Read more!

పరమపదానికి మార్గం

 

పరమపదానికి మార్గం

చాలామంది మాటల్లో అంటూ ఉంటారు జన్మచక్రంలో ఇరుక్కోవడం అనే మాటను. అలాగే ఆదిశంకరులు కూడా అంటారు పునరపి జననం పునరపి మరణం అని. అంటే మనిషి పుట్టడం కర్మలు చేయడం, చావడం, మళ్లీ పుట్టడం, కర్మలు చేయడం చావడం ఇట్లా సాగుతూ ఉంటుంది మనిషి జీవితం. అయితే కర్మలు చేయడం మనిషిగా పుట్టాక తప్పనిసరి. అయితే వాటిని ఏదో ఆశించి చేయకుండా అదొక బాధ్యత అనే ఆలోచనతో చేసుకుపోవాలి. దాని గూర్చి అతిగా ఆలోచించకూడదు. అట్లా చేయడం అందరికీ అంత సులువు కాదు. వ్యాసుల వారు అట్లా అచేసుకుంటూ పోవడానికి మళ్లీ మళ్లీ జన్మ లేకుండా పరమపదం చేరుకోవడానికి కావలసిన కొన్ని లక్షణాలను చెప్పారు.  

శ్లోకం:- నిర్మాన మోహా జితసఙ్గదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః। 

ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజై ర్గచ్ఛన్త్య మూఢాః పదమవ్యయం తత్॥

పరమపదం అనే మెట్లు అన్నీ ఎక్కడానికి ప్రతి మానవుడిలో ఏయే లక్షణాలు ఉండాలో ఈ శ్లోకంలో వివరించాడు వ్యాసులవారు. 

1.నిర్మానమోహ: అంటే వినయం, విధేయత కలిగి ఉండాలి. అహంకారము ఉండకూడదు. దేహాభిమానం వదిలిపెట్టాలి. అవివేకము, అజ్ఞానము నుండి బయట పడాలి. మనలో ఉన్న గొప్పతనం అంతా పరమాత్మ అనుగ్రహంగా భావించాలి. మనగొప్పతనం అని అహంకరించ కూడదు. 

2. జితసద్గజోషా…..  అంటే సంసారము అనే వృక్షము నరికాము కదా అని అహంకరించి, మరలా సంగములో పడకుండా, ప్రాపంచిక విషయముల మీద సంగత్వమును పూర్తిగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే పూర్తిగా వదిలేయడమని కాదు విపరీతమైన అనుబంధాలు పెంచుకోకూడదు. నేను లేకపోతే వీళ్లంతా ఏమైపోతారు అనే భావన వదిలిపెట్టాలి. అవును మరి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పిల్లవాడిగా ఉన్నపుడే సంరక్షణ, బాధ్యత అవసరం అవుతాయి. పెద్దయ్యాక ఎవరి జీవితాన్ని వాళ్ళు నిర్వహించుకోగల సామర్త్యాన్ని వల్లే సంపాదించుకోవాలి కదా. 

 3. వినివృత్త కామా: అంటే అధర్మపూరితమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టడం. ధర్మబద్ధంగా ఆలోచించాలి. అటువంటి కోరికలనే సంకల్పించాలి. పూర్వజన్మ వాసనలను పూర్తిగా పోగొట్టుకోవడం. దీనిని నివృత్తిమార్గము అంటారు. ఈ నివృత్తి మార్గములో ప్రయాణం చేయాలి. కాని మనం అంతా ప్రవృత్తి మార్గంలో అంటే ప్రాపంచిక మార్గంలో మాత్రమే ప్రయాణం చేస్తున్నాము.

4. ధ్వంద్వైర్విముక్తా… అంటే ద్వంద్వములను సమానంగా చూడటం. వాటి నుండి విడివడటం. సుఖదుఃఖములు, రాగద్వేషములు, శీతోష్ణములు, లాభాలాభములు, జయాపజయములు వీటినే ద్వంద్వములు అని అంటారు. వీటిని సమంగా చూడగలగాలి. దేనికీ అతిగా స్పందించకూడదు. ఏది వస్తే దానిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. అన్నిటినీ సమానంగా చూడటం అనే లక్షణం ఇలానే అలవడుతుంది.

5. అధ్యాత్మనిత్యా….  అంటే ప్రతి దినము శాస్త్ర పఠనము, అధ్యయనము, శ్రవణము, సత్సంగము చేయాలి. శరీరము ఆరోగ్యంగా ఉండటానికి మంచి భోజనము ఎంత అవసరమో అలాగే మానసిక ప్రశాంతత కొరకు ఇవి అవసరము. ఇది సంప్రదాయాన్ని కొనగించే మంచి మార్గం. మనిషి జీవితానికి ఎంతో అవసరం కూడా. 

6. అమూఢా:  అంటే ఇవన్నీ అనుసరించిన వాడు మూఢత్వములో పడడు. మూఢత్వములో ఉన్నా, దాని నుండి బయట పడతాడు. తెలివిగా ఉంటాడు. ఇటువంటి వాడు తత్ పైన చెప్పబడిన, అవ్యయం అంటే నాశనము లేని, శాశ్వతము అయిన పరమ పదమును, గచ్ఛన్తి పొందుతున్నాడు. ఈ సాధనములతో మానవుడు పరమపదమును చేరుకోవచ్చు అని పరమాత్మ బోధించాడు.

పైన చెప్పుకున్న విషయాలు అన్నీ పాటిస్తూ ఉంటే, అవన్నీ జీవితంలో భాగం చేసుకుంటే ఆ భగవంతుడి సమక్షం అయిన పరమపదాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది. అయితే మనిషి తన బాధ్యతల నుండి తప్పుకోకూడదు అని ఆ పరమాత్మ ఎక్కడా చెప్పలేదు అనే విషయం అందరూ గుర్తించాలి.

◆ వెంకటేష్ పువ్వాడ