Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ఎనిమిదవ అధ్యాయము రెండవరోజు పారాయణము

 

రెండవరోజు పారాయణము


శ్రీసాయిసచ్చరిత్రము

ఎనిమిదవ అధ్యాయము

 

 

మానవజన్మ యొక్క ప్రాముఖ్యము :
ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవయక్షగంధర్వాదులు, జంతుకీటకాదులు, మనుషులు మొదలైన వాటిని సృష్టించాడు. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశములో నివశించే జీవకోటి అంతా సృష్టించాడు. వీరిలో ఎవరి పుణ్యము ఎక్కువ అవుతుందో వారు స్వర్గానికి పోయి వారి పుణ్యఫలము అనుభవించిన తరువాత త్రోసి వేయబడతారు. ఎవరి పాపము ఎక్కువ అవుతుందో వారు నరకమునకు పోతారు. అక్కడ వారు పాపాలకు తగినట్లు బాధలను పొందుతారు. పాపపుణ్యములు సమానంగా ఉన్నప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనము కోసం అవకాశము పొందుతారు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగుతుంది. వేయి సంవత్సరముల మోక్షముగాని, పుట్టుకగాని వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉంటుంది.

మానవశరీరము యొక్క ప్రత్యేక విలువ :

 

 

 

జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యం. మానవునికి ఇవి కాక మరొక్క ప్రజ్ఞ ఉంది. అదే జ్ఞానము. దీని సహాయంతోనే మానవుడు భగవంతుని సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మలోనూ దీనికి అవకాశము లేదు. ఈ కారణముతోనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూస్తారు. వారు కూడ భూమిపై మానవజన్మ ఎత్తి మోక్షాన్ని సాధించాలని కోరుకుంటారు. కొంతమంది మానవజన్మ చాలా నీచమైనదని, చీము, రక్తము, మలములతో నిండి ఉంటుందని, చివరికి శిథిలమై రోగానికి, మరణానికి కారణమావుతారని అంటారు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునికి జ్ఞానము సంపాదించే శక్తి వుంది. శరీరము ఉన్నది కాబట్టే మానవుడు తన దేహం యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి, ఇంద్రియ సుఖాలపట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకంతో చివరికి భగవంతుని సాక్షాత్కారాన్ని పొందగలుగుతున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరిస్తే మోక్షాన్ని సంపాదించే అవకాశము పోగొట్టుకుంటాము. దేహాన్ని ముద్దుగా పెంచి విషయ సుఖాలకు అలవాటు పడితే నరకంలో పడతాము. ఉచిత మార్గము ఏమిటంటే దేహాన్ని అశ్రద్ధ చేయకూడదు; దాన్ని లోలత్వముతో పోషించనూ కూడదు. తగిన జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. గుఱ్ఱం రౌతు తన గమ్యస్థానాన్ని చేరేవరకు గుఱ్ఱాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. ఈ శరీరాన్ని మోక్షసాధన, లేక ఆత్మసాక్షాత్కారము కోసం వినియోగించాలి. ఇదే జీవుని పరమావధి అయి ఉండాలి.

 

 

భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృప్తి కలగలేదట. ఎందుకంటే భగవంతుని శక్తిని అవేవీ గ్రహించలేకపోయాయి. అందుకే భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించాడు. వారికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ఇచ్చాడు. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యాలను, శేముషీ విజ్ఞానాలను చూచి పరవశం పొందినప్పుడు భగవంతుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు. అందుకే మానవజన్మ లభించడం గొప్ప అదృష్టము. బ్రాహ్మణజన్మ పొందటం అందులోనూ శ్రేష్ఠము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేసే అవకాశము కలగటం.

