Read more!

శ్రీసాయిసచ్చరిత్రము పద్దెనిమిది - పందొమ్మిదవ అధ్యాయాలు - 1

 

 

శ్రీసాయిసచ్చరిత్రము


పద్దెనిమిది - పందొమ్మిదవ అధ్యాయాలు

 

 

 

హేమాడ్ పంతును బాబా ఎలా ఆమోదించి ఆశీర్వదించారు? సాఠేగారి కథ; దేశముఖ్ గారి భార్య కథ; సద్విచారాలను ప్రోత్సహించి సాక్షాత్కారానికి దారి చూపించటం; ఉపదేశంలో వైవిద్యం; నిందగురించి బోధ; కష్టానికి కూలి.
గత రెండు అధ్యాయాలలో బ్రహ్మజ్ఞానం అభిషలించే ఒక దానికున్ని బాబా ఎలా ఆడరించారో హేమాడ్ పంత్ వర్ణించారు. రాబోయే రెండు అధ్యాయాలలో హేమాడ్ పంత్ ను బాబా ఎలా ఆమోదించి ఆశీర్వదించారో, బాబా ఎలా తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షానికి మార్గం చూపిస్తున్నారో, ఆత్మ ఉన్నతి గురించి, పరనిందా వాక్యాల గురించి, ఇతరుల కష్టానికి ఇవ్వవలసిన ప్రతిఫలం గురించి బాబా వారి ప్రబోధాలు ఎలాంటివో వర్ణిస్తాను.
ప్రస్తావనం :
సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి, వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి, చివరికి వారి లక్ష్యాన్ని ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపుతుందనే విషయం మనందరికి తెలిసిందే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దాన్ని ఇతరులకు వెల్లడి చేయకూడదని కొందరు అంటారు. అలా గురువు బోధించిన దాన్ని వెల్లడి చేస్తే ఆ బోధలు నిష్ప్రయోజనం అవుతాయని వారి ఆలోచన. ఇది సరైంది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటివారు. వారు తమ అమృతతుల్యాలైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశాలలో కురిపిస్తారు. వాటిని మనం అనుభవించి హృదయానికి తృప్తిగా జీర్ణించుకొని, తరువాత నిస్సంకోచంగా ఇతరుల మేలుకోసం కూడా తెలియ చేసే విషయాలకు వర్తిస్తుంది. తన స్వప్నంలో కనిపించిన 'రామరక్షా స్తోత్రాన్ని' బుధకౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణ ఇక్కడ స్మరించాలి.
ప్రేమగల తల్లి, గుణం యిచ్చే చేదైన ఔషధాలను బిడ్డ మేలుకోసమే బలవంతంగా గొంతులోకి తోసినట్టు, ఆధ్యాత్మిక విషయాలను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గం రహస్యమైంది కాదు. అది బహిరంగామైంది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయం నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రాలను తెరిపించి ఆత్మయొక్క దైవీసౌందర్యాలను చూపించి మన కోరికలను నెరవేరుస్తారు. ఇది జరిగిన తరువాత, మన ఇంద్రియ విషయం వాంఛలు నిష్క్రమించి, వివేక వైరాగ్యాలు జంటఫలాలు చేతికి వస్తాయి. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తుతుంది. సద్గురువుల సహవాస్సం చేసి, వారిని సేవించి వారి ప్రేమను పొందిస్తే ఇదంతా మనకు లభిస్తుంది. భక్తుల కోరికలు నెరవేర్చే భగవంతుడు మనకు తోడ్పడి, మన కష్టాలను, బాధలను తొలగించి, మనల్ని సంతోషపెడతారు. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయం వల్లే జరుగుతుంది. సద్గురువుని భగవంతునిలా కొలవాలి. కాబట్టి మనం సద్గురువులను వెదకాలి. వారి కథలను వినాలి. వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయాలి. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథని ప్రారంభిస్తాను.
సాఠే :

 

 

 


