Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ఏడవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము 


ఏడవ అధ్యాయము

 

 

 

అద్భుతావతారము :

సాయిబాబా హిందువనుకుంటే వారు మహమ్మదీయునిలా కనిపించేవారు. మహమ్మదీయుడు అనుకుంటే హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించేవారు. ఆయన హిందువా లేక మమ్మదీయుడా అన్న విషయం ఇదిమిద్దంగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఇత్సవాన్ని జరిపిస్తూ ఉండేవారు. అదేకాలంలో మహమ్మదీయుల చందనోత్సవాన్ని జరిపడానికి అనుమతించేవారు. ఈ ఉత్సవ సమయంలో కుస్తీపోతీలను ప్రోత్సహిస్తూ ఉండేవారు. గెలిచినవారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి రోజు గోపాల్ కాలోత్సవము జరిపించేవారు. ఈదుల్ ఫితర్ పండుగరోజు మహామ్మదీయులతో మసీదులో నమాజు చేయిస్తూ ఉండేవారు. మొహర్రం పడుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిల్పి, కొన్ని రోజులు దానిని అక్కడ వుంచి తరువాత గ్రామంలో ఊరేగిస్తామనే వారు. నాలుగు రోజులవరకు మసీదులో తాబూతు ఉంచడానికి సమ్మతించి అయిదవ రోజు నిస్సంకోచముగా దాన్ని తామే తీసి వేసేవారు.

 

 

వారు మహామ్మదీయులంటే హిందువులలాగా చెవులు కుట్టి ఉండేవి. వారు హిందువులంటే సున్ తీ ని ప్రోత్సహించేవారు. బాబా హిందువైతే మసీదులో ఎందుకు ఉండేవారు. మహామ్మదీయుడైతే దునియను అగ్నిహోత్రము ఎలా వెలిగించి ఉండేవారు? అదేగాక, తిరగలితో విసరటం, శంఖము ఊదటం, గంట వాయించటం, హోమము చేయటం, భజన, అన్నసంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదాలతో పూజలు మొదలైన మహమ్మదీయ మతానికి అంగీకారం కాని విషయములు మసీదులో జరుగు తున్దేవి. వారు మహామ్మదీయులైతే కర్మిష్టులైన సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదాలపై సాష్టాంగ నమష్కారం ఎలా చేస్తూ ఉండేవారు.

 

 

వారే తెగవారని అడగబోయిన వారందరూ వారిని సందర్శించిన వెంటనే మూగులౌతూ పరవశిస్తూ ఉండేవారు. అందుకే సాయిబాబా హిందువో, మహామ్మదీయుదో ఎవరూ సరిగా నిర్నయించలేక పోయారు. ఇది ఒక వింతకాదు. ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి వేడుకుంటారో వారు దేవునితో ఐక్యమై పోతారు. వారికి దేనితో సంబంధముగాని, భేదభావముగాని ఉండదు. వారికి జాతి, మతాలతో ఎలాంటి సంబంధము లేదు. సాయిబాబా అలాంటి వారు. వారికి జాతిలో, వ్యక్తులలో భేదము కనిపించేది కాదు. ఫకీరులతో కలిసి బాబా మత్స్య, మాంసాలను భుజించేవారు. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టిన సనుక్కునేవారు కాదు.

 

 

శ్రీ సాయి అవతారము విశిష్టమైనది; అద్భుతమైనది. నా పూర్వసుకృతం వాళ్ళ వారి పాదముల చెంతకూర్చునే భాగ్యము లభించింది. వారి సాంగత్యము లభించడం నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనంద ఉల్లాసాలు చెప్పలేనటువంటివి. సాయిబాబా నిజంగా శుద్దానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనాన్ని, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్ముకుంటారో వారికి ఆత్మానుసంధానము కలుగుతుంది. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేకమంది సాయిబాబా దగ్గరకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తిరుగుతున్నప్పటికీ వారి నాలుకపై 'అల్లామాలిక్' అనే మాట ఎప్పుడూ నాట్యమాడుతూ ఉండేది. వారికి వాదవివాదాలు గాని, చర్చలుగాని యిష్టము లేదు. అప్పుడప్పుడూ కోపం వహించినప్పటికీ, వారు ఎప్పుడూ శాంతముగాను, సంయమంతో ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వాన్ని బోధిస్తూ ఉండేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియలేదు. వారు ప్రభువులను భిక్షకులను ఒకే తీరుగా ఆదరించారు.