మానవుని విద్యుక్త ధర్మము :

 

 

 

మానవజన్మ విలువైనదని, దానికి ఎప్పటికైనా మరణము అనివార్యమనీ గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగ్రత్త పడుతూ ఉండి జీవిత పరమావధిని సాధించటం కోసం ప్రయత్నించాలి. ఏ మాత్రము అశ్రద్ధగాని, ఆలశ్యముగాని చేయరాదు. త్వరలో దాన్ని సంపాదించటానికి ప్రయత్నించాలి. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కోసం ఎంత తాపత్రయ పడతాడో, తప్పిపోయిన యువరాజు కోసం చక్రవర్తి ఎంతగా వెదికే ప్రయత్నం చేస్తాడో అలాగే, విసుగూ విరామమూ లేకుండా రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించు కోవాలి. బద్ధకాన్ని, అలసతను, కునుకుపాట్లను దూరంగా ఉంచి అహోరాత్రులు ఆత్మలోనే ధ్యానము నిలపాలి. ఈ మాత్రము చేయలేకపోతే మనము పశువులము అవుతాము.

తక్షణ కర్తవ్యము :

 

 

 

మన ధ్యేయము త్వరగా ఫలించే మార్గము ఏదంటే, వెంటనే భగవంతుని సాక్షాత్కారము పొందిన సద్గురువు దగ్గరికి వెళ్ళటం అధ్యాత్మిక ఉపన్యాసాలు ఎన్ని విన్నప్పటికీ పొందనటువంటిదీ, అధ్యాత్మికగ్రంథాలు ఎన్ని చదివినా తెలియనటువంటిది ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముతో పొందవచ్చు. నక్షత్రములు అన్నీ కలిసి యివ్వలేని వెలుతురును సూర్యుడు ఎలా ఇవ్వగలుగుతున్నాడో అలాగే ఆధ్యాత్మిక ఉపన్యాసములు, గ్రంథములు యివ్వలేని జ్ఞాన్నాన్ని సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌనప్రబోధాలు. శాంతి, క్షమా, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహాలను స్వాధీనంలో ఉంచుకోవటం, అహంకారం లేకుండా ఉండటం మొదలైన శుభలక్షణాలను వారి ఆచరణలో చూచి, భక్తులు నేర్చుకుంటారు. వారి పావనచరితములు భక్తుల మనసులకు ప్రబోధము కలగజేసి వారిని పారమార్థికంగా ఉద్ధరిస్తుంది. సాయిబాబా అలాంటి మహాపురుషుడు, సద్గురువు.

 

 

బాబా సామాన్య ఫకీరులా సంచరిస్తున్నప్పటికీ వారు ఎప్పుడూ ఆత్మానుసంధానములోనే నిమగ్నమవుతుంటారు. దైవభక్తి గల హృదయం ఉన్నవారు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖాలకు ఉప్పొంగేవారు కాదు, కష్టాల వలన కృంగిపోయేవారు కాదు. రాజైనా, నిరుపేదైనా వారికి సమానమే. తమ దృష్టిలో మాత్రం ముష్టివాణ్ణి చక్రవర్తిని చేయగలశక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికీ తిరిగి భిక్ష ఎత్తుకునేవారు! వారి భిక్ష ఎలాంటిదో చూద్దాము.

బాబా యొక్క భిక్షాటన :

 

 

 

షిరిడీ వాసులు పుణ్యాత్ములు. ఎందుకంటే, వారి ఇళ్ళ ఎదుటే కదా బాబా భిక్షకుడిలా నిలిచి, "అమ్మా! రొట్టెముక్క పెట్టు'' అంటూ, దాన్ని అందుకోవడానికి చేయి చాచేవారు! చేతిలో ఒక రేకుడబ్బా పట్టుకొని, భుజానికి ఒక గుడ్డజోలె తగిలించుకొని భిక్షాటనకు వెళ్ళేవారు. బాబా కొన్ని ఇళ్ళకు మాత్రమే భిక్షకి వెళ్ళేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు, కూరలు మొదలైనవి రేకుడబ్బాలో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలైనవి జోలెలో వేయించుకునే వారు. బాబాకు రుచి అన్నది లేదు. వారు జిహ్వను స్వాధీనంలో ఉంచుకున్నారు. కాబట్టి అన్ని పదార్థాలను రేకుడబ్బాలోనూ, జోలెలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థాలను ఒకేసారి కలిపేసి భుజించి సంతోషం పొందేవారు. పదార్థాల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనేది లేనట్టే కనిపిస్తూ ఉండేది.