సాఠే అనే అతను ఒకప్పుడు అత్యంత పలుకుబడి కలిగి ఉండేవాడు. కాలాంతరంలో వ్యాపారంలో చాలా నష్టం పొందాడు. అంతేగాక మరికొన్ని సమస్యలు అతన్ని చికాకు పరిచాయి. అందుకే అతను విచారగ్రస్తుడయ్యాడు. విరక్తి చెందాడు. మనస్సు చెడి చంచలం అవడంతో ఇళ్ళు విడిచి చాలా దూరం వెళ్ళాలి అనుకున్నాడు. మానవుడు సాధారణంగా భగవంతుని గురించి చింతించడు కానీ, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు చుట్టుకున్నప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందటానికి ప్రార్థిస్తాడు. వాడి పాపకర్మలు ముగిసే వేళకు భగవంతుడు వాడికొక యోగీశ్వరునితో కలుసుకునేలా సంభావింప చేస్తాడు. వారు తగిన సలహా యిచ్చి వాడి క్షేమాన్ని చూస్తారు. సాఠే గారికి కూడా అలాంటి అనుభవం కలిగింది. అతని స్నేనితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చారు. అక్కడ సాయిబాబాను దర్శించుకుని అనేకమంది శాంతి పొందుతుండేవారు. వారి కోరికలు కూడా నెరవేరు తుండేవి. సాఠేగారికి ఇది నచ్చింది. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చారు. అక్కడ శాశ్వత బ్రహ్మలా స్వయంప్రకాశుడై, నిర్మలుడు, శుద్ధస్వరూపుడైన సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనస్సు చంచలం తగ్గిపోయి శాంతి కలిగింది. వారి పూర్వజన్మ పుణ్యం వల్ల బాబా యొక్క పవితమైన పాదసేవ లభించింది. అతను గొప్ప మనోబలం కలవాడవటం వల్ల వెంటనే గురుచరిత్ర పారాయణ మొదలు పెట్టారు. 7రోజులలో చరిత్ర చదవటం పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతాన్ని చూపించారు. అది యిలా ఉండింది :
బాబా గురుచరిత్ర చేతిలో పట్టుకొని దానిలోని విషయాలను ఎదుట కూర్చున్న సాఠేకి బోధిస్తున్నట్టు, అతను దాన్ని శ్రద్ధగా వింటున్నట్లు చూపించారు. సాఠే నిద్రనుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం వుంచుకున్నారు. అత్యధికంగా సంతోషించారు. అజ్ఞానమనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోతున్న తనవంటి వారిని లేపి, గురుచారిత్రామృతాన్ని రుచి చూపించటం బాబా యొక్క దయార్థ్రహృదయమే కదా అనుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆ దృశ్యాన్ని కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావం ఏమై ఉన్బ్తుందో సాయిబాబాని అడిగి తెలుసుకోమన్నారు. ఒక సప్తాహం సరిపోతుందా లేకపోతే ఇంకొక సప్తాహం పారాయణ చేయాలో కనుక్కోమన్నారు. కాకాసాహెబు సమయం చూసి బాబాను ఇలా అడిగారు : "ఓ దేవా! ఈ దృశ్యంవలన సాఠేకి ఏమని చెప్పాలని నిశ్చయించావు? అతడు ఊరుకోవాలా లేక యింకొక సప్తాహం పారాయణ చేయాలా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేరాలి. అతనికి స్వప్నం అంతర్థానం బోధించాలి. వారిని ఆశీర్వదింప''మని కోరాడు. బాబా ఇలా చెప్పారు : "అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహం పారాయణ చేయాలి. ఆ గ్రంథాన్నే జాగ్రత్తగా పఠిస్తే అతడు పావనుడు అవుతాడు. భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధాలనుండి తప్పింస్తారు'' అన్నారు.
