Read more!

కష్టాలు, దుఃఖాలు కలగడానికి కారణం ఏమిటి??

 

కష్టాలు, దుఃఖాలు కలగడానికి కారణం ఏమిటి?? 


తానహం ద్విషత క్రూరా స్సంసారేషు నరాధమాన్

క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు||

ద్విషతః అంటే భేదబుద్ధి కలవారు. ఇతరులలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను ద్వేషించేవారు. అంటే ఇతరులను తక్కువగా చూడటం, భేదబుద్ధిలో చూడటం, కించపరచడం, కోపించడం, ద్వేషించడం, ఇటువంటి లక్షణములు కలవారు, పరమాత్మను ద్వేషించినట్టే. ఇంకా ఇతరులు పట్ల, ఇతర ప్రాణుల పట్ల క్రూరంగా అమానుషంగా ప్రవర్తించేవాళ్లు, పాప కార్యమములు చేసే వాళ్లు, పాప కార్యములు చేయాలి అనే ఆలోచన కలవాళ్లు. అంటే ఇతరులకు హాని చేసేవాళ్లు, అటువంటి ఊహలు, సంకల్పములు కలవాళ్లు, ఇటువంటి వాళ్లు నరాధములు, అంటే నరులలో అధములు. మనుషులలో అందరిలోకి ఎంతో హీనమైనవాళ్ళు.

 అశుభాన్ అంటే వీరి ముఖం చూస్తేనే అశుభం కలుగుతుంది అని ఈసడించుకున్నారు పరమాత్మ. ఎందుకంటే ఇటువంటి వారికి శుభాలు, శుభకార్యాలు అంటే గిట్టవు, ఎల్లప్పుడూ ఇతరులకు అశుభం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వారంటే 'నాకు' అంటే పరమాత్మకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇటువంటి వారిని ఎప్పుడూ సంసారము అనే సముద్రంలో పడవేస్తాను. లేకపోతే వారికి పశువులు, పక్షులు, వృక్షములు మొదలగు జన్మలు కలుగుతాయి. కాబట్టి పైన చెప్పబడిన వారంటే పరమాత్మకు ఏమాత్రం ఇష్టం లేదు. వారు ఎన్ని యజ్ఞలు. యాగాలు వ్రతాలు దానాలు చేసినా లాభం లేదు.

పరమాత్ముని నియమం ఏమిటంటే మంచి పనులు చేసేవారికే మంచి జన్మలు, మంచిగతులు, చెడు పనులు చేసే వారికి నీచజన్మలు, చెడు గతులు వస్తాయి. ఇది ఈ విశ్వంలో ఉన్న నియమము, దీనిని ఎవరూ దాటలేరు. మనసులో క్రూరత్వము, చెడ్డగుణములు పెట్టుకొని ఎన్ని యజ్ఞయాగములు, వ్రతాలు, దానాలు చేసినా ఏమీ లాభం లేదు. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం అన్నాడు. సాధువులు అంటే దైవీ సంపద కలవారు, దుషృతులు అంటే చెడు గుణాలు కలవారు. ఇటువంటి వారిని సంసారములలో పడవేస్తాను అని అంటున్నాడు అంటే ఈ సంసారము, బంధనములు, ధనము, ఐశ్వర్యము, ఆస్తులు, భార్యాబిడ్డలు వీటి మీద వల్లమాలిన అభిమానము అన్నీ దుఃఖములనే తెచ్చిపెడతాయి అని భావం.

ఈ రోజుల్లో చాలా మంది ఈ సంసారబంధనాలతో విసిగిపోయి, “నాకు ఈ బాధలు ఎన్నాళ్లు. ఎన్నాళ్లు ఈ సంసార బాధలు పడాలి." అని అనుకునేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. తాము ఎంతో అభిమానించే పిల్లలు వృద్ధాప్యంతో తమ మానాన తమను వదిలి ఎగిరిపోతే ఆ వృద్ధుల ఒంటరితనము, బాధ వర్ణణాతీతము. అలాగే ఎదిగి వచ్చిన ఆడపిల్లలకు పెళ్లికాకపోతే, వయసువచ్చిన కొడుకులు సంపాదన లేకుండా తల్లి తండ్రులను వేధిస్తుంటే, తిని, తిరుగుతుంటే, ఆ ఇంటిపెద్ద పడేబాధ చెప్పలేనిది. తిండి పెట్టలేని వాడివి మమ్మల్ని ఎందుకు కన్నావు అని సంతానము ఎదురు ప్రశ్నిస్తే కుమిలిపోవడం ఆ ఇంటి పెద్ద వంతు అవుతుంది. ఇదే సంసారము. 

ఉన్న ధనం చాలక ఇంకా కావాలని ఏవేవో వ్యాపారాలు చేసి నష్టబోయి, అప్పులవాళ్ల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకోవడమే సంసారము. లేనిగొప్పలకు పోయి, పరువు ప్రతిష్టలకు పోయి, తమ సంతానం తమను కాదని వేరే వివాహాలు చేసుకుంటే, ఆ అవమానం తట్టుకోలేక హత్యలకు ఆత్మహత్యలకు పాల్పడ్డమే సంసారం. ఇవన్నీ బాధలే, నరకాలే. అనుభవించేవాళ్లకే తెలుస్తాయి. అలాగే మొగుడు తాగితందనాలాడుతూ భార్యాబిడ్డలను పట్టించుకోకపోతే, ఆ అభాగ్యులు పస్తులతో పడి ఉండటంకూడా సంసారమే. మొగుడు పెట్టే చిత్రహింసలు భరించలేక వాడిని చంపి జైలుకెళ్లడమో లేక తాను, తన పిల్లలతో కూడా ఆత్మహత్య చేసుకోవడమో ఇది కూడా సంసారమే. అందుకే సంసారం సాగరం దుఃఖం అని అన్నారు. చెడ్డ గుణాలు కలవాళ్లను ఈ సంసారకూపంలో పడవేస్తాను అని అన్నాడు పరమాత్మ,

మరి ఈ సంసారకష్టాలు ఎంతకాలం అంటే అజస్రమ్ అని అన్నారు పరమాత్మ అంటే మాటి మాటికీ. మానవులలో చెడ్డ గుణాలు ఉన్నంతవరకు ఈ సంసారము వాటి వలన కలిగే దుఃఖాలు, కష్టాలు తప్పవు. కాబట్టి మానవులలో చెడ్డ గుణాలు తొలగి పోయేవరకు వారు దైవీ సంపద అలవరచుకొనే వరకు సంసారము తప్పదు. 

◆ వెంకటేష్ పువ్వాడ