 

 

బాబా భిక్షకి ఒక పధ్ధతి, కాల నియమం లేకపోయేది. ఒక్కొక్క రోజు కొన్ని యిళ్ళ దగ్గర మాత్రమే భిక్ష అడిగేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకి వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థాలు అన్నింటినీ ఒక మట్టిపాత్రలో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తింటూ ఉండేవి. వాటిని తరిమే వారు కాదు. మసీదు తుడిచి శుభ్రము చేసే స్త్రీ 10-12 రొట్టెముక్కలను నిరాటంకంగా తీసుకుంటూ ఉండేది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డుపెట్టనివారు, ఆకలితో వున్న పేదల ఆహారానికి అడ్డు చెప్తారా? "ఫకీరు పదవే నిజమైన మహారాజు పదవి అనీ, అదే శాశ్వతమనీ, మామూలు సిరిసంపదలు క్షణభంగం అనీ'' బాబా అంటుండేవారు. ఆ పావనచరితుని జీవితము వంటి జీవితమే కదా అత్యంత ధన్యమైనది!

 

 

మొదట షిరిడీ ప్రజలు బాబాని ఒక పిచ్చి ఫకీరు అని భావించి, అలాగే పిలిచేవారు. భోజన ఉపాధికోసం, రొట్టెముక్కలకోసం గ్రామంలో భిక్ష ఎత్తి పొట్ట నింపుకునే పేదఫకీరు అంటే ఎవరికి గౌరవముంటుంది? కానీ, ఈ ఫకీరు పరమవిశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమైనా లేని నిరాసక్తుడు. బాహ్యదృష్టికి వారు చంచులుగా, స్థిరత్వము లేని వారిగానూ కనిపించినా లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి, సేవించిన ధన్యజీవులు కొద్దిమంది ఉన్నారు. అలాంటివారిలో ఒకరి వృత్తాంతము ఇక్కడ చెప్పబోతున్నాను.

బాయజాబాయి యొక్క ఎనలేని సేవ :

 

 

 

తాత్యాకోటే పాటీలు తల్లి పేరు బాయజాబాయి. ఆమె ప్రతిరోజూ మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకొని, సమీపంలో ఉన్న చిట్టడవిలో ముళ్ళపొదలు లెక్కచేయకుండా క్రోసులకొద్దీ దూరము నడిచి, ఆత్మధ్యానంలో నిశ్చలంగా ఎక్కడో కూర్చున్న బాబాను వెదికి పట్టుకొని, భోజనము పెడుతూ ఉండేది. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, వారి ఎదుట విస్తరి ఒకటి వేసి తాను తీసుకొచ్చిన రొట్టె, కూర మొదలైన భోజన పదార్థాలను వడ్డించి, కొసరికొసరి వాటిని బాబాతో తినిపిస్తూ ఉండేది.

 

 

ఆమె భక్తివిశ్వాసాలు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరచిపోలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె కుమారుడైన తాత్యాపాటీలును ఎంతోఆదరించి, ఉద్దరించారు. ఆ తల్లీకోడుకులకు బాబా సాక్షాత్తు భగవంతుడనే విశ్వాసం ఉండేది. కొన్ని సంవత్సరముల తరువాత బాబా అడవులకు వెళ్ళటం మాని మసీదులోనే కూర్చుని భోజనం చేయసాగారు. అప్పటినుంచి పొలములో తిరిగి బాబాను వెతికిపట్టుకొనే శ్రమ బాయజాబాయికి తప్పింది.