ఆ సమయంలో హేమాడ్ పంతు అక్కడ నుండి బాబా కాళ్ళు  వొత్తుతున్నాడు. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇలా అనుకున్నారు : "సాఠే యొక్క వారమే పారాయణ చేసి ఫలితాన్ని పొందాడు! నేను నలభై సంవత్సరాలనుంచి పారాయణ చేస్తున్నాను కాని నాకు ఫలితం లేదు కదా! అతడిక్కడ 7 రోజులు మాత్రమే నివశించాడు. మరి నేను 7 సంవత్సరాల నుండి ఉన్నాను. నా ప్రయత్నాలు నిష్ఫలమా ఏమిటి? చాతకపక్షి మేఘం నుండి పడే నీటి బిందువు కోసం కనిపెట్టుకుని ఉన్నట్టు నేను కూడా బాబా తమ దయామృతాం నాపై వర్షిస్తారని, వారి బోధనలతో నన్ను ఆశీర్వదిస్తారని కనిపెట్టుకుని ఉన్నాను''. ఈ ఆలోచన అతని మనస్సులో మెదలిన వెంటనే బాబా దాన్ని గ్రహించారు. భక్తుల మనస్సులలో మెదిలిన వెంటనే బాబా గ్రహించేవారు. అంతేకాక, చెడ్డ ఆలోచనలను అణుస్తూ, మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడ్ పంతు మనస్సును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి, శ్యామా దగ్గరికి వెళ్ళి అతని దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకొని, అతనితో కొంతసేపు మాట్లాడిన తరువాత రమ్మన్నారు. బాబా మనస్సులో కారున్యోదయం అయ్యింది. కాని వారు ఇలా ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞను జవదాటగల వారు ఎవరు?హేమాడ్ పంతు వెంటనే మసీదు విదిచి శ్యామా గృహానికి వెళ్ళాడు. అప్పుడే అతను స్నానం చేసి ధోవతి కట్టుకుంటూ ఉన్నారు. అతను బయటకు వచ్చి హేమాండ్ పంతుని ఇలా అడిగారు : "మధ్యాహ్న హారతి సమయంలో మీరిక్కడ ఎలా వున్నారు? మీరు మసీదునుండి వస్తున్నట్లు లేదే! మీరు ఎందుకు చికాకుతో చంచలంగా ఉన్నారు? మారు ఒంటరిగా వచ్చారెందుకు? కొంతసేపు కూర్చుని విశ్రాంతి పొందండి. నా పూజను ముగించి వస్తాను. ఈలోగా తాంబూలం వేసుకోండి. తరువాత ఆనందంగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకుందాం!'' ఇలా అంటూ అతడు లోపలి వెళ్ళిపోయారు. హేమాడ్ పంతు ముందుర వసారాలో కూర్చున్నారు. కిటికీలో ఏకనాథ భాగవతమనే ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉంది. ఇది భాగవతంలోని ఏకాదశస్కంధానికి ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానం. సాయిబాబా సిఫారసు చేయటంతో బాపూసాహెబు దీక్షితు (శ్రీకృష్ణుడికి, అర్జునుడికి జరిగిన సంభాషణ రూపమైన) భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థదీపిక (జ్ఞానేశ్వరి), (శ్రీకృష్ణుడికి అతని సేవకుడైన ఉద్ధవుడికి జరిగిన సంభాషణా రూపం) ఏకనాథ భాగవతం, మరియు భావార్థ రామాయణం నిత్యం షిరిడీలో చదువుతుండేవారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి, అటుపైన వారిని ఆ గ్రంథాల పారాయణాన్ని వినమని పంపుతుండేవారు. ఈ గ్రంథాలే భాగవత ధర్మంలోని ముఖ్యగ్రంథాలు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగాలకు వెళ్ళి, ఆ గ్రంథాలు వింటున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తుండేవి. హేమాడ్ పంతు కూడా నిత్యం ఏకనాథభాగవతాన్ని పారాయణ చేసేవాడు.
హేమాడ్ పంత్ ఆ రోజు తాను నిత్యం చదివే గ్రంథభాగాన్ని పూర్తి చేయకుండానే కొందరు భక్తులు కలిసి మసీదుకు వెళ్ళారు. శ్యామా ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథభాగవతాన్ని తీయగా తాను ఆనాడు పూర్తిచేయని భాగం దగ్గరే పుస్తకం తెరుచుకుంది. తన నిత్యపారాయణం పూర్తి చేయడానికే కాబోలు బాబా తనని ఇక్కడికి పంపించారని హేమాడ్ పంత్ అనుకున్నారు. వెంటనే తన నిత్యపారాయణం పూర్తి చేశారు. తరువాత శ్యామా తన పూజను ముగించి బయటకు వచ్చారు. వారిరువురికీ ఈ క్రింది సంభాషణ జరిగింది.

