“అట్లతద్దె” రోజున గౌరీపూజ చేయండి

 

“అట్లతద్దె” రోజున గౌరీపూజ చేయండి

 

 

ఆశ్వీయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్దె పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఉపవాసముండాలి. ఇంట్లో తూర్పుదిక్కున మంటపము ఏర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడం, పాడడం చేయాలి. సాయంత్రం చంద్రదర్శనానికి తర్వాత తిరిగి స్నానం చేసి మళ్లీ గౌరీపూజచేసి, 10 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 10 అట్లు, 10 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దెనోము కథను చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక వస్త్రములు, దక్షినతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈ పండుగలో విశేషము. ఈ పండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లికాని అమ్మాయిలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లకు కలుగుతారని, ఐదోతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న విశ్వాసం .

 

 

కాగా.. అట్ల తద్దె లేదా అట్ల తదియగా పిలువబడే ఈ పండుగ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. “అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు” అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగువారికి వాయినాలివ్వటం పరిపాటి. ఆ రోజు సాయంత్రం వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదిలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.

 

 

త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్భలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్దె అని పురాణాలు చెబుతున్నాయి. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే ఈ వ్రతంలో చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువైవున్న ఆ పరాశక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యము పెరుగుతుందని విశ్వాసం.అలాగే ఈ వ్రతాన్ని ఆచరించే మహిళల కుటుంబములో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం.

 

 

ఇంకా రజోదయమునకు కారకుడైన కుజుడు ఋతుచక్రాన్ని సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడని విశ్వాసం. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు ప్రీతికరమైన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు కూడా ఇవి దోహదపడుతాయని పురోహితులు అంటున్నారు. అందుకే అట్లతద్దె రోజున ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారని పండితులు చెబుతున్నారు.