Read more!

నేటినుండి పైడితల్లి సిరిమాను జాతర

 

నేటినుండి పైడితల్లి సిరిమాను జాతర

 

 

విజయనగరం రాజు విజయ రామరాజుకు పైడితల్లి సోదరి. బొబ్బిలి యుద్ధం సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడితల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమికేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు. ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి 1757లో ఆత్మహత్య చేసుకుంది. తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్టించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయ్యింది. అప్పటి నుంచి విజయ దశమి ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు

 

 

క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆసీర్వదిస్తారు. జాతరలో సిరిమాను ప్రధాన ఆకర్షణ.

 

 

సిరిమాను వృక్షం ఆచూకీ గురించి అమ్మవారు ఆలయ ప్రధాన పూజారికి ఉత్సవం నెల రోజులుందనగా కలలో కన్పించి చెబుతుంది. ఆమేరకు సిరిమాను వృక్షం ఎక్కడుందో గుర్తించి దానికి పూజలు నిర్వహించి, నరికి పూజారి నివాసం ఉంటున్న హుకుంపేటకు బండ్ల మీద తీసుకువస్తారు. అక్కడ తరతరాలుగా సంక్రమించిన హక్కును అనుసరించి వడ్రంగులు ఈ వృక్షాన్ని సిరిమానుగా మలుస్తారు.

 

 

సుమారు 50 అడుగుల ఎత్తు ఉండే సిరిమాను చివరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనం మీద అమ్మవారి ప్రతిరూపంగా ఆలయ ప్రధాన పూజారి ఆసీనులవుతారు. ఈ సిరిమాను మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి నుంచి బయలు దేరి కోట వరకు మూడు మార్లు ప్రదక్షిణ చేస్తుంది. సిరిమాను ఉత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. సిరిమానోత్సవాన్ని పూసపాటిరాజవంశీయులు కోట బురుజుమీద ఆసీనులయి తిలకించడం అనాదిగా జరుగుతోంది.

 

 

మొదటి పర్యాయం సిరిమాను కోట వద్దకు చేరి వంగి కోటకు నమస్కరించిన తరుణంలో రాజవంశీయులు నూతన వస్త్రాలతో పూజారిని సత్కరిస్తారు. సిరిమాను ముందుగా పాలధార, తెల్లఏనుగు, అంజలిరథం, బెస్తలవలస ఊరేగింపులో పాల్గొనడం ఆనవాయితీ. అమ్మవారి సిరిమానోత్సవం ముందురోజు తొలేళ్ల ఉత్సవాన అమ్మవారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలతో కన్నుల పండువుగా అలంకరిస్తారు. తొలేళ్లు రోజుకే ఉత్తరాంధ్ర అంతటి నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తొలేళ్ల రోజున అర్థరాత్రి పూజారి ఉపవాస దీక్షతో అమ్మవారిని పూజించి అమ్మవారి కథ చెప్పి విత్తనాలను ప్రజలందరికీ పంచుతాడు. ఈ విత్తనాలను కన్నులకద్దుకుని భద్రంగా ఇళ్లకు తీసుకొని వెళ్లి తమ పంట పొలాల్లో జల్లుతారు. పైడితల్లి అమ్మవారి కరుణాకటాక్షాలతో పంటలు బాగా పండుతాయన్నది రైతుల ప్రగాఢనమ్మకం.

 

 

పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం మరియు పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు. విజయనగర సామ్రాజ్య కాలంలో సిడి అనే ఉత్సవం జరిగేది. భక్త్యావేశంలో తమను తాము హింసించుకుంటూ, మొక్కుబడులు చెల్లించేందుకు భక్తులు ఈ ఉత్సవం చేసేవారు. ఒక పెద్ద గడ (పొడవాటి, లావాటి కర్ర) కొనకు ఒక ఇనుప కొక్కెం (Hook) కట్టేవారు. ఆ కొక్కెం గడ చుట్టూ తిరిగే ఏర్పాటు ఉండేది. భక్తులు ఆ కొండిని తమ వీపు చర్మానికి గుచ్చుకుని, వేళ్ళాడేవారు. అలా వేళ్ళాడుతుండగా గడను గిరగిరా తిప్పేవారు. పురుషులే కాక స్త్రీలు కూడా ఇలా వేళ్ళాడేవారు. ఈ సిడిని సిడిమ్రాను అని కూడా అంటారు. సిడి ఉత్సవానికి, అమెరికా ఆదివాసీ జాతులు జరుపుకునే సన్ డాన్స్ (సూర్య నృత్యం) కి సారూప్యం ఉండటం విశేషం.

 

 

 

తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మాహాత్మ్యము కావ్యంలో సిడిని ఇలా వర్ణించాడు:
       
అంబోధరము కింద నసియాడు, నైరావ
        తియుబోలె సిడి వ్రేలె తెరవయోర్తు