 

 

 



హేమాడ్ పంతు : నేను బాబా దగ్గరనుండి ఒక కబురు తీసుకొని వచ్చాను. బాబా నీ దగ్గరనుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన తరువాత మసీదుకు రమ్మని చెప్పారు.
శ్యామా : (ఆశ్చర్యంతో) నా దగ్గర డబ్బులేదు. నా 15 సాష్టాంగ నమస్కారాలు పైకానికి బదులుగా బాబాకు సమర్పించు.
హేమాడ్ పంతు : "సరే నీ నమస్కారం ఆమోదింపబడెను. మనం కూర్చుని కొంతసేపు మాట్లాడుకుందాం. మన పాపాలను నశింపచేసేటు వంటి బాబా లీలను, కథలను చెప్పు.
శ్యామా : అయితే కొంచెంసేపు కూర్చో. ఈ దేవుని (బాబా) లీలలు అత్యంత ఆశ్చర్యకరమైనవని నీకు ఇదివరకే తెలుసు. నేను పల్లెటూరి వాడిని' నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవు ఇక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూసే ఉంటావు. వాటిని నీముందు నేను ఎలా వర్ణించగలను? సరే ఈ తమలపాకులు వక్క, సున్నం తీసుకుని తాంబూలం వేసుకో. నేను లోపలికి వెళ్ళి దుస్తులు ధరించి వస్తాను.
కొద్ది నిముషాలలో శ్యామా బయటికి వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుతూ కూర్చున్నాడు. అతడు ఇలా అన్నాడు : "ఈ దేవుడి (బాబా) లీల కనుగొనటం కానిపని. వారి లీలలకు అంతులేదు. వాటిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదుస్తున్నట్టు కనపడినా వారు వాటిని అంటుకున్నట్టు కనిపించరు. మావంటి జానపదులకు ఏమి తెలుస్తుంది? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? మీవంటి పండితులను నావంటి పామరుని దగ్గరికి ఎలా పంపుతున్నారు? వారి మార్గాలు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను.'' ఈ ఉపోద్ఘాతంతో శ్యామా ఇలా అన్నాడు " నాకొక కథ జ్ఞాపకానికి వస్తున్నది. అది నీకు చెప్తాను. నాకది స్వయంగా తెలుసు. భక్తుడెంత మనోనిశ్చయంతో, పట్టుదలతో ఉంటాడో, బాబా అంత త్వరగా వారికి సహాయపడతారు. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన తరువాత వారికి ఉపదేశం ఇస్తారు.'' (ఇక్కడ ఉపదేశం అంటే నిర్దేశం)
ఉపదేశం అనే మాట విన్న వెంటనే హేమాడ్ పంతు మనస్సులో ఒక స్మృతి తళుక్కుమంది. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణం జ్ఞాపకానికి వచ్చింది. తన మనస్సుకు శాంతి కలిగించే నిమిత్తం బాబా తనని ఇక్కడకి పంపించారని అనుకున్నారు. అయినప్పటికీ ఈ భావాన్ని అణచుకొని, శ్యామా చెప్పే కథ వినడానికి సిద్ధపడ్డాడు. ఆ కథలన్నీ బాబాకు తన భక్తుల పట్ల ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉన్నాయో తెలుపుతాయి. వాటిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషం కలిగింది. శ్యామా ఈ క్రింది కథను చెప్పసాగాడు.
శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్ :
రాధాబాయి అనే ఒక ముసలమ్మా ఉండేది. ఆమె ఖాశాబా దేశ్ ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామప్రజలతో కలిసి షిరిడీకి వచ్చింది. బాబాను దర్శించుకుని అమితంగా తృప్తిచెందింది. ఆమె బాబాను గాఢంగా ప్రేమించింది. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందాలని మనోనిశ్చయం చేసుకుంది. ఆమెకి ఇంకేమీ తెలియకపోయేది. బాబా ఆమె సంకల్పాన్ని ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయకపోతే ఉపవాసం ఉండి చస్తానని మనోనిశ్చయం చేసుకుంది. ఆమె తన బసలోనే ఉండి భోజనం, నీళ్ళు మానివేసింది. అలా మూడు రోజులు గడిచాయి. ఆమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి ఆమె పక్షంలో బాబాతో ఇలా అన్నాను : "దేవా! మీరేమి ప్రారంభించారు? నీవు అనేకమందిని ఇక్కడకి ఈడుస్తావు. ఆ ముదుసలిని నీకు తెలిసే ఉంటుంది. ఆమె అత్యంత పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చేవరకు ఉపవాసం ఉండాలని నిశ్చయించుకుంది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చేవరకు ఆమె తన నిరాహారదీక్షను మానదు. ఆమెకి ఏమైనాహాని జరిగితే ప్రజలు నిన్నే నిందిస్తారు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవడంతో ఆమె చచ్చిందని లుకులు అంటారు. కాబట్టి ఆమెను కరుణించు, ఆశీర్వదించు, ఆమెకు తగినదారి చూపించు!'' ఆమె మనోనిశ్చయాన్ని చూసి, బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధంగా బోధిచారు:
"ఓ తల్లీ! అనవసరమైన యాతనకి ఎందుకు పాల్పడి చావును కోరుకుంటున్నావు? నీవు నిజంగా నా తల్లివి; నేను నీ బిడ్డను. నాయందు కనికరించి నేను చెప్పేది పూర్తిగా విను! నీకు నా వృత్తాంతాన్ని చెపుతాను. నీవు దాన్ని బాబా వింటే నీకది మేలు చేస్తుంది. నాకొక గురువు ఉండేవాడు. వారు గొప్ప యోగీశ్వరులు' అత్యంత దయార్థ్రహృదయులు. వారికీ చాలా శుశ్రూష చేశాను. కాని నా చెవిలో వారు ఏ మంత్రమూ ఊదలేదు. నాకు వారిని వదిలివెళ్ళే తలంపే లేకపోయేది. నేను వారితోనే ఉండటానికి, వారి సేవ చేయడానికి, వారి వద్ద కొన్ని ఉపదేశాలను గ్రహించడానికి నిశ్చయించుకున్నాను. కాని వారి మార్గం వారిది. వారు నా తల గొరిగించారు; నానుండి రెండు పైసలు దక్షిణ అడిగారు. నేను దాన్ని వెంటనే వారికీ సమర్పించాను. 'మీ గురువుగారు పూర్ణకాములు అయితే వారు మిమ్మల్ని దక్షిణ అడగటం ఎందుకు? వారు నిష్కాములని ఎలా అనిపించుకుంటారు?' అని నీవు అడగవచ్చు. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనంతో వారు చేసేది ఏముంది? వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ, రెండోది సంతోష స్థైర్యాలతో కూడిన ఓరిమి! నేనీ రెండింటినీ వారికి అర్పించాను. వారు ప్రసన్నులయ్యారు.

