Read more!

సీతమ్మ ప్రశ్నకు హనుమంతుడి సమాధానం!

 

సీతమ్మ ప్రశ్నకు హనుమంతుడి సమాధానం!

హనుమంతుడు చెప్పిన కథ అంతా విన్న సీతమ్మ ఒకవైపు సంతోషించినా మరొకవైపు అయోమయానికి లోనయ్యింది. రావణాసుడే వానరం రూపంలో వచ్చాడని అపోహ పడింది. కానీ తరువాత హానుమంతుడిని చూసి "ఈ వానరాన్ని చూసి అనుమానం వచ్చినా మనసులో మాత్రం ఎందుకో చెప్పలేని ఆప్యాయత కలుగుతోంది. ఈ వానరం మాయవి అని నమ్మడానికి మనసు ఒప్పడం లేదు. అందుకే నేరుగా అడిగేస్తాను" అనుకుంది.

అలా అనుకోగానే "చూడు నాయనా!! నువ్వు ఎవరో నిజంగా నాకు అర్థమయ్యేలా చెప్పు" అని అడిగింది.

అప్పుడు హనుమంతుడు "అమ్మా! నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు, తరువాత జటాయువు ప్రాణములు వదిలాడు. తరువాత కబంధుడు కనబడ్డాడు. ఆ తరువాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసిన తరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాలని పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకొని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు, సంభరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి, మా తల్లి అంజనా దేవి క్షేత్రాముగా వాయుదేవుడికి ఔరస పుత్రుడిని నేను. నేను నీ కుమారుడివంటి వాడను. నేను రామ దూతని తల్లి. రాముడు నీకోసం బెంగపెట్టుకుని ఉన్నాడు తల్లి, నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లీ" అన్నాడు.

అప్పుడు సీతమ్మ "నువ్వు వానరుడివి, రాముడు నరుడు. నరవానరములకి స్నేహం ఎలా కుదిరింది? నా బాధ పోవాలంటే నేను రాముడి గుణములు వినాలి. నువ్వు అంత రామ భక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు?" అని పలికింది.

హనుమంతుడు అన్నాడు "రాముడంటే మూర్తీభవించిన ధర్మం, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. శ్రీరాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు, అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి. ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి. తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు, క్షమించడంలో భూమితో సమానమైనవాడు, బుద్ధియందు బృహస్పతితో సమానమైనవాడు, కీర్తినందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదవేదాంగములు తెలుసు అని చెపుతూ. రాముడి కాలిగోళ్ళ నుండి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకూ ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. (ఆ సమయంలోనే రాముడు 96 అంగుళములు అంటే 8 అడుగులు ఉంటాడని హనుమంతుడు చెప్పాడు)

అలానే "అమ్మా! రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఎవరిని, ఎప్పుడు, ఏ లోకములో, ఎలా కాపాడాలో తెలిసున్నవాడు, నడువడి ప్రధానమైనవాడు రాముడంటే. ఆయన కర్త, కారణమై ఈ సమస్త జగత్తునందు నిండిపోయాడు.

వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః
రామనామాంకితం చేదం పశ్య దేవంహుళీయకం||
ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా | సమాశ్వసిపి భద్రం తే క్షీణ దుఃఖఫలా హ్యసి ||

(ఈ శ్లోకాలు పరమ పావనమైనవి, వీటిని సుందరకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు, 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది. ఈ శ్లోకాలు ఎవరు విన్నా ఎంతో ప్రశాంతతను, దుఃఖం నుండి విముక్తిని పొందుతారు)

అమ్మా! నేను వానరుడిని, రాముడి పలుకున వచ్చిన రామదూతని రామనామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను. నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవ్వాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి, ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు" అన్నాడు.

                                ◆వెంకటేష్ పువ్వాడ.