 

 

అందరి అంతరంగాల్లో గల రహస్యాలన్నీ బాబా తెలుసుకునేవారు. బాబా ఆ రహస్యాలను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యం చెందుతూ ఉండేవారు. వారు సర్వజ్ఞులయినప్పటికీ ఏమీ తెలియని వారివలె నటిస్తూ ఉండేవారు. సంమానములంటే వారికి ఏమాత్రం ఇష్టము లేదు. సాయిబాబా నిజము అటువంటిది. మానవదేహముతో సంచరిస్తూ ఉన్నప్పటికీ, వారి చర్యలను బట్టి చూస్తే వారు సాక్షాత్తూ భగవంతుడే అని చెప్పాలి. వారిని చూసిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడే అంకుంటూ ఉండేవారు. వట్టి మూర్ఖుడినైన నేను బాబా మహిమలను ఎలా వర్ణించగలను?

సాయిబాబా వైఖరి :

 

 

 

షిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ-శంకర, గ్రామదేవత, మారుతీ మొదలైన దేవాలయాలన్నింటినీ తాత్యాపాతీలు ద్వారా బాబా మరమ్మత్తు చేయించారు. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపంగా వసూలు అయిన పైకమంతా ఒక్కక్కరికి రోజు ఒక్కొక్కింటికి రూ.50,రూ.20, రూ.15 ల చొప్పున ఇష్టమొచ్చినట్టు పంచిపెట్టే వారు.

 

 

బాబాను దర్శించినంత మాత్రాన ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులు అవుతూ ఉండేవారు. దుర్మార్గులు సన్మార్గులుగా మారుతూ ఉండేవారు. కుష్ఠువారు కూడా రోగవిముక్తులు అవుతుండేవారు. అనేకమందికి కోరికలు నెరవేరితూ ఉండేవి. ఎటువంటి మందులు పసరులతో పనిలేకుండా గుడ్డివారికి చూపు వస్తూ ఉండేవి. కుంటివారికి కాళ్ళు వస్తూ ఉండేవి. అంతులేని బాబా గొప్పతనాన్ని ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. వారి కీర్తి నలుమూలలా వ్యాపించాయి. అన్ని దేశములనుండి భక్తులు షిరిడీకి తండోపతండాలుగా రాసాగారు. బాబా ఎప్పుడూ ధునికెదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునేవారు. ఒకొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒకొక్కప్పుడు స్నానము చేసేవారు. మరొక్కప్పుడు స్నానము లేకుండా ఉండేవారు.

 

 

తొలిరోజుల్లో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధాలు ఇచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేస్తూ ఉండేవి. వారు గొప్ప 'హకీం'(వైద్యుడు) అనే పేరు వచ్చింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పాలి. ఒక భక్తునికి కళ్ళు వాచి ఎర్రబడ్డాయి. శిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతన్ని బాబా దగ్గరికి తీసుకువెళ్ళారు. సామాన్యంగా అలాంటి రోగులకు అంజనములు ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధాలు వైద్యులు ఉపయోగించేవారు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి, ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దాన్ని పెట్టి గుడ్డతో కట్టు కట్టారు. మరుసటి రోజు ఆ కట్లను విప్పి నీళ్ళను ధారగా పోశారు. కండ్లలోని పూసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యాయీ నల్లజీడి పిక్కలను నూరి కళ్ళలో పెట్టినా సున్నితమైన కళ్ళు మండలేదు. అటువంటి చిత్రాలు అనేకం ఉన్నాయి. కాని అందులో ఇదొకటి మాత్రమే చెప్పబడింది.

