Read more!

సమ్మక్క కథని మర్చిపోగలమా!

 

 

 

సమ్మక్క కథని మర్చిపోగలమా!

 

 

మాఘమాసం వచ్చిందంటే చాలు... వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రగా మారిపోతుంది. మిగిలిన రోజుల్లో నిశ్శబ్దంగా ఉండే అక్కడి మేడారం ప్రాంతం దేవతలు పూనినట్లుగా హోరెత్తిపోతుంది. ఏటా మాఘమాసంలో నాలుగురోజులపాటు జరిగే ఆ సమ్మక్క- సారక్క జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. కన్నెపల్లిలో కొలువైన సారలమ్మను మేడారానికి తీసుకురావడంతో ఈ జాతర ఆరంభం అయినట్లు లెక్క! సమ్మక్క అంటే ఎవరో ఆషామాషీ మనిషి కాదు. గిరిజనులు తమ గుండెల్లో గుడి కట్టుకుని కొలుచుకునే దేవత. వారికోసం ప్రాణాలని సైతం అర్పించిన ధీర వనిత.

సమ్మక్క- సారక్క కథ ఈనాటిది కాదు. దాదాపు 700 సంవత్సరాలనాటి కథ ఇది. 13 శతాబ్దంలో కరువుకాటకాలతో అల్లాడుతున్న మేడారం ప్రాంత ప్రజలని ఆదుకునేందుకు అవతరించిన దేవతగా సమ్మక్కను భావిస్తారు. సమ్మక్క తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఒకసారి ఇక్కడి కోయదొరలు వేటకని వెళ్లినప్పడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకునేవారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులూ, సింహాలూ ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించేవారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట.

 



సమ్మక్కకి యుక్తవయసు రాగానే ఆమెను మేడారాన్ని పాలించే పగిడిద్దరాజుకి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. వారి వైవాహిక జీవితం ఒక అందమైన జానపద కథలా సాగిపోయింది. వారిరువురికీ జంపన్న, సారక్క, నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు పుట్టారు. ప్రతి కథలోనూ ఉన్నట్లే వారి జీవితంలోనూ అనుకోని మలుపులు మొదలయ్యాయి. కొన్నాళ్లుగా సుభిక్షంగా ఉంటున్న మేడారం మళ్లీ కరువు కోరలలో చిక్కుకుపోయింది. మరోవైపు ఏటా తనకి కట్టాల్సిన కప్పాన్ని పంపమంటూ ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుని నుంచి కబురు మీద కబురు రాసాగింది. కరువు వల్ల తాను కప్పాన్ని కట్టలేనని పగిడిద్దరాజు ఎంతగా వేడుకున్నా లాభం లేకపోయింది. పగిడిద్దరాజుని ప్రతాపరుద్రుడు పరిహసించడమే కాకుండా, కప్పం కట్టలేకపోతే పోరు తప్పదని హెచ్చరించాడు.

 



ఇక మేడారం ప్రజలకు రణం తప్ప మరో మార్గం లేకపోయింది. ఒకపక్క కాకతీయ సైన్యం వేలకి వేలుగా తరలివస్తోంది. వారికి తోడు బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులు వెంట ఉన్నాయి. ఇటు చూస్తేనేమో మేడారం ప్రజలకి బాణాలు, మొండికత్తులే ఆయుధాలుగా ఉన్నాయి. ప్రాణాలు పోవడం ఖాయమని తెలిసినా ధీరులుగా పోరుని సలిపారు మేడారం ప్రజలు. కాకతీయుల మీద విరుచుకుపడుతున్న పగిడిద్దరాజు వందలు వందలుగా మీద పడుతున్న సైన్యం ముందు నిలువలేకపోయాడు. ఒంటినిండా గాయాలతో కన్నుమూశాడు. భర్త మరణవార్తను వినగానే సారక్క తన పిల్లలు, అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి దూకింది.



 

సమ్మక్క సాహసం ముందు సైనికులెవ్వరూ నిలువలేకపోతున్నారు. నిదానంగా కాకతీయులు ఒకో అడుగూ వెనక్కి వేయవలసి వస్తోంది. ఇక ఆమెకి సారలమ్మ కూడా తోడవడంతో వారి విజయం ఖాయంగా తోచింది. దాంతో శత్రుసైన్యం కుట్రలను ఆశ్రయించింది. వేలాదిమంది సైనికులు ఒక్కసారిగా సమ్మక్క-సారక్కల మీద విరుచుకుపడ్డారు. మరికొందరు చాటు నుంచి బాణాలను ఎక్కుపెట్టారు. వెన్నుపోట్లతో సమ్మక్క-సారక్కల దేహాలు తూట్లుపడిపోయాయి. సారక్క అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది. సమ్మక్క మాత్రం నడుచుకుంటూ చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్లింది. ఒకప్పుడు ఆమెను పసిపాపగా కనిపించిన ప్రాంతం అదే! సారక్కను వెంబడిస్తూ వెళ్లిన వారికి ఆమె అగుపించలేదు సరికదా... బదులుగా ఒక చెట్టు కింద కుంకుమభరిణె కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమభరిణగా మారిపోయిందని భక్తుల నమ్మకం. ఇది జరిగి వందల సంవత్సరాలు గడుస్తున్నా ఆమె తమ పసుపుకుంకాలను కాపాడుతూ, కోరిన సంతానాన్ని ప్రసాదిస్తూ, రోగాలను నయం చేస్తూ దయ చూపుతోందని విశ్వాసం. ఇదే సమ్మక్క-సారక్క జాతర వెనుక ఉన్న గాథ!