"నా గురువును అలా 12 సంవత్సరాలు సేవించాను. వారే నన్ను పెంచి పోషించారు. భోజనానికి కాని వస్తాలకు కాని నాకు లోటు లేకుండా ఉండేది. వారు పరిపూర్నులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చు. ఆ ప్రేమను నేను ఎలా వర్ణించగలను? వారు నన్ను అధికంగా ప్రేమించేవారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానంలో ఉన్న వారిని తదేకంగా చూస్తుండేవాడిని. మేమిద్దరం ఆనందంలో మునిగిపోయే వాళ్ళము. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చాను. వారిని చూడకపోతే నాకు శాంతి లేకపోయేది. వారి ధ్యానం వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకపోయేది. వారే నా ఆశయం. నా మనస్సు ఎల్లప్పుడూ వారిలోనే నాటుకుని ఉండేది. ఇదే వారడిగిన దక్షిణలో ఒక పైసా. 'సబూరి' (సంతోష స్థైర్యాలతో కూడిన ఓరిమి) అనేది రెండవ పైస. నేను అత్యంత సంతోషంతో చాలాకాలం కనిపెట్టుకుని వారి సేవ చేశాను. ఈ ప్రపంచమనే సాగరాన్ని 'సబూరి' అనే ఓడ నిన్ను సురక్షితంగా దాటిస్తుంది. సబూరి అనేది అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపాలన్నిటినీ తొలగిస్తుంది; కష్టాలను, పారద్రోలుతుంది. అనేక విధాల అవాంతరాలను తోలిగించి, భయాన్ని పారద్రోలుతుంది. చివరికి జయాన్ని కలుగజేస్తుంది. సబూరి అనేది సుగుణాలకు గని, మంచి ఆలోచనకు తోడువంటిది. నిష్ఠ, సబూరి అనేవి అన్యోన్యమైన అక్కాచెల్లెళ్ళ వంటివి.
"నా గురువు నానుండి మిగిలినవి ఏవీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాలసర్వాస్థలలో కాపాడుతుండేవారు. నేను వారితో కలిసి ఉండే వాణ్ణి. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి విడిచి ఉన్నా, వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టితోనే నన్ను కాపాడుతుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు, నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషిస్తుండేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉంటుంది. బిడ్డ తాబేలు రెండవ ఒడ్డుపై ఉంటుంది. తల్లి తాబేలు, పిల్ల తాబేలుకు ఆహారం పెట్టడంకాని, పాలివ్వడంకాని  చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిస్తుంది. పిల్లలేదిగి పెద్దవి అవుతాయి. అలాగే మా గురువు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి, నన్ను ప్రేమతో కాపాడారు. ఓ తల్లీ! నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రాన్ని ఎలా ఊదగలను? గురువు యొక్క ప్రేమమయిన తాబేలు చూపే మనకు సంతోషాన్ని ఇస్తుందని జ్ఞాపకం వుంచుకో. మంత్రముగాని, ఉపదేశం కానీ ఎవ్వరి దగ్గరనుండి కాని పొందడానికి ప్రయత్నించకు. నీ ఆలోచనలు, నీవు చేసే పనులు నాకోరకే వినియోగించు. నీవు తప్పక పరమార్థాన్ని పొందుతావు. నావైపు సంపూర్ణ హృదయంతో చూడు. నేను నీవైపు అలాగే చూస్తాను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెపుతాను. నిజం తప్ప మరేమీ మాట్లాడను. నీ సాధనాలు కాని ఆరు శాస్త్రాలలో ప్రావీణ్యం కాని అవసరం లేదు. నీ గురువులో ప్రేమ విశ్వాసాలు ఉంచు. గురువే సర్వం చేసే వాడని, కర్త అనీ పూర్తిగా నమ్ము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనాన్ని గ్రహిస్తారో, ఎవరయితే గురువుని బ్రహ్మవిష్ణుమహేశ్వర స్వరూపుడని తలుస్తారో వారే ధన్యులు!''
ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించారు. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసాన్ని వదులుకుంది.
ఈ కథని జాగ్రత్తగానూ, శ్రద్ధగానూ విని దాని ప్రాముఖ్యాన్ని, సందర్భాన్ని గుర్తించి, హేమాడ్  పంతు ఆశ్చర్య పోయారు. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూసి అతని ఆపాదమస్తకం పులకించింది. సంతోషంతో ఉప్పొంగింది. గొంతు తడారిపోయింది. ఒక్క మాటైనా మాట్లాడడానికి చేతకాలేదు. శ్యామా అతన్ని ఈ స్థితిలో చూసి "ఏమి జరిగింది? ఎందుకు ఊరుకున్నారు? అలాటి బాబా లీలలు నీకెన్ని వర్ణించాలి?'' అని అడిగాడు.
అదే సమయంలో మసీదులో గంట మ్రోగింది. మధ్యాహ్నహారతి పూజ ప్రారంభమయ్యిందని గ్రహించారు. కాబట్టి శ్యామా, హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా వెళ్ళారు. బాపూసాహెబు జోగు అప్పుడే హారతి ప్రారంభించారు. స్త్రీలు మసీదులో నిండిపోయారు. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిపోయారు. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుతున్నారు. బాబాకు కుడివైపు శ్యామా; ముందర హేమాడ్ పంతు కూర్చున్నారు. వారిని చూసి బాబా హేమాడ్ పంతును శ్యామా యిచ్చిన దక్షిణ యివ్వమన్నారు. శ్యామా రూపాయలకు బదులు నమస్కారాలు యిచ్చారు. శ్యామా ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి అడగవచ్చు అన్నారు. బాబా ఇలా చెప్పారు : "సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారా? అలాగయితే మీరేమి మాట్లాడుకున్నారో చెప్పు'' గంటల చప్పుడూ, మద్దెల శబ్దమూ, పాటల ధ్వనిని లెక్కచేయక హేమాడ్ పంతు బాబాకు నరిగినదంతా చెప్పడానికి ఆత్రపడ్డారు. తాము ముచ్చటించింది అంతా తనకు చాలా ఆనందం కలుగజేసిందనీ, ముఖ్యంగా ముసలమ్మ కథ అత్యంత ఆశ్చర్యం కలగజేసిందనీ, దాన్ని విని బాబా లీలలు అగోచరాలని తెలుసుకున్నాననీ ఆ కథ రూపంతో తనను బాబా ఆశీర్వదించారని హేమాడ్ పంతు చెప్పారు. అప్పుడు బాబా "కథ చాలా అద్బుతమైనది. నీవు ఎలా ఆనందించావు? నాకా విషయమై వివరాలన్నీ చెప్పు'' అన్నాడు. అప్పుడు హేమాడ్ పంతు తాను ఇంతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనసులో శాశ్వత ప్రభావం కలిగించిందని చెప్పారు. ఇది విని బాబా అమితంగా సంతోషించారు. "ఆ కథ నీకు నచ్చిందా? దాని ప్రాముఖ్యాన్ని నీవు గుర్తించావా?'' అని బాబా హేమాడ్ పంతుని అడిగారు. "అవును బాబా నా మనస్సు చంచలం నిష్క్రమించింది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగింది. సత్యమార్గాన్ని కనుగొనగలిగాను'' అని హేమాడ్ పంతు బదులిచ్చారు.