 

 

 

బాబా యోగాభ్యాసములు :

సాయిబాబాకి సకల యోగాప్రక్రియలు తెలిసి ఉండేది. ధౌతి, ఖండయోగము, సమాధి మొదలైన షడ్విధ యోగప్రక్రియాలలో బాబా ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణించబడ్డాయి.
1 ధౌతి :

 

 

మసీదుకు చాలా దూరంలో ఒక మఱ్ఱిచెట్టు ఉంది. అక్కడొక బావి ఉంది. ప్రతి మూడురోజులకు ఒకసారి బాబా అక్కడికి వెళ్ళి ముఖప్రక్షాళనం, స్నానము చెస్తూ ఉండేవారు. ఆ సమయంలో బాబా తన ప్రవులను బయటికి తీసి, వాటిని నీతితో శుభ్రపరిచి, పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయటం షిరిడీలోని కొందరు కళ్ళారా చూసి చెప్పారు. మామూలుగా ధౌతిఅంటే 3 అంగుళాల వెడల్పు 22 1/2 అడుగుల పొడవుగల గుడ్డను మింగి కడుపులో అరగంటవరకు ఉండనిచ్చి తరువాత తీస్తారు. కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టం, అసాధారణమైనది.

2 ఖండయాగము :

 

 

బాబా తన శరీర అవయవాలన్నీ వేరు చేసి మసీదులో వేర్వేరు స్థలాలలో విడిచి పెట్టేవారు. ఒకరోజు ఒక పెద్దమనిషి మసీదుకు వెళ్ళి బాబా అవయవాలు వేర్వేరు స్థలాలలో పడి ఉండటం చూసి భయకంపితుడై బాబాబి ఎవరో ఖూనీ చేశారు అనుకుని గ్రామ మునసబు దగ్గరకి వెళ్ళి ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నారు. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసినవారికి ఆ విషయము గురించి కొంచెమైనా తెలిసు ఉంటుందని తననే అనుమానిస్తారని భయపడి ఊరుకున్నాడు. మరుసటి రోజు మసీదుకు వెళ్లగా, బాబా ఎప్పటిలా హాయిగా కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ముందురోజు తాను చూసినదంతా భ్రాంతి అనుకున్నాడు.
చిరుప్రాయమునుండి బాబా వివిధ యోగప్రక్రియలు చేస్తూ ఉండేవారు. వారి యోగాస్థితి ఎవ్వరికీ అంతుబట్టనిది. రోగుల దగ్గరనుండి డబ్బు పుచ్చుకోకుండా ఉచితముగా చికిత్స చేస్తూ ఉండేవారు. ఎందరో పేదలు వ్యదార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందారు. నిస్వార్థముగా వారు చేసే సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చింది. బాబా తమ సొంతంకోసం ఏమీ చేయక, ఇతరుల మేలుకొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాను అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదాన్ని ఈ క్రింద పేర్కొంటాను. దీన్ని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ్రహృదయము తెలుస్తుంది.

బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము:

 

 

1910 సంవత్సరము (ఘనత్రయోదశి నాడు, అనగా)దీపావళి పండుగ ముందురోజు బాబా ధుని దగ్గర కూర్చుని చలికాచుకుంటూ, ధునిలో కట్టెలు వేయసాగారు. ధుని బాగా మండుతుంది. కొంతసేపయిన తరువాత హఠాత్తుగా కట్టెలకు బదులు తన చేతిని ధునిలో పెట్టి, నిశ్చలంగా వుండిపోయారు. మంటలకు చేతులు కాలిపోయాయి. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండే దీన్ని చూసి, వెంటనే బాబా వైపు పరుగెత్తారు. మాధవరావు దేశపాండే బాబా నడుముని పట్టుకుని బలంగా వెనక్కులాగారు. "దేవా! యిలా ఎలా చేశారు'అని బాబాని అడిగారు. (మరేదో లోకంలో ఉన్నట్లున్న) బాబా బాహ్యస్మృతి తెచ్చుకుని "ఇక్కడికి చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో వుంచుకుని, కొలిమిని ఊదుతూ ఉంది. అంతలో ఆమె భర్త పిలిచాడు. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె త్వరగా లేచింది. బిడ్డ మండుతున్న కొలిమిలో పడిపోయాడు. వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించాను. నా చేయి కాలితే కాలింది. అది నాకంత బాధాకారము కాదు. కాని బిడ్డ రక్షింపబడ్డాడు అనే విషయము నాకు ఆనందము కలుగచేస్తుంద''ని జవాబిచ్చారు.

