే వెళ్ళడంతోటే, తాను ఎరిగున్న ఆ శాస్త్రజ్ఞులిద్దరూ నరకంలో ఏ ఇడుములకు గురైనారో చూచి వద్దామని బయలుదేరాడు.

నరకానికి వెళ్ళేదారి పోను పోను చాలా అసహ్యంగా వుంది. వెళ్ళినకొద్దీ అన్ని వైపులా దుర్గంధ మలముకొనడం ప్రారంభమైంది. ఇక ఆ కొసకు వెళ్ళేసరికి ఈ భరింపరాని వాసన తనముక్కుపుటాలను బ్రద్దలు జేస్తుందని భయపడ్డాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి అతడికా ప్రాంతం ప్రశాంతంగా పరిశుభ్రంగా స్వర్గతుల్యంగా కనిపించింది.

మతాచార్యుడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అక్కడ కనుపించిన హక్సీలీ వెంటపడి “ఇదేదో అద్భుతంగా వుందే? ఇదెట్లా సాధ్యం? నమ్మశక్యంగా లేదే?” అని ప్రశ్నించాడు.

మేమిక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం చాలా అధ్వాన్నంగా వున్న మాట నిజమే. రావడం రావడం ఇక్కడున్న మురికిగుంటల్లో వచ్చిపడ్డాం. పక్కనే కాలేకాలే ఇనపచువ్వలు కనిపించాయి. ఆ గుంటల్లో వున్న మురికినీరు దోసెళ్ళతో తీసి ఆ చువ్వలమీద పోయడం ప్రారంభించాం. అటు తర్వాత యమభటులు మమ్మల్ని సలసలకాగే నూనె వద్దకు తీసుకుపోయారు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఇనుములో కొంతభాగం పూర్తిగా చల్లారి పోయింది. మరికొంతేమో ఎర్రగా మండుతూనే వుంది. చల్లారిన ఇనుము సహాయంతో అక్కడ మండే అగ్నిసహాయంతో, ఎర్రటి ఇనుమును పార, నాగలి మొదలైన పనిముట్లుగా రూపొందించాం.

అటుతర్వాత మమ్మల్ని ఆ భటులు కశ్మలంతో నిండివున్న ప్రదేశానికి తీసుకువెళ్ళారు. మా ఇనుప పనిముట్లతో ఆ ప్రదేశాన్నంతా త్రవ్వడం మొదలెట్టాం. అక్కడి పేడనీ మలమూత్రాదుల్నీ ఆ త్రవ్విన ప్రదేశంలో ఎరువుగా వాడాము. నరకమని పేరుపడ్డ ఈ ప్రదేశాన్ని సస్యశ్యామలంగా పంటలతో ఫల వృక్షాలతో నందనవనంగా తయారు చేశాం” అని సమాధానమిచ్చాడు.

జీవితం కొందరికి చిందరవందరగా తయారైన గృహం లాగా కనిపించే మాట నిజమే. కాని ఏది ఎక్కడ వుండాలో దేనికెంత ప్రాధాన్యమివ్వాలో తెలుసుకొని తగినట్లు మార్పు చేసుకుంటే, ఆ గృహమే స్వర్గసీమ అవుతుందని రామతీర్థ తాత్పర్యం. దీన్ని అర్థం చేసుకుంటే ఎంతోమందికి జీవితంలో గొప్ప పరిష్కారాలు లభిస్తాయి.

                                       ◆నిశ్శబ్ద.