 

 

 


బాబా ఇలా చెప్పారు : "నా పధ్ధతి అత్యంత విశిష్టమైంది! ఈ ఒక్క కథను జ్ఞాపకం ఉంచుకో. అది అత్యంత ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం అవసరం. దాన్ని అలవరచుకుంటే వృత్తులన్నీ శాంతిస్తాయి. కోరికలన్నీ విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశిలో ఉన్న భగవంతుణ్ణి ధ్యానించు. మనస్సు ఎకాగ్రమైతే లక్ష్యం నెరవేరుతుంది. సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానించు! అదే జ్ఞానస్వరూపం, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేకపోతే రాత్రింబవళ్ళు మీరు చూస్తున్న నా యీ ఉపకారాన్ని ధ్యానించండి. అలా కొన్నాళ్ళు చేయగామీ వృత్తులు కేంద్రీకృతమవుతాయి. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అనే మూడింటికి ఉన్న భేదము పోయి ధ్యానించే వాడు చైతన్యంతో ఐక్యమై, బ్రహ్మముతో భిన్నమవుతుంది. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటాయి. దాని పిల్ల యింకొక ఒడ్డున ఉంటుంది. తల్లి దానికి పాలివ్వడం కానీ, పోదువుకోవడం కానీ చేయదు. దాని చూపు మాత్రమే వాడికి జీవశక్తిని ఇస్తున్నది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకుంటుంది. తల్లి తాబేలు చూపు చిన్నదానికి అమృతధారలా పనిచేస్తుంది. అదే వాని బ్రతుకుకి సంతోషానికి ఆధారం. గురువుకు, శిష్యుడికి గల సంబంధం ఇలాంటిదే'' బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి, హారతి పూర్తయ్యింది. అందరూ 'శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై' అని జయజయధ్వానాలు చేశారు. ఓ ప్రియ పామిఠకులారా! ఈ సమయంలో మనం కూడా మసీదులోని జనసమూహంతో కలిసి ఉన్నట్లు భావించి, మనం కోదా ఆ జయజయధ్వనులలో పాల్గొందాము.
హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచి పెట్టారు. బాబాకు నమస్కరించి బాపూసాహెబు జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టారు. బాబా దానంతా హేమాడ్ పంతు చేతిలో పెట్టి ఇలా అన్నారు : "ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞాపకాన్ ఉంచుకుంటే, నీ స్థితి కలకండలా తియ్యగా ఉంటుంది. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నీవు సుఖంగా ఉంటావు'' హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, "ఇలా ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించు, ఆశీర్వదించు, కాపాడు!'' అని ప్రార్థించారు. అందుకు బాబా ఇలా జవాబిచ్చారు : "ఈ కథను విను. దీన్ని మననం చేసుకో. నిధి ధ్యాసనం చేయి. అలాగయితే నీవు భగవంతుణ్ణి ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుని ధ్యానిస్తావు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షం అవుతాడు''
ఓ ప్రియమైన చదువుతున్న వారు! అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదం దొరికింది. ఇప్పుడు మనం ఈ కథ అనే కలకండ ప్రసాదం పొందుదాము. దాన్ని హృదయపూరితంగా సేవించి, ధ్యానించి, మనస్సులో నిలుపుకుందాం. ఇలా బాబా కృపతో బలంగానూ, సంతోషంగాను ఉందాము. తథాస్తు!