కుష్టిరోగ భక్తుని సేవ :

 

 

 

బాబా చెయ్యి కాలిందనే విషయం మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానా సాహెబు చాందోర్కరు వెంటనే బొంబాయినుండి డాక్టరు పరమానంద్ అనే ప్రఖ్యాత వైద్యుణ్ణి వెంటబెట్టుకొని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరుకున్నారు. చికిత్స చేయడానికి డాక్టరుకి కాలిన చేయి చూపించమని నానా కోరారు. బాబా అందుకు ఒప్పుకోలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీశిందే అనే కుష్టిరోగి ఏదో ఆకువేసి కట్టు కట్టేవాడు. నానా ఎంత వేడుకున్నా బాబా డాక్టరుగారిచే చికిత్స చేయించుకోడానికి ఒప్పుకోలేదు. డాక్టరుగారు కూడా అనేకసార్లు వేడుకున్నారు. 'అల్లాయే తన వైద్యుడనీ', 'తనకేమాత్రము బాధలేదని' చెపుతూ, ఎలాగో డాక్టరుచే చికిత్స చేయించుకోడానికి దాటవేయసాగారు. అందుకే డాక్టరు మందులపెట్టె మూతైనా తీయకుండానే తిరిగి బొంబాయి వెళ్ళిపోయారు. కాని అతనికి ఈ మిషతో బాబా దర్శనభాగ్యము లభించింది

 

 

ప్రతిరోజూ భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కడుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తరువాత గాయం మానిపోయింది. అందరూ సంతోషించారు. అప్పటికీ ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉందా అనే సంగతి ఎవరికీ తెలియదు. కాని, ప్రతిరోజూ ఉదయము భాగోజీ పట్టీలను విప్పి, బాబా చేతిని నేతితో తోమి, తిరిగి కట్టు కడుతుండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండేది. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతా నిజానికి అవసరము లేకపోయినప్పటికీ తన భక్తుడైన భాగోజీ యందు గల ప్రేమతో అతడు చేసే ఉపాసనను తీసుకున్నారు. బాబా లెండీకి వెళ్ళినప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడుస్తూ ఉండేవాడు. ప్రతిరోజూ ఉదయము బాబా ధుని దగ్గర కూర్చోగానే భాగోజీ తన సేవాకార్యక్రమాన్ని మొదలుపెట్టేవాడు. భాగోజీ గతజన్మలో చేసిన పాపఫలితంగా ఈ జన్మలో కుష్ఠురోగముతో బాధపడుతుండే వాడు. వాని వ్రేళ్ళు ఈడ్చుకుని పోయి ఉండేవి. వాని శరీరమంతా చీము కారుతూ, దుర్వాసన కొడుతుండేది. బాహ్యమునకు అతడెంత అదృష్టవంతుడిలా కనిపించినప్పటికీ, అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకంటే అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు.

ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాథి :

 

 

 

