Read more!

మన మహర్షులు - అత్రి మహర్షి

 

 

 

మన మహర్షులు - అత్రి మహర్షి

 

 


మనం గోత్రాలలో ఆత్రేయస గోత్రం అని వింటూ ఉంటాం కదా అది అత్రి మహర్షి నుంచి ఉద్భవించినదే. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రులలో మొదటివాడు. బ్రహ్మ దేముడు ఇతనిని సృష్టి కార్యంలో సహాయం చేయటానికి పుట్టించాడు.


అత్రి మహర్షి ఒక అనుకూలమైన స్థానాన్ని చూసుకుని తపస్సు చేయటం ప్రారంభిస్తాడు. ఆయన చేసిన ఘోరమైన తపస్సు వల్ల అతని కళ్ళల్లోంచి ఒక తేజస్సు బయటకి వచ్చి అది భూమి ఆకాశాలు మొత్తం వ్యాపించిపోతుంది. అలా వచ్చిన తేజస్సుని భూమి ఆకాశాలు తట్టుకోలేకపోవటం వల్ల అది సముద్రంలో కలిసిపోతుంది. ఇది తెలుసుకున్న బ్రహ్మ దేముడు అత్రి మహర్షికి పెళ్లి అయ్యాకా ఆ తేజస్సులో కొంత భాగంతో చంద్రుడు తనకు కుమారుడై పుడతాడని, మిగిలిన తేజస్సు సముద్ర మథన సమయంలో వచ్చి చంద్రుడిని చేరుతుందని వరమిస్తాడు.


కొంత కాలానికి అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరుతెచ్చుకుంది. ఒక రోజు త్రిమూర్తులు ముగ్గురు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిధ్యం స్వీకరించటానికి వచ్చామని చెప్తారు. అత్రి మహర్షి ఎంతో ఆనందంతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తాడు. అప్పుడు త్రిమూర్తులు వారు అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్త్ర అయ్యి ఉండాలని అంటారు.


అనసూయ దేవి అంగీకారంతో అత్రి మహర్షి సరెఅనని మాటిస్తాడు. వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రం జాలం చల్లి చంటి పిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాలలో పడుకోబెడుతుంది. ఇది తెలుసుకున్న వారి భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి  అతనినీ, అనసూయాదేవిని వేడుకుని ఆ పసిపిల్లల్ని మళ్లీ త్రిమూర్తులుగా పొందుతారు. అపుడు ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మీకు మేము సంతానంగా పుడతామని చెప్పి వెళ్ళిపోతారు.


చాలా కాలం పిల్లలు కలుగకపోవటంతో అత్రి మహర్షి భార్యతో కలిసి వంద సంవత్సరాలు తపస్సు చేస్తాడు. దాని వల్ల కొన్నాళ్ళకు అత్రి మహర్షి కంటిలోంచి చంద్రుడు, అనసూయా దేవి గర్భంలోంచి దత్తాత్రేయుడు, దూర్వాసుడు పుడతారు. పిల్లలు పుట్టాకా తపస్సుచేసుకోటానికి వెళుతున్నాను నువ్వు వస్తావా అని తన భార్యని అడుగుతాడు అత్రి మహర్షి. దానికి అనసూయ పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు కాస్త పెద్దయ్యాకా వెళదామని చెప్తుంది.


జీవనం సాగించటానికి ధనం అవసరం అవ్వటంతో అత్రి మహర్షి పృధు చక్రవర్తి దగ్గరకు వెళతాడు. ఆ సమయంలో అశ్వమేథ యాగం చేస్తున్న పృథు చక్రవర్తి ఆ గుఱ్ఱాన్ని రక్షించటానికి తన కొడుకుతో వెళ్ళమని అత్రి మహర్షిని అడుగుతాడు. దానికి ఒప్పుకుని వాళ్ళ వెంట వెళతాడు. అయితే పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు ఆ గుఱ్ఱాన్ని దాచేస్తాడు. అత్రి మహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయాన్ని పృథు చక్రవర్తి కొడుకుకి చెపుతాడు. దానితో అతడు ఇంద్రుడిని జయించి అశ్వాన్ని వెనక్కి తెస్తాడు.


అశ్వమేథ యాగం పూర్తయ్యాకా పృథుడు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్ళి తన పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయదేవితో కలిసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు. అలాగే ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగి అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్య చంద్రుల వెలుగు తగ్గి లోకమంతా చీకటి మయం అవుతుంది. అప్పుడు అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ చంపేస్తాడు.


అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో  దాన ధర్మాలు, జపతపాలు, పూజ విధానం, దేవతా ప్రతిష్ఠ మొదలైన వాటి గురించి చెప్పబడింది. దత్తపుత్రుడిని  స్వీకరించటం అనే దాని గురించి మొట్టమొదట ప్రవేసపెట్టింది అత్రి మహర్షే.


సప్తఋషులలో ఒకరైన అత్రి గురించి అతని భార్య అయిన అనసూయాదేవిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

 

..కళ్యాణి