ముగ్గురి పడక స్థలము :

 

 

 

ఎవరి హృదయములో సదా వాసుదేవుడు నివశిస్తూ ఉంటాడో అలాంటి మహాత్ములు ధన్యులు. అలాంటి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోటే పాటీలు, మహల్సాపతి ఇద్దరూ అలాంటి అదృష్టవంతులు. బాబా వారిద్దరిని సమానంగా ప్రేమిస్తూ ఉండేవారు. బాబా వీరిద్దరితో కలిసి, మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరాల వైపు చేసి, మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగిలేలా పడుకొనేవారు. పక్కలు పరచుకొని వాటిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకొనే వారు. అందులో ఎవరికైనా నిద్ర వస్తున్నట్లు కనిపిస్తే మిగతా వారు వారిని మేల్కొల్పుతూ ఉండేవారు. తాత్యా పడుకుని గుర్రుపెడితే బాబా అతన్ని అటూ యిటూ ఊపి, అతని శిరస్సును గట్టిగా నొక్కుతుండేవాడు. బాబా ఒక్కొక్కసారి మహాల్సాపతిని అక్కున చేర్చుకుని, అతని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధంగా 14 సంవత్సరాలు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమతో మసీదులోనే పడుకొనేవారు. అవి మరపురాని మధురరోజులు. బాబా ప్రేమానురాగాలు కొలవలేనివి;వారి అనుగ్రహము ఇంత అని చెప్పడానికి చాలదు. తండ్రి మరణించిన తరువాత తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రపోవటం ప్రారంభించారు.

రహతా నివాసి కుశాల్ చంద్ :

 

 

 

షిరిడీలో (తాత్యా తండ్రిగారైన) గణపతిరావుకోతే పాటీలును బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూసేవారో, అంతటి ప్రేమాదారాలతోనే రహతా నివాసి అయిన చంద్రభాను శేట్ మార్వాడీని చూపిస్తూ ఉండేవారు. ఆ శేట్ మరణించిన తరువాత అతని ఆనం కొడుకైన కుశాల్ చందును కూడా అమిత ప్రేమతో చూస్తూ అహర్నిశలు అతని యోగక్షేమ కనుక్కుంటూ ఉండేవారు. ఒకొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దులబడి మీద బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా వెళ్ళేవారు. రహతా ప్రజలు బాజాభజంత్రీలతో ఎదురేగి, బాబాను గ్రామసరిహద్దు ద్వారం దగ్గర దర్శించి, సాష్టాంగనమస్కారాలు చేసేవారు. తరువాత అత్యంత వైభవంగా బాబాను గ్రామం లోపలికి సాదరముగా తీసుకొని వెళ్ళేవారు. కుశాల్ చందు బాబాను తన యింటికి తీసుకునివెళ్ళి తగిన అసనములో కూర్చోపెట్టి భోజనము పెట్టేవాడు. ఇద్దరూ కొంతసేపు ప్రేమతో ఉల్లాసంగా ముచ్చటించుకొనేవారు. తరువాత బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుకుంటూ ఉండేవారు. షిరిడీ గ్రామానికి సమాన దూరంలో ఒకవైపు (దక్షిణంలో) రహతా, మరోవైపు (ఉత్తరదిశలో) నీమ్ గాం ఉన్నాయి. ఈ రెండు గ్రామాలు దాటి బాబా ఎన్నడూ ఎక్కడికీ వెళ్ళిలేదు. వారు ఎప్పుడూ రైలుబండిలో ప్రయాణము చేసి ఎరుగరు; రైలుబండిని కనీసము చూసి కూడా ఉండలేదు. కానీ, సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలుస్తూ ఉండేవి. బాబా దగ్గర సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేసేవారికి ఎలాంటి కష్టాలు ఉండేవి కాదు. బాబా ఆదేశానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు అనేక కష్టాలుపాలు అవుతుండేవారు. అటువంటి కొన్ని సంఘటనలను, మరికొన్ని ఇతర విషయాలను రాబోవు అధ్యాయములో చెప్పుకుందాము.