బాబా విచిత్రలీలలలో ఇంకొకదాన్ని వర్ణిస్తాను. అమరావతి నివాసి అయిన దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని రోజులు వుంది. ఒకరోజు ఖాపర్డే కుమారునికి తీవ్రంగా జ్వరము వచ్చింది. అది ప్లేగు జ్వరము క్రింద మారింది. తల్లి చాలా భయపడింది. షిరిడీ విడిచి అమరావతి వెళ్ళిపోవాలని అనుకుని సాయంకాలము బాబా బూటీవాడా దగ్గరకి వస్తున్నప్పుడు వారిని సెలవు అడగబోయింది. గద్గదకంఠంతో తన చిన్నకొడుకు ప్లేగుతో పడి వున్నాడని బాబాకు చెప్పింది. బాబా ఆమెతో దయతో మృదువుగా యిలా అన్నారు "ప్రస్తుతము ఆకాశము మబ్బుపట్టి ఉంది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలంగా అవుతుంది'' అలా అంటూ బాబా కఫ్నీని పైకి ఎత్తి, చంకలో కోడిగుడ్డంత పరిమాణంలో ఉన్న నాలుగు ప్లేగు పోక్కులను చూపెడుతూ "నా భక్తులకోసం నేను ఎలా బాధపడతానో చూడు! వారి కష్టాలన్నీ నావే!'' ఈ మహాద్భుత లీలలను చూసిన జనాలకు, మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎలా స్వీకరిస్తారో అనే విషయం స్పష్టమయ్యింది. మహాత్ముల మనస్సు మైనం కన్నా మెత్తనిది, వెన్నలా మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారము అదీ ఆశించక ప్రేమిస్తారు. భక్తులనే తమ స్వజనులుగా భావిస్తారు.

బాబా పండరి ప్రయాణము!

 

 

 

సాయిబాబా తన భక్తులను ఎలా ప్రేమిస్తూ ఉంటారో అలాగే వారి కోరికలను, అవసరాలను ఎలా గ్రహిస్తూ ఉంటారో అనే కథను చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందూరుబారులో మామల్తదారుగా ఉండేవారు. అతనికి పండరీపురానికి బదిలీ అయ్యింది. సాయిబాబాలో అతనికి గల భక్తీ అనే ఫలము ఆరోజుకి పండింది.పండరీపురాన్ని భూలోకవైకుంఠం అనేవారు. అలాంటి స్థలానికి బదిలీ అవడంతో అతను గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరీకి వెళ్ళి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉంది. షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయకుండా, హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యారు. ముందుగా షిరిడీకి వెళ్ళి తన విఠోబాఅయిన బాబాబు దర్శించి, ఆ తరువాత పండరికి వెళ్ళిపోవాలి అనుకున్నారు. నానాసాహెబు శిరిడీకి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడు అవటం చేత గ్రహించారు. నానాసాహెబు నీమ్ గాం చేరుకునేసరికి షిరిడీ మసీదులో కలకలం చెలరేగింది. బాబా మసీదులో కూర్చుని మహల్సాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడుతూ ఉన్నారు. హఠాత్తుగా బాబా వారితో ఇలా అన్నారు "మన నలుగురము కలిసి భజన చేద్దాము. పండరీ ద్వారములు తెరిచారు. కనుక ఆనందంగా పాడదాము లేవండి'' అందరు కలిసి పాడుతూ ఉన్నారు. ఆ పాత యొక్క భావము ఏమిటంటే "నేను పండరి వెళ్ళాలి. నేనక్కడే నివశించవలెను. ఎందుకంటే, అదే నా ప్రభువు యొక్క ధామము''

 

 

అలా బాబా పాడుతూ ఉన్నారు. భక్తులందరూ బాబాబు అనుసరించారు. కొద్దిసేపటికి నానాసాహెబు కుటుంబసమేతంగా వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, తనకు పండరీపురానికి బదలీ అయినదనీ, బాబా కూడా వారితో పండరీపురానికి వచ్చి వుండవలసిందనీ వేడుకున్నారు. అలా బతిమాలడం అవసరం లేదు. ఎలా అంటే బాబా అప్పటికే పండరీ వెళ్ళాలని, అక్కడే ఉండ వలెనని భావాన్ని వెలిబుచ్చుచున్నారని మిగిలిన భక్తులు చెప్పారు. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదాములపై పడ్డాడు. బాబా యొక్క ఊది ప్రసాదాన్ని, ఆశీర్వాదాన్ని, ఆజ్ఞను పొంది, నానాసాహెబు పండరికి వెళ్ళారు. ఇలా బాబా లీలలకు అంతులేదు.

 

ఏడవ అధ్యాయము సంపూర్ణము

మొదటిరోజు పారాయణము సమాప్తము