Read more!

రామకథ విన్న సీతమ్మ మానసిక పరిస్థితి!

 

రామకథ విన్న సీతమ్మ మానసిక పరిస్థితి!

హనుమంతుడు శింశుపా వృక్షం మీద కూర్చుని రామకథ చెప్పగానే సీతమ్మ మొత్తం కథ అవినింది.  ఇంతవరకూ వినపడని రామనామం వినపడేసరికి సీతమ్మ అప్రయత్నంగా తన మెడకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది. ఆ కథని విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ శింశుపా వృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా, దగ్గర దగ్గరగా వచ్చి, కాళ్ళతో కొమ్మని పట్టుకొని, చేతులతో ఆకులని పక్కకి తొలగించి, తెల్లటి వస్త్రములను ధరించినవాడై, పింగళ వర్ణంతో, పచ్చటి నేత్రాలతో, పగడాల మూతిలాంటి మూతితో రామ కథ చెబుతున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దగ్గరగా కనబడ్డాడు. అలా ఉన్న హనుమని చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేలమీద పడిపోయింది.

తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడింది. (కలలో వానరము కనపడితే కీడు జరుగుతుందని అంటారు) 'లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి" అని అన్నాక  అసలు నాకు నిద్ర వస్తేకదా కల రావడానికి, నేను అసలు నిద్రపోలేదు. కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడం వలన రామ కథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను' అనుకుని మళ్ళి పైకి చూసింది. చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు.

అప్పుడు సీతమ్మ ఇలా పలికింది "ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, బ్రహ్మగారికి నమస్కారం, ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక" అని సీతమ్మ దేవతలని ప్రార్ధన చేసింది.

అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి "అమ్మా! నేను అబద్ధం చెప్పలేదు. నేను యదార్ధం చెప్పాను. నేను రామదూతని, సుగ్రీవుడి సచివుడిని, నన్ను నమ్మమ్మా" అన్నాడు.

సీతమ్మ "ఎవడు 100 సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో, వాడు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటాడు. నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను" అని పలికింది.

అప్పుడు హనుమంతుడు "అమ్మా! నువ్వు దేవతలకి చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వులకు చెందినదానివా, కిన్నెరులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా, అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా. నీ పాదములు భూమి మీద ఆనుతున్నాయి. కనుక నువ్వు దేవతా స్త్రీవి కావు. నీలో రాజలక్షణాలు కనపడుతున్నాయి కనుక నువ్వు కచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయ్యి ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు కాని జనస్థానంలో రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మవి కాదు కదా?" అన్నాడు.

సీతమ్మ "ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులలో చాలా గొప్పవాడైన, శత్రుసైన్యాలని చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడలని నేను. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజుకి కూతురిని, నన్ను సీత అంటారు. బుద్ధిమంతుడైన రాముడికి ఇల్లాలిని. నేను అయోధ్యలో 12 సంవత్సరములు హాయిగా గడిపాను, కాని 13వ సంవత్సరంలో దశరథుడి ఆజ్ఞ మేర దండకారణ్యానికి వచ్చాము. రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు" అని పలికింది.

'సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది' అని హనుమంతుడు అనుకొని ఆమె దగ్గరికి గబగబా వెళ్ళాడు. అలా వస్తున్న హనుమని చూసి సీతమ్మ మళ్ళి మూర్చపోయింది. కొంతసేపటికి తేరుకొని "నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి, మళ్లీ రూపం మార్చుకొని వచ్చావు" అనింది.

◆వెంకటేష్ పువ్వాడ.